సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శుక్రవారం రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. దళితులపై టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎమ్మెల్యే ఆర్కే ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వివరించారు. టీడీపీ నేతలు కూన రవికుమార్, అచ్చెన్నాయుడు,నన్నపనేని రాజకుమారిలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
డీజీపీని కలిసిన అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. ‘అధికారం కోల్పోయినా టీడీపీ నేతలకు కనువిప్పు కలగడం లేదు. ఎవరినీ లెక్క చేయం అనే ధోరణిలోనే ఉన్నారు. పోలీసులు, దళితులంటే లెక్క లేదు. అసలు చట్టాల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దళిత మహిళా ఎస్‌ఐ పట్ల టీడీపీ నేతలు చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. తమ వ్యాఖ్యలపై ఇప్పటికైనా టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు...టీడీపీ నేతలను పిలిచి బుద్ధి చెప్పాలి. వారి వైఖరి మారకుంటే భవిష్యత్‌లో టీడీపీ ఉండదు.’ అని వ్యాఖ్యానించారు.
కాగా అంతకు ముందు ఎస్‌ఐ అనురాధను కులం పేరుతో దూషించిన నన్నపనేని రాజకుమారిని అరెస్ట్ చేయాలంటూ ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో మంగళగిరిలో వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. దళిత మహిళా ఎస్‌ఐతో దురుసుగా ప్రవర్తించిన నన్నపనేనిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment