‘108’ బాధ్యతల నుంచి జీవీకేను తొలగించాలి | '108' responsibilities GVK to Remove | Sakshi
Sakshi News home page

‘108’ బాధ్యతల నుంచి జీవీకేను తొలగించాలి

Published Tue, Sep 8 2015 4:01 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

‘108’ బాధ్యతల నుంచి జీవీకేను తొలగించాలి

‘108’ బాధ్యతల నుంచి జీవీకేను తొలగించాలి

ప్రభుత్వానికి ద్విసభ్య కమిటీ నివేదిక
* ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచన
* అక్రమాలపై సీబీఐ విచారణకు సిఫారసు
* ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాన్ని, ప్రజలను, ఉద్యోగులను మోసం చేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న జీవీకే సంస్థను తక్షణమే ‘108’ అంబులెన్స్‌ల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీ సిఫారసు చేసింది.

గత మే నెలలో ‘108’ ఉద్యోగులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఉద్యోగుల సమస్యలపై అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి సూచనలు, సలహాలు అందించాలని అప్పట్లో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, గాదరి కిశోర్‌లతో ప్రభుత్వం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం తన నివేదిక కు తుది రూపు ఇచ్చింది. జీవీకేను వెంటనే తొలగించాలని కమిటీ గట్టిగా సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. నివేదికలోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.
 
* ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం అంబులెన్సుల ఆధునీకరణ కోసం రూ. 79 కోట్లు కేటాయించింది. కానీ రూ. 5 కోట్లు మాత్రమే ఖర్చుచేసి... మిగిలిన రూ.74 కోట్లను జీవీకే సొంతానికి వాడుకుంది.  
* సంస్థలో సుమారు రూ. 15 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ నివేదిక ఇచ్చింది. కానీ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
* ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నడుస్తున్న 4 ఆంధ్ర అంబులెన్సులకు తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ. 1.20 లక్షల చొప్పున రూ. 4.80 లక్షలు చెల్లిస్తోంది. ఇప్పటివరకు దాదాపు రూ. 60 లక్షలు చెల్లించింది. ఇది జీవీకేలో అతిపెద్ద అవినీతి.
* సంస్థలో అవినీతి, అక్రమాలపై సీబీఐతో తక్షణమే దర్యాప్తు చేయించి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలి.
 
ఉద్యోగుల సంక్షేమం గాలికి ...
* ఉద్యోగుల సంక్షేమాన్ని జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థ గాలికి వదిలేసింది. అలాగే ప్రభుత్వాన్ని మోసం చేస్తూ  నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోంది.
* ఉద్యోగుల కోరికలు న్యాయసమ్మతంగానే ఉన్నాయి. వారి డిమాండ్లను అమలుచేస్తే ప్రభుత్వంపై ఎటువంటి భారం ఉండదు.
* తొలగించిన ఉద్యోగుల పత్రాలను పరిశీలించాక వారి తొలగింపు అక్రమం, అన్యాయమని తేలింది. అవినీతి ఆరోపణలున్న వారిని తప్ప మిగతా వారిని తక్షణమే ఉద్యోగంలోకి తీసుకోవాలి.
* ‘108’ ఉద్యోగులకు రూ.15 వేల జీతం ఇస్తే ప్రభుత్వంపై ఎటువంటి భారం పడదు. ప్రతీ ఉద్యోగికి రూ. 4,500 వేతనం పెంచడానికి వీలుంది.
* ప్రతీ అంబులెన్సుకి 2:5 నిష్పత్తి చొప్పున 1580 మంది ఉద్యోగులు కావాలి. కానీ ప్రస్తుతం 1526 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన సిబ్బందికి చెందిన సొమ్మును జీవీకే మిగుల్చుకుంటోంది.
* ఉద్యోగులకు ఎంపీడీవో కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో క్వార్టర్లు నిర్మించాలి.
* జిల్లాల వారీగా ఉద్యోగులకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పించాలి. ఉద్యోగులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలి.
* ప్రతీరోజూ రోగులతో కలసి ఉంటారు కాబట్టి వారికి హెపటైటిస్-బీ వంటి వ్యాక్సిన్ ఇప్పించాలి. ‘108’ ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులు ఇప్పించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement