హాల్టికెట్ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం
చదువుతో వ్యాపారం చేసేకంటే సారాకొట్టు పెట్టుకో అని ఈమధ్య విడుదలైన ఓ సినిమాలో డైలాగు ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న విషయాలు చూస్తే అలాగే కనిపిస్తోంది. వనస్థలిపురంలోని నారాయణ కాలేజిలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఫీజు కట్టలేదన్న నెపంతో ఓ విద్యార్థికి హాల్టికెట్టు ఇచ్చేందుకు కళాశాల యాజమాన్యం నిరాకరించింది.
సురేష్ అనే ఆ విద్యార్థి యాజమాన్యం ప్రతినిధులను కాళ్లావేళ్లా పడినా వాళ్లు ఏమాత్రం కనికరించలేదు. మొత్తం ఫీజు కడితేనే హాల్టికెట్ ఇస్తామని తేల్చిచెప్పారు. వీలైనంత త్వరలోనే కట్టేస్తానని, తన చదువు పాడవ్వకుండా చూడాలని అతడు కోరినా వినిపించుకోలేదు. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సురేష్ ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.