Hansraj ahir
-
తెలంగాణ పోలీస్ వ్యవస్థ భేష్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఉత్తమ పోలీసింగ్ వ్యవస్థ అమలవుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అభినందించారు. మంగళవారం ఆయన దేశంలో రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా స్థానం సాధించిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకొని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. షీ టీమ్‌ల ఏర్పాటు చాలా మంచి ప్రయత్నమని అభినందించారు. నేరాల నియంత్రణ కోసం ప్రస్తుతం తెలంగాణ పోలీసులు అనుసరిస్తున్న విధనాలు మంచి ఫలితాలిస్తున్నాయని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని సదుపాయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, నగర కమిషనర్ అంజనీకుమార్, పశ్చిమ మండలం డీసీపీ ఎ.ఆర్ శ్రీనివాస్, పంజాగుట్ట ఎసీపీ విజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు. అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసుల పనితీరుపై కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టెక్నాటజీ సాయంతో కేసులను చేధిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని పోలీకస్ స్టేషన్లని ఆధునికరిస్తాం అని మహేందర్ రెడ్డి వివరించారు. -
‘ఆ ఇల్లు ముమ్మాటికి మనదే’
న్యూఢిల్లీ : ముంబై సమీపంలోని మలబార్ హిల్ ప్రాంతంలోని పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా ఇల్లు భారత ప్రభుత్వానిదేనని కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ స్పష్టం చేశారు. జిన్నా ఇంటి ప్రస్తుత పరిస్థితి గురించి కర్నాల్ ఎమ్పీ అశ్విన్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఇలా స్పందించారు. లోక్‌సభలో ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘దక్షిణ ముంబైలో ఉన్న జిన్నా నివాసం భారత ప్రభుత్వానికి చెందిన ఆస్తి. ఈ నివాసం ‘ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్’ పరిధిలోకి రాదు. కేవలం శత్రు దేశాలకు చెందిన వారి ఆస్తులు మాత్రమే ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. కానీ నిర్వాసిత ఆస్తి చట్టం 1950, ప్రకారం జిన్నా నివాసం ‘శరణార్ధి ఆస్తి’ కిందకు వస్తుందని’ తెలిపారు. ఇలాంటి ఆస్తులపైన వ్యక్తిగతంగా, ట్రస్టీగా, లబ్దిదారుగా ఉన్నా ఎలాంటి హక్కులు ఉండవన్నారు. జిన్నా ఆస్తిని వదిలిపెట్టే ప్రశ్నే తలెత్తదని ఆయన అభిప్రాయపడ్డారు. జిన్నా 1936లో లండన్ నుంచి ముంబై వచ్చారు. దేశ విభజనకు ముందే ముంబై సమీపంలోని మలబార్ హిల్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఇంటిని నిర్మించుకున్నారు జిన్నా. ఈ ఇంటికి ‘సౌత్ కోర్టు’ అని పేరు. స్వాతంత్య్ర పోరాట కాలంలో ముస్లీం లీగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ విభజన కోసం పట్టుబట్టారు. విభజన అంశంపై మహాత్మ గాంధీ, జిన్నా ఈ ఇంటిలోనే 1944, సెప్టెంబర్‌లో చర్చలు నిర్వహించారు. దేశ విభజన అనంతరం జిన్నా పాకిస్తాన్ వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా మరోవైపు పాకిస్తాన్ కూడా జిన్నా ఇంటి మీద దావా వేసింది. ఈ ఇంటి యాజమాన్య హక్కులను గౌరవిస్తూ ఈ ఆస్తిని తమకు అప్పజెప్పాలని భారత్‌ను కోరుతుంది. -
గడ్చిరోలీ జిల్లా గిన్నిస్ రికార్డు
గడ్చిరోలీ: పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులతో వార్తల్లో నిలిచే మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా అరుదైన ఘనత సాధించింది. గడ్చిరోలీలో శనివారం నిర్వహించిన పుస్తక పఠన కార్యక్రమంలో దాదాపు 7,000 మంది ప్రజలు పాల్గొనడంతో, అత్యధికులు పాల్గొన్న కార్యక్రమంగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. గతేడాది టర్కీలోని అంకారాలో 5,754 మందితో జరిగిన పుస్తక పఠన కార్యక్రమమే ఇప్పటివరకూ తొలిస్థానంలో ఉండేది. మావోల హింసకు పేరుగాంచిన గడ్చిరోలీకి ప్రపంచవ్యాప్తంగా సానుకూల గుర్తింపును తీసుకురావడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ‘గాంధీ విచార్ ఆనీ అహింసా’(గాంధీ ఆలోచనలు–అహింస) అనే మరాఠీ పుస్తకంలోని ఓ భాగాన్ని ప్రజలు చదివినట్లు వెల్లడించారు. జిల్లాలోని విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్‌తో పాటు ప్రత్యేక అతిథులుగా గిరిజన నేత బిర్సాముండా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. -
నక్సల్స్‌లో చేరండి.. కాల్చిచంపుతాం!
