స.హ. చట్టానికి దరఖాస్తు చేస్తే..
భీమవరం క్రైం, న్యూస్‌లైన్ : నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించడంపై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసి చిక్కుల్లో పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని రోడ్ నెంబర్-20లో ఇన్నమూరి చెంచయ్య అనే వ్యక్తి రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. మూడో అంతస్తు, దానిపైన పెంట్ హౌస్ అనుమతి లేకుండా నిర్మించాడు. ఈ విషయం తెలిసిన పట్టణానికి చెందిన జీవీ సుబ్బారావు అనే వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్ 30న సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరుతూ మునిసిపల్ అధికారులకు దరఖాస్తు చేశాడు.
ఈ విషయం భవన యజమానికి లీకైంది. దీంతో అతని నుంచి దరఖాస్తుదారుడికి ఫోన్లో బెదిరింపులు ప్రారంభమయ్యాయి. అంతేకాక సుబ్బారావు బెదిరిస్తున్నాడని చెంచయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై విజయకుమార్ అత్యుత్సాహంతో స్టేషన్‌కు రావాలని సుబ్బారావుకు ఫోన్లు చేయడంతో ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో ఈనెల 21 నుంచి కనిపించకుండా పోయాడు.
దీంతో తన భర్తను చెంచయ్య, అతని అనుచరులు కిడ్నాప్ చేశారని సుబ్బారావు భార్య పద్మకుమారి వన్‌టౌన్ పోలీసులు, కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసింది. సమాచారం కోసం దరఖాస్తు చేస్తే ఇన్ని ఇబ్బందులు పడాలా అంటూ సుబ్బారావు కుటుంబ సభ్యులు విస్తుపోతున్నారు. అధికారులు, పోలీసులకు భవన యజమాని ముడుపులు చెల్లించి ఉంటాడనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారి సుబ్బారావును వివరణ కోరగా చెంచయ్య అనే వ్యక్తి అదనంగా మరొక అంతస్తును నిర్మించిన విషయం తెలిసి అతనికి నోటీసు ఇచ్చామన్నారు.