H 4
-
భారతీయ మహిళలకే అధిక ప్రయోజనం!
వాషింగ్టన్: అమెరికాలో హెచ్4 వీసాలు ఉన్నవారికి పని అనుమతిని రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఉపసంహరించారు. ఈ నిర్ణయంలో భారతీయ మహిళలే అధికంగా ప్రయోజనం పొందుతారన్న అంచనాలు వెలువడుతున్నాయి. హెచ్–1బీ వీసా కలిగి ఉన్నవారి జీవిత భాగస్వాములకు(భార్య లేదా భర్త), వారి పిల్లలకు (21 ఏళ్లలోపు వయసు) హెచ్4 వీసాలను యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) జారీ చేస్తోంది. అమెరికాలో హెచ్–1బీ వీసా కింద పనిచేస్తున్నవారిలో అత్యధిక శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే. ఈ వీసాలతో అమెరికా కంపెనీలు విదేశీ సాంకేతిక నిపుణులను స్వదేశంలోనే నియమించుకోవచ్చు. ఇండియా, చైనా నుంచి ప్రతిఏటా వేలాది మంది హెచ్–1బీ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్నారు. బరాక్ ఒబామా ప్రభుత్వ హయాంలో హెచ్–1బీ వీసాలున్నవారి జీవిత భాగస్వాములు అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగ అనుమతి కార్డులు దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువ మంది భారతీయ మహిళలే కావడం విశేషం. డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టాక వలసలపై కఠినంగా వ్యవహరించారు. హెచ్4 వీసాదారులకు ఉద్యోగ అనుమతిని రద్దు చేస్తున్నట్లు 2017లో ప్రకటించారు. ట్రంప్ నిర్ణయాలను తిరగదోడుతామని ఎన్నికల ప్రచారంలో జో బైడెన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే.. గడువు ముగిసిన హెచ్4 వీసాదారుల ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) చెల్లుబాటును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
హెచ్–4 వీసా నిబంధన రద్దుకే మొగ్గు
వాషింగ్టన్: అమెరికాకు హెచ్–1బీ వీసాలపై వెళ్లే వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములకు అక్కడ పనిచేసుకునేందుకు వీలుగా అమలు చేస్తున్న హెచ్–4 వీసా నిబంధనల్ని రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ట్రంప్ సర్కారు మరో సారి పునరుద్ఘాటించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)కు అర్హుల జాబితా నుంచి హెచ్–4 వీసాదారుల్ని తొలగించాలని ప్రతిపాదిస్తున్నామని ఫెడరల్ రిజిస్టర్ నోటిఫికేషన్లో అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. దీనిపై అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ స్పందిస్తూ.. రూల్ మేకింగ్(చట్టం అమలు ప్రక్రియ) పూర్తయ్యేవరకూ హెచ్–4 వీసాలపై ఏ నిర్ణయం అంతిమం కాదంది. -
‘హెచ్–4’ అనుమతులు రద్దు?
వాషింగ్టన్: హెచ్–4 వీసాదారులు ఉద్యోగాలు చేసుకోవడానికి ఉన్న అనుమతులను రద్దు చేయడానికి ఉద్దేశించిన విధాన ప్రక్రియ తుది దశలో ఉందని అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఓ ఫెడరల్ కోర్టుకు గురువారం తెలిపింది. హెచ్–4 వీసాదారులకు వర్క్ పర్మిట్లను రద్దు చేసే ప్రతిపాదన ప్రస్తుతం హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) వద్ద ఉందనీ, డీహెచ్ఎస్ ఆమోదం పొందాక దీనిని మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్‌కు పంపుతామని ప్రభుత్వం కోర్టుకు తెలియ జేసింది. అనంతరం కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఈ నిబంధనను అమల్లోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తారంది. ఇంతకుముందు చెప్పినట్లుగానే హెచ్–4 వీసాలకు వర్క్ పర్మిట్లను రద్దు చేసేందుకే తాము మొగ్గుచూపుతున్నట్లు డీహెచ్ఎస్ కోర్టుకు వెల్లడించింది.హెచ్–1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న వారి జీవిత భాగస్వాములకు మంజూరు చేసేవే ఈ హెచ్–4 వీసాలు. హెచ్–4 వీసాదారులూ ఉద్యోగాలు చేసుకునేందుకు నాటి అధ్యక్షుడు ఒబామా అనుమతులిచ్చారు. ప్రస్తుతం కనీసం 70 వేల మంది హెచ్–4 వీసాదారులు ఉద్యోగాల్లో ఉన్నారు. వారిలోనూ 93 శాతం మంది.. అంటే దాదాపు 65 వేల మంది భారతీయులే. హెచ్–4 వీసాలకు వర్క్ పర్మిట్లు రద్దు చేస్తే వీరందరూ ఉద్యోగాలు చేసుకునే వీలుండదు. ఈ ప్రతిపాదనపై పలువురు అమెరికా చట్టసభల సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. -
హెచ్4 వీసాదారులకు ఉద్యోగ అర్హత కార్డులు!
దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన అమెరికా వాషింగ్టన్: అమెరికాలో హెచ్ 4 వీసాదారులు కూడా ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే ఉద్యోగ అర్హత కార్డు(ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డ్)ల దరఖాస్తు ప్రక్రియను యూఎస్ అధికారులు ప్రారంభించారు. గతంలో హెచ్ 1బీ వీసా కలిగి ఉన్నవారి జీవిత భాగస్వాములు డిపెండెంట్ వీసా(హెచ్ 4 నాన్ ఇమిగ్రంట్స్)పై అమెరికా వెళ్లినప్పటికీ వారికి అక్కడ ఉద్యోగం చేసే అవకాశం లేకుండా ఉండేది. అయితే, ఇటీవల కొన్ని కేటగిరీల హెచ్ 4 వీసాదారులకు కూడా ఉద్యోగం చేసే వీలు కల్పిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చట్టంలోనూ మార్పులు చేశారు. ఈ నిర్ణయం వల్ల 1.8 లక్షల మందికి అమెరికాలో ఉద్యోగం చేసే అర్హత లభించనుంది. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా అర్హులకు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డ్‌ను జారీ చేస్తామని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అధికారులు తెలిపారు. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డ్ పొందాలంటే హెచ్ 4 వీసా ఉన్న వ్యక్తి జీవిత భాగస్వామి(హెచ్ 1 వీసాపై యూఎస్‌లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి) అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్స్ హోదా కోసం చట్టబద్ధ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించి ఉండాలి.