ముంబై: మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో సీనియర్ వైద్యుల వైఖరిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యమంటే ఇష్టం లేని ఇలాంటి(వైద్యులు) వాళ్లు నక్సల్స్‌లో చేరాలి. అప్పడు వాళ్లను ప్రభుత్వం కాల్చిచంపుతుంది’ అని వ్యాఖ్యానించారు. చంద్రపూర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో జెనరిక్ మందుల షాపును అహిర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు పాల్గొనకపోవడంపై స్పందిస్తూ..‘ ఈ కార్యక్రమానికి మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ వచ్చారు. సీనియర్ వైద్యులు ఎందుకు రాలేదు? నక్సల్స్‌కు ప్రజాస్వామ్యం అక్కర్లేదు. ఈ కార్యక్రమానికి రాని వాళ్లకు(వైద్యులకు) ప్రజాస్వామ్యం అక్కర్లేదు. ఇలాంటి వాళ్లందరూ నక్సల్స్‌లో చేరాలి. ఒకసారి నక్సల్స్‌లో చేరిన మిమ్మల్ని కాల్చిచంపుతాం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ట్రై చేస్తే పీవోకే భారత్‌దే.. ఎవరూ అడ్డుకోలేరు!
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్దేనంటూ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్ ఖండించారు. పీవోకే భారత్‌దేనని, గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్ల వల్ల ఈ ప్రాంతం పాక్ ఆధీనంలోకి వెళ్లిపోయిందని ఆయన అన్నారు. ’ మనం ప్రయత్నిస్తే పీవోకే మళ్లీ మన సొంతం అవుతుంది. ఎందుకంటే అది మన హక్కు. పీవోకే తిరిగి మనం అధీనంలోకి తెచ్చుకునేందుకు మేం కృషి చేస్తాం’ అని హన్స్‌రాజ్ తెలిపారు. ఫరూక్ వివాదాస్పద వ్యాఖ్యలివే..! పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్‌దే అంటూ గతవారం వ్యాఖ్యలు చేసిన ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పదంగా మాట్లాడారు. పీవోకేను భారత్ ఆక్రమించుకునే అవకాశం ఇచ్చేంత బలహీన దేశం పాక్ కాదని ఆయన బుధవారం అన్నారు. బారాముల్లా జిల్లాలోని ఉడీ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అబ్దుల్లా ప్రసంగించారు. ‘ఇంకా ఎంత కాలం పీవోకే మనదేనని ఈ దేశం చెప్పుకుంటూ ఉంటుంది? అది వీళ్ల అబ్బ సొత్తేమీ కాదు. పీవోకే పాకిస్తాన్‌దే. జమ్మూ కశ్మీర్ భారత్‌ది. 70 ఏళ్లయినా పీవోకేను భారత్ తన అధీనంలోకి తెచ్చుకోలేకపోయింది. కానీ స్వాధీనం చేసుకుంటామని చెబుతూనే ఉంది. ఇది ఎలా జరగుతుందో మేమూ చూస్తాం. పాకిస్తాన్ ఏమీ బలహీన దేశం కాదు.వాళ్లు గాజులు తొడుక్కోలేదు. వాళ్ల దగ్గరా అణుబాంబులు ఉన్నాయి. యుద్ధం గురించి ఆలోచించేముందు మనుషులుగా బతకడం గురించి ఆలోచించాలి’ అని అబ్దుల్లా అన్నారు. నియంత్రణ రేఖ వద్ద ఇరుదేశాల ప్రజలు స్వేచ్ఛగా తిరిగే రోజు వస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి, అక్కడి ప్రజలకు ప్రత్యేక వెసులుబాట్లు, రాయితీలు తదితరాలు కల్పిస్తూ 1953లో తెచ్చిన చట్టాలన్నింటినీ తొలగించే కాలం కూడా వచ్చిందంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు. -
ఏపీకి నడ్డా.. తెలంగాణకు హన్స్‌రాజ్
తెలుగు రాష్ట్రాలకు బీజేపీ సమన్వయకర్తలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత అంశాలను సమన్వయం చేసుకోవడానికి ఏడుగురు మంత్రులకు అధినాయకత్వం బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా (ఆంధ్రప్రదేశ్), హన్స్‌రాజ్ అహిర్ (తెలంగాణ), నిర్మలా సీతారామన్ (పశ్చిమ బెంగాల్), పీయూశ్ గోయల్ (తమిళనాడు, పుదుచ్ఛేరి), రాజీవ్ ప్రతాప్ రూడీ (కేరళ), ధర్మేంద్ర ప్రధాన్ (అస్సాం), మహేశ్ శర్మ (ఒడిశా)లకు పార్టీని సమన్వయం చేసుకోవడంపై ప్రత్యేకంగా దృష్టిని సారించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించారు.