Hari kishan
-
Omicron Variant: తీవ్రతపై త్వరలో స్పష్టత!
సాక్షి, హైదరాబాద్: కరోనా డెల్టా వేరియెంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ 4.2 రెట్లు అధికంగా సోకే అవకాశాలున్నాయని జపాన్ క్యోటో వర్సిటీ అధ్యయనంలో వెల్లడి కావడం అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. రోగనిరోధక శక్తినీ ఒమిక్రాన్ తప్పించుకునే అవకాశాలు ఎక్కువని తేలడంతో దాని లక్షణాలు, ప్రభావాలు, తీవ్రత, వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఈవేరియెంట్ నుంచి తమ బూస్టర్ డోస్‌తో రక్షణ పెరుగుతుందని ఫైజర్, బయో ఎన్‌టెక్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాధాన్యతా అంశాలను యశోద ఆçస్పత్రి చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ఆర్టీపీసీఆర్కు చిక్కకుంటే ఒమిక్రానే! కరోనా డెల్టా కేసులకు బూస్టర్ డోస్‌లతో 90 శాతం మరణాలు నిరోధించినట్టు న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ (ఎన్‌ఈజేఎం) తాజా అధ్యయనం వెల్లడించింది. దీన్ని బట్టి ఒమిక్రాన్ పైనా బూస్టర్ డోస్‌లు ప్రభావం చూపుతాయి. దేశంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు అందరికన్నా ముందు రెండు డోసుల టీకాలిచ్చాం. హెల్త్‌కేర్ వర్కర్లు, ఇతర హైరిస్క్ జనాభాకు వెంటనే థర్డ్/బూస్టర్ డోస్‌లు వేసేందుకు అనుమతినిస్తే మంచిది. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లతోనే పరీక్షల్లో ఎస్ జీన్ కనిపించకపోతే ఒమిక్రాన్‌గా భావించాలి. ఇప్పుడున్న టీకాలు ఒమిక్రాన్‌పైనా బాగానే పనిచేస్తాయి. సాధారణ ఫ్లూ మాదిరి ఇది వెళ్లిపోయే అవకాశాలున్నందున అనవసర ఆందోళన వద్దు. ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రాదు దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగినా ఆందోళన వద్దు. కొత్త వేరియెంట్ బాధితులను ఆసుపత్రుల్లో చేర్చాల్సిన అవసరం ఉండదు. ఈ వేరియెంట్ తీవ్రమైన వ్యాధిగా మారే ప్రమాదముందా? ఇది ఏ మేరకు ఆందోళనకరమో వచ్చే 3 వారాల్లో తెలియనుంది. వచ్చే నెలా, రెండు నెలలు పెళ్లిళ్లు, ఫంక్షన్లలో గుమిగూడొ ద్దు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ లను జాగ్రత్తగా బాధ్యతతో చేసుకోవాలి. -
మిమిక్రీ కళాకారుడు హరికిషన్ హఠాన్మరణం
గౌతంనగర్ (హైదరాబాద్): అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు హరికిషన్(58) గుండెపోటుతో శనివారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య సుధ ఏఎస్‌రావునగర్‌లోని కాల్ పబ్లిక్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు శశాంక్ ఆస్ట్రేలియాలో, చిన్న కుమారుడు గుజరాత్లో ఉంటున్నారు. పన్నెండేళ్లుగా హరికిషన్‌కు కిడ్నీలు చెడిపోవడంతో అప్పటి నుంచి రెండ్రోజులకొకసారి డయాలసిస్ చేయించుకుంటున్నారు. పదేళ్ల క్రితం భార్య సుధ ఒక కిడ్నీ ఇచ్చినప్పటికీ అది కూడా చెడిపోయింది. జాతీయ, అంతర్జాతీయయంగా ఎన్నో ప్రదర్శనలు చేసి హరికిషన్ అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. కుమారులు విదేశాల్లో ఉండటంతో వారు రావడానికి రెండ్రోజులు పడుతుందని, అప్పటి వరకు హరికిషన్ భౌతికకాయాన్ని లాలాగూడ మెట్టుగూడలోని రైల్వే ఆస్పత్రిలో భద్రపరిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హరికిషన్ అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని తెలిపారు. అందరితో ఆప్యాయంగా ఉండే హరికిషన్ మృతి చెందడంతో మల్కాజిగిరిలోని సాయిపురి కాలనీలో ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కమ్యూనిటీ స్ప్రెడ్ అంతగా లేదు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రస్తుతం రాష్ట్రంలో మూడో దశలోకి ప్రవేశించినా, కమ్యూనిటీ స్ప్రెడ్ విస్తృతి పెరగకపోవడం మనకు కలిసొచ్చే అంశమని పల్మనాలజిస్ట్ డా.హరికిషన్ తెలిపారు. