మా ఓట్లు కాకులెత్తుకెళ్లాయా?
సాక్షి,సిటీబ్యూరో : ‘ఓటు వేయాలని వస్తే లిస్ట్‌లో పేరు లేదని చెబుతారా? పేర్లెందుకు లేవు? వాటినేమైనా కాకులు ఎత్తుకెళ్లాయా?’ అని పలువురు ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చే శారు. శుక్రవారం నగర వ్యాప్తంగా వేలాదిమంది తమ ఓట్లు గల్లంతయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంలో ఒకరి పేరుంటే.. మరొకరి పేరు ఉండదు. మరీ విచిత్రమేమంటే ఓ పాడుబడ్డ ఇంట్లో 65 ఓట్లున్నాయి. సాధారణ ఓటర్లతో పాటు సెలబెట్రీల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజక వర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్లు మాయమయ్యాయి.
గుత్తాజ్వాల అసహనం
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఓటు గల్లంతైంది. ఆమెతో పాటు కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతయ్యారు. ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు శుక్రవారం ఉదయం ఆమె పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ జాబితాలో తన పేరు కన్పించకపోవడంతో ట్విటర్ వేదికగా అసహనాన్ని వెళ్లగక్కారు. ‘ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు నా పేరు ఉంది. ఓటర్ల జాబితాలో పేరు కన్పించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా జాబితాలో ఓటర్ల పేర్లు లేనప్పుడు ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరుగుతాయి’ అని ప్రశ్నించారు.
పాతబస్తీలో..
పాతబస్తీ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున ఓట్లు గల్లంతయ్యాయి. పలు నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు.
∙కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓ ల్యాబ్ క్వార్టర్స్ సంబంధించి ఓట్లు పెద్ద ఎత్తున గల్లంతయ్యాయి. దీంతో ఓటర్లు కేంద్రీయ విద్యాలయం కమ్యూనిటీ హల్లోని పోలింగ్ బూత్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
∙అంబర్‌పేటలోని మన్సూరాబాద్‌లో ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతయ్యాయి. పలువురు ఓటర్లు పొలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు లేదని అధికారులు తెలుపడతంతో ఆగ్రహంతో ఓటర్లు మండిపడ్డారు.
∙గోషామహాల్ నియోజకవర్గంలోని జాంబాగ్ డివిజన్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లందు కావడంతో తీవ్ర అగ్రహాం వ్యక్తం చేస్తూ పోలింగ్‌బూత్ వద్ద ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఓల్డ్‌బోయినపల్లిలో ఏడు వేల ఓట్లు ..
ఓల్డ్ బోయినపల్లి: కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో దాదాపు ఏడు వేల ఓట్లు గల్లంతయ్యాయి. ఓటరు స్లిప్‌లు రాకపోవడంతో తమ ఓటురు కార్డును, అధార్ కార్డులను తీసుకుని పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన వారికి లిస్ట్‌లో వారి పేర్లు లేక వెనుదిరిగారు. ఒక్క మల్కాజిగిరి నియోజకవర్గంలోనే సుమారు 40 వేల ఓట్లు గల్లంతైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈస్ట్ ఆనంద్‌బాగ్, మౌలాలీ, తదితర ప్రాంతాల్లోని 20 కాలనీలకు చెందిన ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు.
15వేల ఓట్లు గల్లంతు కావడమంటే కుట్రే..
నేరేడ్మెట్: ఆనంద్‌బాగ్, శివపురి, విష్ణుపురి, విమలాదేవి, చంద్రగిరి కాలనీలతోపాటు ఆర్కే.నగర్ తదితర ప్రాంతాలకు చెందిన ఓటర్లు తమ ఓట్లు గల్లంతు కావడంతో నేరేడ్మెట్లోని భవన్స్ కళాశాల డీఆర్సీకు చేరుకున్నారు. డీఆర్సీ ఎదుట ఓటు వేసే హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఓటు గుర్తింపు కార్డు ఉన్నా..ఓటు హక్కుకు దూరం చేశారని అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. పదులు ..వందలు కాదు..106 నుంచి 113 వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఐదారు కాలనీలకు చెందిన దాదాపు 15వేల ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతు చేశారని విమర్శించారు. పొరపాటు వల్ల ఒక కాలనీలో 10, 20మంది పేర్లు మిస్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం ఓటర్లందరూ గల్లంతు ఎలా అవుతారని వారు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కుట్ర ఉందని, తమ కాలనీలకు చెందిన పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఓటర్లు డిమాండ్ చేశారు. ఈ విషయమై మల్కాజిగిరి ఎన్నికల అ«ధికారి వేణుగోపాల్‌తో ఓ టర్లు వాదనకు దిగారు. ఎన్నికల అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ ఓటర్ల సవరణ, నమోదు, తొలగింపునకు అనేక సార్లు ప్రకటనలు చేశామన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి.. వేలమంది ఓటర్ల పేర్లు చేర్చినట్టు వారికి వివరించారు. ఓటర్లు ముందే జాబితాను పరిశీలించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని, మళ్లీ నమోదు చేసుకునేందుకు అ వకాశముండేదన్నారు. ఓటర్ల వివరాలను ఆన్లై న్లో పరిశీలించి అవకాశం కల్పిస్తామని ఆర్ఓ స్ప ష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం త దుపరి చర్యలు తీసుకుంటామని ఆర్ఓ పేర్కొనడంతో ఓటర్లు వెళ్లిపోయారు.