అరగంటలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు!
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎంత టైమ్ పడుతుంది? వోల్వో బస్సెక్కితే... పది గంటలు! కారులో హైస్పీడ్‌లో వెళితే... ఆరు ఏడు గంటలు! విమానమెక్కితే... గంట. అంతేనా! ఇలా కాకుండా... సరిగ్గా అరగంటలోనే వెళ్లగలిగితే??? అసాధ్యం కదా అంటున్నారా? ఊహూ... సాధ్యమే. కాకపోతే కొంత టైమ్ పడుతుంది. ఈ దిశగా అప్పుడే తొలి అడుగులు పడ్డాయి కూడా!
రైట్ సోదరులు విమానాన్ని ఆవిష్కరించింది మొదలు ఇప్పటివరకూ రవాణా రంగంలో స్థూలంగా వచ్చిన మార్పులేవీ లేవు. కొంచెం వేగం పుంజుకోవడం మినహాయిస్తే... రైలు, బస్సు, విమానం, నౌకలే ప్రయాణానికి ఆధారంగా కొనసా...గుతున్నాయి. ఈ పరిస్థితి సమూలంగా మారిపోనుంది. ఎలన్ మస్క్ (ఎవరీ ఐరన్‌మ్యాన్ చూడండి) ఆలోచనలు ఫలించాయనుకోండి. కొన్నేళ్లలోనే ‘హైపర్‌లూప్’ పేరుతో అతికొత్త, వినూత్న, హైటెక్ రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. గంటకు కనీసం 600 మైళ్ల (965 కిలోమీటర్లు) వేగంతో దూసుకెళ్లే రోజులు రానున్నాయి. అంటే... హైదరాబాద్ నుంచి బెంగళూరుకు అరగంటలో పోవడం మాత్రమే కాదు.. కన్యాకుమారి నుంచి ఢిల్లీకి గంటకంటే కొంచెం ఎక్కువ సమయంలో చేరుకోవచ్చు!!
అంత వేగం సాధ్యమేనా?
2013 ఆగస్టులో ఎలన్ మస్క్ హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ గురించి తొలిసారి ప్రకటన చేసినప్పుడు... చాలామంది ఆ ఆలోచనను ఎద్దేవా చేశారు. కానీ... ఈ ప్రాజెక్టు వివరాలు ప్రపంచానికి తెలియడం మొదలైనప్పటి నుంచి విమర్శకులు కూడా ఏమో.. సాధ్యమేనేమో అనే పరిస్థితి వచ్చింది. వాహనమేదైనా ముందుకు కదలాలంటే చాలా గురుత్వాకర్షణ శక్తితోపాటు, గాలివేగం, పీడనం వంటి అనేక రకాల శక్తులను అధిగమించాలన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిమితులేవీ లేని అంతరిక్షంలో అతితక్కువ ఇంధనంతోనే ఉపగ్రహాలు సూపర్‌స్పీడ్‌తో వెళ్లడం మనం చూశాం కూడా. హైపర్‌లూప్ టెక్నాలజీ కూడా ఇలాంటిదే. కాకపోతే అంతరిక్షంలోని పరిస్థితులను కొద్దిగా మార్చి ఉపయోగిస్తారు.
గొట్టాల్లో మున్ముందుకు...
మీరు సొరంగాలను చూసే ఉంటారు కదా... కాంక్రీట్ స్తంభాలపై వందల కిలోమీటర్ల పొడవున గుండ్రటి గొట్టాలతో సొరంగాన్ని ఏర్పాటు చేస్తే అది హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ అవుతుంది. కాకపోతే.. ఈ గొట్టాల్లోపల అతితక్కువ పీడనం ఉంటుంది. దాదాపు ఆరు అడుగుల వెడల్పుండే ఈ గొట్టంలో ప్రయాణీకుల కోసం బోగీలుంటాయి. ఒక్కో బోగీలో 28 మంది ప్రయాణించవచ్చు. అర నిమిషానికి ఒక బోగీ గొట్టం మార్గం గుండా ప్రయాణం మొదలుపెడుతుంది. ప్రతి వంద కిలోమీటర్లకు ఏర్పాటు చేసే ఎలక్ట్రిక్ మోటర్ ఈ బోగీలు మరింత వేగంగా ప్రయాణించేందుకు, గమ్యస్థానాన్ని చేరుకునేటప్పుడే వేగాన్ని తగ్గించేందుకూ ఉపయోగిస్తారు.