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఒకట్రెండు చోట్ల కనిపిస్తున్నా కేసులు పెద్దగా పెరగకపోవడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. దేశంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా, వాటిలో మరణాల రేటు తక్కువగా ఉండటం, ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడున్న పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. కఠినమైన లాక్డౌన్ అమలు, ఇతరత్రా చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ప్రధానంగా లాక్డౌన్ వల్ల కేసుల పెరుగుదల గ్రాఫ్ నిలకడగా (ఫ్లాటెన్) సాగేట్లు చేయగలిగామని, దీనికి మరింత కిందకు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో తగ్గేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ తమ పేషెంట్లు, ఇతర ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారిని 70 నుంచి 100 మంది వరకు టెస్ట్ చేస్తే ఒకరు లేదా ఇద్దరిలోనే పాజిటివ్ రావడాన్ని బట్టి పరిస్థితి సానుకూలంగా ఉన్నట్లు భావించొచ్చని పేర్కొన్నారు. ఈ కారణాలన్నింటి వల్ల పాజిటివ్ కేసులను ప్రభుత్వం దాచిపెడుతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేయడం సరికాదన్నారు. లాక్డౌన్ ఎత్తేశారనో, మినహాయింపులు ఇచ్చారనో రోడ్లపైకి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేస్తే ఇన్ని రోజులు డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర రంగాల వారు చేసిన కృషి నిష్ఫలం అవుతుందని హెచ్చరించారు. వివిధ అంశాలపై హరికిషన్ వెలిబుచ్చిన అభిప్రాయాలు.. పెద్దలు బయటకు రావొద్దు.. రాబోయే నాలుగైదు నెలల పాటు పెద్ద వయసున్న, అనారోగ్య సమస్యలున్న వారు బయటకు రావొద్దు. ఇతరులు కూడా అత్యవసరమైతేనే బహిరంగప్రదేశాలకు రావాలి. పిల్లలకు భవిష్యత్‌లో ఇన్ఫెక్షన్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికైతే కరోనా నివారణకు వ్యాక్సిన్ రాలేదు. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు జంతువుల్లో కరోనా వైరస్ కట్టడికి యాంటీబాడీని డెవలప్ చేశారు. అయితే దీన్ని మానవులపై ప్రయోగించి పరిశోధనలు జరపాల్సి ఉంది. మనుషులకు ఉపయోగపడే వ్యాక్సిన్ అభివృద్ధికి కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కొన్ని ప్రయోగాలు జంతువులపై ఫలవంతమైనా మానవులపై ఇప్పుడే పరీక్షలు మొదలయ్యాయి. ఈ పరీక్షలు ఏ మేరకు ఫలప్రదం అయ్యాయో తెలుసుకునేందుకు కనీసం మరో 6 నెలల సమయం పడుతుంది. వారికి ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్లు.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు 65 ఏళ్లు పైబడిన వారికి న్యూమోకోకల్, ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సినేషన్ చేయడం ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను అధిగమించొచ్చు. పెద్ద వయసున్న వారు ఈ వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేసుకుంటే మరీ మంచిది. న్యూమోకోకల్ వ్యాక్సిన్లు పీసీవీ–13, పీపీఎస్వీ–23 రెండు రకాలు. 65 ఏళ్లు దాటిన పెద్దలకు పీపీఎస్వీ 23 వ్యాక్సిన్లను డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. పెద్ద వయసున్న వారికి ఈ వ్యాక్సిన్ ఎందుకు అవసరమంటే.. 65 ఏళ్ల వయసు దాటేటప్పటికి చిన్నప్పుడు వారు తీసుకున్న బీసీజీ, ఇతర వ్యాక్సిన్ల ప్రభావం తగ్గుతుంది. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఈ వ్యాక్సిన్లు తీసుకుంటే మంచిది. నియంత్రణే పరమ ఔషధం.. కరోనా నివారణ, వైరస్ వ్యాప్తి కట్టడి అనేది నియంత్రణ చర్యలు, భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ల వినియోగం, వంటి ముందస్తు జాగ్రత్తలతోనే సాధ్యం. కరోనాకు ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఇదొక్కటే. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సురక్షితమైన మార్గం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ఒక్కటే మార్గం. -
ప్రత్యేక ఫీవర్ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి
హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు ఆసుపత్రి బ్రాంకస్ 2020 పేరిట ‘అలివియేటింగ్ చాలెంజెస్ ఆఫ్ కోవిడ్–19 ఇన్ బ్రాంకోస్కోపీ’అంశంపై 11 దేశాలకు చెందిన 19 మంది డాక్టర్లతో ఆన్లైన్లో ఈ–కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. ప్రొఫెసర్లు ఫెలిక్స్ హెర్త్ (జర్మనీ), జో చాంగ్‌హో, డాక్టర్లు యూ చెన్ (చైనా), మైకెల్ ప్రిట్చెట్, కైలీ హోగార్త్, ఎరిక్ ఫోల్చ్, కేథరిన్ ఒబెర్గ్, జస్లీన్ పన్నూ (అమెరికా), రాఖేశ్ పంచల్ (యూకే), మిఛెలా బెజ్జి (ఇటలీ), మెల్విన్టె (సింగపూర్), జమాలుల్ అజీజి (మలేసియా). ఫిలిప్ ఎమ్మాన్యూల్ (గ్రీస్), ఇల్యా సివొకోజొవ్ (రష్యా), రొనాల్డ్ ఫజార్దో (ఫిలిప్పైన్స్), హరికిషన్ గోనుగుంట్ల, వి,నా గార్జున, విశ్వేశ్వరన్, టింకూ జోసెఫ్ (ఇండియా) పాల్గొని తమ తమ దేశాల్లో కరోనా చికిత్స, అనుసరిస్తున్న పద్ధతులు, ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఇలా వివిధ దేశాల్లోని డాక్టర్లు, నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ♦ కరోనా పేషెంట్లతో పాటు మామూలు రోగులకూ డాక్టర్లు చికి త్స అందిస్తున్నందున, వారికీ ఈ వైరస్ సోకకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలి. డాక్టర్ల కొరత ఏర్పడితే అది వైద్య, ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ♦ తగిన సంఖ్యలో కరోనా టెస్ట్ కిట్లు అందుబాటులో లేకపోతే ఎవరికైనా అవి నిజంగా అవసరం పడినపుడు సమస్యగా మారుతుంది. ♦ అనెస్థిషియా, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, బ్రాంకో స్కోపీ, ఐసీయూల్లో పని చేసే డాక్టర్లకు లెవల్–3 రక్షణను అందించాలి. ఈ విభాగాల డాక్టర్లకు ‘హైరిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్’అవకాశాలుంటాయి. ♦ ఇప్పటివరకు ప్రపంచస్థాయిలో లేదా ఏ దేశంలో కూడా కరోనా మహమ్మారి రాకుండా చేసేందుకు వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో లేవు. హైడ్రాక్సి క్లోరోక్విన్ కూడా పెద్దగా ప్రభావం చూపుతున్నట్టుగా నిరూపితం కాలేదు. కరోనాకు ఎలాంటి ట్రీట్మెంట్ లేనందువల్ల ప్రజలు హోం ఐసోలేషన్‌తో పాటు మనిషికి మనిషికి మధ్య దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వంద శాతం పాటించాల్సిందే. ♦ బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తూ, ఇళ్ల నుంచి ఇష్టానుసారం బయటకు వచ్చి అన్ని చోట్లా తిరుగుతూ ఉంటే వైరస్ ఇన్ఫెక్షన్ అంటించుకోవడంతో పాటు ఇతరులకు దీనిని వ్యాప్తి చేసే ప్రమాదం పొంచి ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇళ్లకే పరిమితమైతే ఎన్నో రెట్లు మంచిది. లాక్డౌన్ ఎత్తేస్తే కరోనా పోయినట్టే అనే భావన సరికాదు.. ‘ప్రస్తుతం కమ్యూనిటీ స్ప్రెడ్‌కు ఆస్కారమున్నందున డాక్టర్లు ఎక్కువగా రక్షణ చర్యలు తీసుకోవాలని పల్మనాలజిస్ట్ హరికిషన్ గోనుగుంట్ల అన్నారు. ఈ వెబ్ కాన్ఫరెన్స్‌లో సమన్వయకర్తగా వ్యవహరించిన ఆయన ‘సాక్షి’తో సమావేశ వివరాలతో పాటు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘విడిగా ఫీవర్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలి. ఫార్మసీలోనూ మనుషుల మధ్య దూరాన్ని పాటించాలి. డాక్టర్లు ఔట్ పేషెంట్లను చూడటం మొదలుపెట్టినందున, ఓపీల్లో దూరం పాటించేలా ఏర్పాటు చేయాలి. ఆసుపత్రులు వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా మారితే చాలా ప్రమాదం. మలేరియా మందులు ఈ వైరస్ అదుపునకు సమర్థంగా పనిచేస్తున్నట్టు ఏ అధ్యయనంలోనూ నిరూపితం కాలేదు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ సిద్ధమైనట్లు, మనుషులపై ప్రయోగించినపుడు అవి విఫలమైనట్టు వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు. దీనిపై ప్రపంచంలోనే స్పష్టమైన వైద్య విధానం ఏర్పడలేదు. లాక్డౌన్ ఎత్తేస్తే కరోనాను అధిగమించినట్టేనన్న భావన సరి కాదు. లాక్డౌన్ ఉన్నా లేకున్నా ఈ వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో టెలీ మెడిసిన్ మంచిది. ఎమర్జెన్సీ ఉన్న వారే డాక్టర్ల వద్దకు వెళ్లాలి. డాక్టర్లు తమ స్టెతస్కోప్, సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి వాటికి బ్యాగ్‌లను విడిగా పెట్టుకోవాలి. ఇవీ ఇన్ఫెక్షన్ల కారియర్లుగా మారుతున్నట్టు వెల్లడైంది. లాక్డౌన్ ఎత్తేశాక డాక్టర్లకు రోగుల నుంచి ఎక్కువ తాకిడి ఉంటుంది వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంగ్లండ్‌లో పాజిటివ్ పేషెంట్లను కూడా 28 రోజుల హోం ఐసోలేషన్, క్వారంటైన్లో పెట్టి ