
గడ్చిరోలీ: పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులతో వార్తల్లో నిలిచే మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా అరుదైన ఘనత సాధించింది. గడ్చిరోలీలో శనివారం నిర్వహించిన పుస్తక పఠన కార్యక్రమంలో దాదాపు 7,000 మంది ప్రజలు పాల్గొనడంతో, అత్యధికులు పాల్గొన్న కార్యక్రమంగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. గతేడాది టర్కీలోని అంకారాలో 5,754 మందితో జరిగిన పుస్తక పఠన కార్యక్రమమే ఇప్పటివరకూ తొలిస్థానంలో ఉండేది.
మావోల హింసకు పేరుగాంచిన గడ్చిరోలీకి ప్రపంచవ్యాప్తంగా సానుకూల గుర్తింపును తీసుకురావడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ‘గాంధీ విచార్ ఆనీ అహింసా’(గాంధీ ఆలోచనలు–అహింస) అనే మరాఠీ పుస్తకంలోని ఓ భాగాన్ని ప్రజలు చదివినట్లు వెల్లడించారు. జిల్లాలోని విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్‌తో పాటు ప్రత్యేక అతిథులుగా గిరిజన నేత బిర్సాముండా కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment