GVK company
-
108 ఉద్యోగులను తొలగిస్తే ఊరుకోం: కృష్ణయ్య
హైదరాబాద్: సమ్మె చేస్తున్న 108 అంబులెన్స్ ఉద్యోగులను తొలగిస్తే ఊరుకునేదిలేదని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. 15 రోజులుగా ప్రజాస్వామ్యయుతంగా ఆం దోళన చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తామని జీవీకే సంస్థ బెదిరించడం అప్రజాస్వామ్యం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. వెంటనే వారిని చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆదివారం జరిగిన 108 ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 108 ఉద్యోగుల్లో 95%ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి నాలుగేళ్లు దాటినా దాని ఊసేలేదన్నారు. -
‘108’ బాధ్యతల నుంచి జీవీకేను తొలగించాలి
ప్రభుత్వానికి ద్విసభ్య కమిటీ నివేదిక * ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచన * అక్రమాలపై సీబీఐ విచారణకు సిఫారసు * ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మండిపాటు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాన్ని, ప్రజలను, ఉద్యోగులను మోసం చేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న జీవీకే సంస్థను తక్షణమే ‘108’ అంబులెన్స్‌ల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీ సిఫారసు చేసింది. గత మే నెలలో ‘108’ ఉద్యోగులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలపై అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి సూచనలు, సలహాలు అందించాలని అప్పట్లో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, గాదరి కిశోర్‌లతో ప్రభుత్వం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం తన నివేదిక కు తుది రూపు ఇచ్చింది. జీవీకేను వెంటనే తొలగించాలని కమిటీ గట్టిగా సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. నివేదికలోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. * ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం అంబులెన్సుల ఆధునీకరణ కోసం రూ. 79 కోట్లు కేటాయించింది. కానీ రూ. 5 కోట్లు మాత్రమే ఖర్చుచేసి... మిగిలిన రూ.74 కోట్లను జీవీకే సొంతానికి వాడుకుంది. * సంస్థలో సుమారు రూ. 15 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ నివేదిక ఇచ్చింది. కానీ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. * ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నడుస్తున్న 4 ఆంధ్ర అంబులెన్సులకు తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ. 1.20 లక్షల చొప్పున రూ. 4.80 లక్షలు చెల్లిస్తోంది. ఇప్పటివరకు దాదాపు రూ. 60 లక్షలు చెల్లించింది. ఇది జీవీకేలో అతిపెద్ద అవినీతి. * సంస్థలో అవినీతి, అక్రమాలపై సీబీఐతో తక్షణమే దర్యాప్తు చేయించి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలి. ఉద్యోగుల సంక్షేమం గాలికి ... * ఉద్యోగుల సంక్షేమాన్ని జీవీకే-ఈఎంఆర్ఐ సంస్థ గాలికి వదిలేసింది. అలాగే ప్రభుత్వాన్ని మోసం చేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోంది. * ఉద్యోగుల కోరికలు న్యాయసమ్మతంగానే ఉన్నాయి. వారి డిమాండ్లను అమలుచేస్తే ప్రభుత్వంపై ఎటువంటి భారం ఉండదు. * తొలగించిన ఉద్యోగుల పత్రాలను పరిశీలించాక వారి తొలగింపు అక్రమం, అన్యాయమని తేలింది. అవినీతి ఆరోపణలున్న వారిని తప్ప మిగతా వారిని తక్షణమే ఉద్యోగంలోకి తీసుకోవాలి. * ‘108’ ఉద్యోగులకు రూ.15 వేల జీతం ఇస్తే ప్రభుత్వంపై ఎటువంటి భారం పడదు. ప్రతీ ఉద్యోగికి రూ. 4,500 వేతనం పెంచడానికి వీలుంది. * ప్రతీ అంబులెన్సుకి 2:5 నిష్పత్తి చొప్పున 1580 మంది ఉద్యోగులు కావాలి. కానీ ప్రస్తుతం 1526 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన సిబ్బందికి చెందిన సొమ్మును జీవీకే మిగుల్చుకుంటోంది. * ఉద్యోగులకు ఎంపీడీవో కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో క్వార్టర్లు నిర్మించాలి. * జిల్లాల వారీగా ఉద్యోగులకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పించాలి. ఉద్యోగులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలి. * ప్రతీరోజూ రోగులతో కలసి ఉంటారు కాబట్టి వారికి హెపటైటిస్-బీ వంటి వ్యాక్సిన్ ఇప్పించాలి. ‘108’ ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులు ఇప్పించాలి. -
ప్రభుత్వ చేతుల్లోకి 108!
యోచిస్తున్నామన్న మంత్రి రాజయ్య సాక్షి, హైదరాబాద్: అవసరమైతే 108 అంబులెన్స్ సర్వీసును తెలంగాణ ప్రభుత్వమే సొంతంగా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య గురువారం అసెంబ్లీలో తెలిపారు. దీనిపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతామన్నారు. వీటి నిర్వహణపై జీవీకే సంస్థ సరిగా వ్యవహరించడం లేదన్న జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) వ్యాఖ్యలపై ఆయన ఇలా స్పందించారు. జీవీకే తీరు సరిగా లేకపోవడంతో ఆ సంస్థను ప్రభుత్వం ఇటీవల తీవ్రంగా మందలించిందని చెప్పారు. ఇక, 2018 నాటికి రాష్ర్టంలో మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పలు పద్దులకు సభ ఆమోదం గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం పలు శాఖల పద్దులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎక్సైజ్, రవాణా, ఐటీ, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్, వ్యవసాయం, హోం, విద్య, వైద్య ఆరోగ్యం, నీటిపారుదల, రెవెన్యూ శాఖల పద్దులపై అన్ని పక్షాల సభ్యులు మాట్లాడారు. బకాయిలున్న గ్రామ పంచాయతీల్లో విద్యుత్ కనెక్షన్ తొలగించకుండా చూస్తామని, రాష్ర్ట విభజన సమయంలో చెల్లించని ఉపాధి హామీ వేతనాల బకాయిల సొమ్ము రూ. 94 కోట్లను విడుదల చేస్తామని మంత్రులు చెప్పారు. అధికారాలను గ్రామ పంచాయతీలకు దఖలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. త్వరలో కొత్త పంచాయతీ చట్టాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. కాగా, సాయంత్రం నుంచి టీడీపీ సభ్యులెవరూ సభలో లేకపోవడం గమనార్హం. సభ అర్ధరాత్రి 12.40 దాకా సాగింది.