బోగీ ముందుభాగంలో ఉండే భారీ ఎగ్జాస్ట్ఫ్యాన్ ఉన్న కొద్దిపాటి గాలినీ పీల్చుకుని వెనుకభాగంలోకి పంపిస్తూ ఉంటుంది. అతిసన్నటి గాలిపొరపై బోగీ తేలియాడుతూ ఉంటుందన్నమాట. ప్రయాణీకుల లగేజీని బోగీ వెనుకభాగంలో ప్రత్యేక ప్రదేశంలో ఉంచుతారు. గొట్టం మొత్తం అతితక్కువ పీడనం ఉన్నప్పటికీ ప్రయాణీకులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉంటాయి. అతిపెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా... హైపర్‌లూప్ స్తంభాలు, బోగీలు ఉంటాయి.
ప్రయోజనాలేమిటి?
చాలానే ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది ఖర్చు గురించి. మస్క్ తన ప్రాజెక్టును శాన్ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిలెస్ మధ్య ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. దాదాపు 558 కిలోమీటర్ల దూరమున్న ఈ మార్గంలో హైపర్‌లూప్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు 700 కోట్ల డాలర్లు (రూ.43,000 కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా కానీ దాదాపుగా ఇంతే పొడవున్న హైస్పీడ్ రైలు మార్గం నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వం దాదాపు పది రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తూండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలను మండించే అవసరముండదు కాబట్టి పర్యావరణానికీ మేలు జరుగుతుంది. పైగా ఈ వ్యవస్థ రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా శక్తిని ఆదా చేస్తుంది. గొట్టపు మార్గం పొడవునా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్తు ఉత్పత్తు చేసుకోవచ్చు. రహదారుల కోసం భూమి సేకరించాల్సిన అవసరమే ఉండదు.
ప్రస్తుతం ఏ దశలో...
ఎలన్ మస్క్ హైపర్‌లూప్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ గురించి ప్రతిపాదించింది 2013 ఆగస్టులో. కొన్ని నెలల తరువాత మస్క్ తన ఆలోచనలన్నింటినీ ‘ఆల్ఫా డిజైన్’ పేరుతో అందరితో పంచుకున్నాడు. ప్రపంచంలో ఎవరైనా ఈ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు వీలుగా ఓపెన్ లెసైన్సింగ్ ద్వారా దీన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించాడు. రెండు మూడేళ్లలో హైపర్‌లూప్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఒక టెస్టింగ్ ట్రాక్‌ను సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని, బోగీలు మొదలుకొని, ఇతర వ్యవస్థలను ఎవరైనా అభివృద్ధి చేయవచ్చునని మస్క్ ప్రకటించాడు. ఇందుకు అనుగుణంగానే ఈ నెలలో హైపర్‌లూప్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ కంపెనీ మస్క్ ఆలోచనలను నిజం చేసేందుకు ముందుకొచ్చింది. దీంతోపాటు జంప్‌స్టార్ట్ ఫండ్ వంటి ఇతర కంపెనీలు కూడా ఈ సరికొత్త రవాణా వ్యవస్థ రూపకల్పనకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.
హైపర్‌లూప్ ప్రత్యేకతలు
గరిష్ట వేగం (గంటకు) 1220 కిలోమీటర్లు
ఒక్కో బోగీలో పట్టే వాహనాలు 3
వాడుకునే శక్తి 26,000 హార్స్పవర్
(2.1 కోట్ల మెగావాట్ల విద్యుత్తు)
సోలార్ప్యానెళ్ల ద్వారా
ఉత్పత్తి అయ్యే విద్యుత్తు 76,000 హార్స్పవర్
తొలిమార్గం శాన్ఫ్రాన్సిస్కో నుంచి
లాస్ ఏంజిలెస్
టికెట్ ఖరీదు 20 డాలర్లు (రూ.1200)
ప్రయాణీకుల సంఖ్య (గంటకు) 840