gurukala school
-
ఎస్సీ గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు పెంపు
సాక్షి, అమరావతి: ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న 1,791 మంది పార్ట్ టైమ్ టీచర్ల వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. టీచర్లతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు, హెల్త్ సూపర్ వైజర్ల వేతనాలు కూడా పెంచినట్టు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, పీఈటీలు, హెల్త్ సూపర్ వైజర్ల వేతనాలు పెంచాలంటూ ఉపాధ్యాయులు చేసిన విజ్ఞప్తి మేరకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గతంలో జూనియర్ లెక్చరర్ల(జేఎల్)వేతనం రూ.18 వేలు ఉండగా.. దీనిని రూ.24,150కు పెంచినట్టు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల(పీజీటీ) వేతనం రూ.16,100 నుంచి రూ.24,150కు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల(టీజీటీ) వేతనం రూ.14,800 నుంచి రూ.19,350కు, వ్యాయామ ఉపాధ్యాయుల (పీఇటీ) వేతనం రూ.10,900 ఉండగా.. దానిని రూ.16,350కు పెంచినట్టు చెప్పారు. వీరితో పాటు హెల్త్ సూపర్ వైజర్, స్టాఫ్ నర్స్‌ల వేతనం రూ.12,900 ఉండగా దాన్ని రూ.19,350కు పెంచామన్నారు. కాగా, తమ కష్టాలను గుర్తించి తమ వేతనాలను పెంచినందుకు గురుకుల విద్యాలయాల సంస్థ ఉద్యోగుల జేఏసీ నేతలు, టీచర్లు మంత్రి మేరుగు నాగార్జునను శుక్రవారం సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నాగభూషణం మాట్లాడుతూ తాము కోరిన వెంటనే న్యాయం చేశారని కొనియాడారు. -
సత్తా చాటిన గురుకుల విద్యార్థులు
రాయదుర్గం: పేదింటి విద్యార్థులు ఇంజినీర్లు...డాక్టర్లు కాబోతున్నారు. ఇంటర్మీడియేట్ విద్యతోపాటు ఐఐటీ, నీట్, ఎంసెట్ ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో విద్యార్థులు ఆయా పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ బాలుర ఐఐటీ, జేఈఈ నీట్, ప్రెప్ అకాడమీ విద్యాలయం తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఉపాధ్యాయుల సమష్టి కృషి, విద్యార్థుల కష్టపడే తత్వం, క్రమ శిక్షణ, పోటీ పడి చదవాలనే తపనతో వారు ఇంటర్మీడియట్‌తోపాటు ఉన్నత విద్య కోసం రాసే పరీక్షల్లో సీట్లు సాధిస్తున్నారు. పక్కాగా టైం టేబుల్.. ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరూ రైతు కూలీ లు, కూరగాయల విక్రయదారులు, రైతులు, ఇతర సామాన్య, పేద వర్గాలకు చెందిన వారి పిల్లలే కావ డం గమనార్హం. రోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు టైంటేబుల్ ఆధారంగా చదువుకోవడం, ఏవైనా డౌట్లు ఉంటే ఉపాధ్యాయులతో మాట్లాడి వాటిని నివృత్తి చేసుకోవడం జరుగుతోంది. దీంతోపాటు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడమేగాక, వారు ఏఏ అంశాల్లో వెనుకబడ్డారో గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 161 మందికి ఎంబీబీఎస్ సీట్లు ♦ గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలబాలికల కళాశాలల్లో కలిసి 161 సీట్లు సాధించారు. ♦ ఈ ఏడాది ఇప్పటి వరకు నిర్వహించిన మొదటి రౌండ్లోనే 161 మందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ♦ కాగా మరో 29 మంది విద్యార్థులు మొదటిసారిగా ఇంటర్మీడియెట్ చదువుతూ నీట్ కోచింగ్ పొంది ఎంబీబీఎస్ సీట్లు పొందడం విశేషం. ♦ బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో మొదటిసారిగా మురళీమనోహర్ అనే విద్యార్థి ఎంబీబీఎస్ సీటు పొందారు. ♦ బి.ప్రవీణ్‌కుమార్ కేఎంసీ వరంగల్‌లో ఎంబీబీఎస్ సీటు సాధించాడు ♦ స్పందన, కావ్య, శామ్యూల్, వేణుమాధవ్తోపాటు 18 మందికి ఉస్మానియా మెడికల్ కళాశాలలో సీట్లు దక్కాయి. ♦ ఏడుగురు విద్యార్థులకు గాంధీ మెడికల్ కళాశాలలో కూడా సీట్లు పొందడం విశేషం. ♦ 120 మందికి ఐఐటీ, ఎన్ఐటీ కోసం శిక్షణ ఇవ్వగా 87 మందికి ఐఐటీ, ఎన్ఐటీలలో సీట్లు సాధించడం విశేషం. -
‘ప్రైవేటు’టీచర్లలోనే క్వాలిటీ ఉందంటే రాజీనామా
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సవాల్ హైదరాబాద్: ప్రభుత్వ టీచర్లలో ఉన్న క్వాలిటీ ప్రైవేట్ టీచర్లలో ఉందని నిరూపిస్తే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టిఎస్‌యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యా సమస్యలపైన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యావిధానం బలంగానే ఉంద న్నారు. ప్రైవేట్ సంస్థలు తమకు వచ్చిన కొద్ది ర్యాంకులను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్, ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు నారాయణ, టీఎస్‌యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డీవైఎఫ్ఐ నాయకులు చావా రవి, సాంబశివ, హైమావతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.