
గుత్తా జిగేల్
శోభాయమానంగా సిల్క్‌మార్క్ పోటీలు
సంప్రదాయాలకు పట్టం కట్టి నిర్వహణ
నన్నపనేనికి జీవన సాఫల్య పురస్కారం
క్రీడాకారిణి గుత్తా జ్వాల, గాయని సునీతలకు అవార్డులు
విశాఖ–కల్చరల్ : పట్టుచీరల మిలమిలలు.. అలంకరణల కళకళలు.. హŸయల తళతళలు.. చూపరులను మంత్రముగ్థులను చేసే ముద్ద మందారాల.. స్నిగ్థ సింగారాల సోయగాలు. ఇవీ ‘వైజాగ్ శ్రీమతి సిల్క్ మార్క్’ పోటీల వేదికపై ఆవిష్కతమైన సౌందర్యాల సరాగాలు. సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సాగిన కార్యక్రమంలో విరబూసిన సొగసులే కాదు.. వారి విభిన్న ప్రతిభా విశేషాలు వేదికపై తళుక్కుమన్నాయి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వి–టీమ్ సంస్థ వుడా చిల్డ్రన్స్ థియేటర్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన మార్వ్‌లస్ మహిళ–2017 కార్యక్రమంలో భాగంగా జరిగిన పోటీలు అతివల బాహ్య, అంతర్గత సొగసులకు, వ్యక్తిత్వానికి, ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టాయి. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన మహిళలకు ఇచ్చిన పురస్కారాలు వారి సత్తాను చాటాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రారంభించిన ఈ కార్యక్రమం కనులవిందుగా సాగింది. మొదట నన్నపనేని రాజకుమారికి మంత్రి గంటా జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. విభిన్న రంగాలలో స్ఫూర్తి ప్రదాతలైన మహిళలకూ ఆయన పురస్కారాలను అందజేశారు. సుప్రసిద్ద బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలను అత్యంత ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి బిరుదుతో, ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని సునీతను లతామంగేష్కర్ స్వీట్ వాయిస్ అవార్డుతో సత్కరించారు.
ముగ్థ మందారాలు
వివాహిత మహిళలకు నిర్వహించిన వైజాగ్ శ్రీమతి సిల్క్‌మార్క్ పోటీ నేత్రపర్వంగా సాగింది. గత ఆదివారం వుడా సెంట్రల్ పార్కులో నిర్వహించిన వడపోత ద్వారా 65 మందిని ఎంపిక చేసి వారికి తుది పోటీ నిర్వహించి మళ్లీ 25మందిని ఎంపిక చేశారు. వీరి నుంచి ఫైనల్ విజేతను నిర్ణయించారు. శ్రీమతి వైజాగ్ సిల్క్ మార్క్ విజేతలకు, ఫైనల్లో తలబడిన మహిళలకు నన్నపనేని రాజకుమారి, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ తార జ్వాలా గుత్తా, సినీ నేపథ్య గాయని సునీత, కలెక్టర్ సతీమణి శోభనాస్మతి, వీరుమామ బహుమతులు అందించారు. మెజిషియన్ రవిశంకర్ ఫ్లాష్ యాక్ట్ ప్రతిభ సంభ్రమాశ్చర్యాలు కలిగించింది.