వికలాంగుల కష్టాలు
సదరమ్ క్యాంప్‌నకు వేలాదిగా తరలివచ్చిన బాధితులు
వసతులు కల్పించని అధికారులు
గూడూరు టౌన్ : స్థానిక డీఎన్ఆర్ కమ్యూనిటీహాల్లో మంగళవారం జరిగిన సదరమ్ క్యాంపునకు గూడూరు, నాయుడుపేట డివిజన్ పరిధిలోని వికలాంగులు వేలాదిగా తరలిరావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వికలాంగులకు సరైన వసతులు కల్పించకపోవడంతో అవస్థలు పడ్డారు. సదరన్ క్యాంప్‌ను ఏజెసీ రాజ్‌కుమార్, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ వాణి, ఆర్డీఓలు ప్రారంభించారు. వేలాదిగా వచ్చిన వికలాగుల ధ్రువపత్రాలు పరిశీలించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
జూన్ 2వ తేదీన వారికి అవసరమైన పరికరాలను అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వికలాంగుల సదరమ్ క్యాంపునకు వచ్చిన పలువురు వికలాంగులకు భోజన వసతి కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ధ్రువపత్రాలను పరిశీలించి వారికి అవసరమైన పరికరాలను ఎంపిక చేసేలా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామాల్లో సరైన సమాచారం లేకపోవడంతోనే రెండు డివిజన్ల నుంచి వేలాదిగా వికలాం గులు తరలివచ్చారు. ఆర్డీఓ రవీంద్ర, ము న్సిపల్ చైర్పర్సన్ దేవసేన, కమిషనర్ ప్రమీల, తహశీల్దార్ వెంకటనారాయణమ్మ, ఎంపీడీఓ పాల్గొన్నారు.
అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
సదరమ్ క్యాంప్‌ను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌కు వికలాంగులు తమ కష్టాలను మొర పెట్టుకున్నారు. సదరమ్ క్యాంప్‌నకు సంబంధించి అధికారులు వికలాంగులకు, ప్రజాప్రతినిధులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన మాట్లాడుతూ సదరమ్ క్యాంప్ ఏర్పాటు చేసే సమయంలో గతంలో వికలాంగులకు ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించి అవసరమైన వారికి పరికరాలు ఇస్తామన్న పూర్తి సమాచారాన్ని గ్రామాల్లో తెలియజేయకపోవడం తగదన్నారు. ఏడీ వాణి స్పందిస్తూ స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, గ్రామాల్లో ధ్రువపత్రాలు పొందిన వికలాంగులను మాత్రమే హాజరు కావాలని సమాచారం ఇచ్చామన్నారు.