ఇలా డ్రైవింగ్ చేసినా ప్రమాదమే!
లండన్: డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లో మాట్లాడడం ఎంత ప్రమాదకరమో మనకు తెలిసిందే. అయితే చాలామంది బ్లూటూత్, ఇయర్ ఫోన్స్ వంటివి పెట్టుకొని మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇది మరింత ప్రమాదకరమంటున్నారు పరిశోధకులు. ఈ విషయాన్ని ఏదో ఊరికే చెప్పేయకుండా రెండు రకాల వీడియో ఆధారిత పరిశోధనల ద్వారా రుజువు చేశాడు లండన్‌కు చెందిన గ్రాహం హోల్.
హ్యాండ్ ఫ్రీ పరికరాలు ఉపయోగించి ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారు అయోమయ స్థితిలోకి వెళ్లిపోవడం, ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటివి మొదటి పరిశోధన ద్వారా నిరూపించగా..., ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారి మెదడుపై తీవ్ర ఒత్తిడి పెరిగి, అప్పుడు కాకపోయినా ఆ తదుపరి ప్రమాదాలబారిన పడడం రెండో పరిశోధన ద్వారా రుజువు చేశాడు.