బుల్లెట్ దిగిన సోయి కూడా లేదు
రాయ్కడ్: ముళ్లు గుచ్చుకుంటేనే అబ్బా అని గట్టిగా అరిచి దాన్ని తీసేస్తాం.. గాయమైందేమో చూసుకుంటాం. అలాంటిది తన బాడీలోకి బుల్లెట్ దిగినప్పటికీ అసలు ఆ విషయమే గుర్తించలేదంటే ఎలా ఉంటుంది. కనీసం రక్తం కారుతున్న విషయంగానీ, గాయమైన విషయంగానీ తెలుసుకోలేకపోతే పరిస్థితి ఏమిటి? గుజరాత్లో మహిళకు ఈ అనుభవాన్ని చూసింది. ఆమె విషయంలో జరిగిన ఈ ఘటన అటు వైద్యులకు, పోలీసులకు ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఈ వివరాలు ఒకసారి పరిశీలిస్తే..
అసలేం జరిగింది?
గుజరాత్లోని రాయ్ ఖడ్ ప్రాంతానికి చెందిన హన్సా చౌదరీ అనే 28 ఏళ్ల మహిళ నిద్రలో ఉండగా సడెన్గా ఛాతీ నొప్పి మొదలైంది. దీంతో ఆమెకు గుండెపోటు వచ్చిందనుకొని ఆస్పత్రిలో చేరింది. ఆ రాత్రికి ప్రాథమిక పరీక్షలతోపాటు ఈసీజీ తీసిన వైద్యులు గుండెపోటు కాదని తేల్చి చెప్పారు. అయితే, పరిశీలించేందుకు ఒకరోజు ఆస్పత్రిలో ఉండమన్నారు. మరుసటి రోజు ఉదయం ఆస్పత్రిలోనే స్నానం చేసేందుకు ఆమె వెళ్లిన ఆమె తన ఛాతీ కుడివైపు భాగంలో చిన్నరంధ్రంలాంటిదాంట్లో నుంచి రక్తం కారుతుందని వైద్యులకు తెలిపింది. దీంతో వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీశారు. దీంతో ఆమె ఛాతీలో ఏదో వస్తువు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రేడియాలజిస్ట్ను సంప్రదించి ఆమెకు హెఆర్ సీటీ థరాక్స్ టెస్ట్ చేశారు. ఈ పరీక్షలో ఆమె ఛాతీలో బుల్లెట్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
వైద్యులకు షాక్.. పోలీసులకు మిస్టరీ
తొలుత ఛాతీ నొప్పి అని చెప్పి ఆస్పత్రిలో చేరిన ఆమెకు బుల్లెట్ దిగిందని, ఆ విషయం కనీసం ఆమెకు కూడా తెలియకుండా పోయిందని వైద్యులు షాక్ అయ్యారు. బుల్లెట్ తగిలినప్పుడు ఆమెకు అసలు చలనం లేకుండా ఉండటం ఎలా సాధ్యమైందని వారు ఆశ్చర్యపోతున్నారు. దాదాపు ఐదుగంటపాటు శ్రమించి ఆమె ఛాతీ నుంచి బుల్లెట్ తొలగించారు. కాగా, ఈ వివరాల ప్రకారం కేసు నమోదుచేసుకున్న పోలీసులకు ఈ కేసు మిస్టరీగా మారింది. అసలు ఆమె చాతీలోకి బుల్లెట్ ఎలా వచ్చింది? ఎవరు ఈ పనిచేశారు? బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లినా మహిళకు కనీసం తెలియకపోవడం ఏమిటి? అని రకరకాల ప్రశ్నల్లో మునిగిపోయారు.
ఆమె, భర్త ఏం చెబుతున్నారంటే..
'నేను నా మూడేళ్ల కుమారుడు జయ్ దీప్ తో కలిసి నిద్రపోతున్నాను. సరిగ్గా 11.30గంటల ప్రాంతంలో ఛాతీనొప్పి వచ్చింది. నేను గుండెపోటు అని అనుకున్నాను. కాదని వైద్యులు చెప్పారు. స్నానం చేసేందుకు బ్లౌజ్ తీయగానే నాకు చిన్న గాయంలో నుంచి రక్తం కారుతుందన్న విషయం తెలిసింది. నేను షాక్ అయ్యాను. బహుషా ఎప్పటి నుంచో అది కారుతుందేమో.. కానీ అప్పటికే ఇంట్లో బాగా చెమటపట్టి కారుతుండటంతో నేను అది కూడా చెమటే అనే భ్రమలో ఉన్నాను. నా బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ కావడంతో రక్తాన్ని గుర్తించలేకపోయాను'
-బాధితురాలు హన్సా చౌదరీ వాంగ్మూలం
'మా ఇంటిపక్కన వారి గోడ కూలిపోయి కొందరికి గాయాలు కావడంతో నేను వారితో ఆస్పత్రిలో ఉన్నాను. ఈ లోగా నా భార్యకు అనారోగ్యంగా ఉందని ఫోన్ చేస్తే వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొని వెళ్లి పరీక్షలు చేయించాను. ఆమె ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని తెలిసి ఇప్పుడు ఆశ్చర్య పోతున్న'
-బాధితురాలి భర్త జగదీశ్(ఆటో డ్రైవర్)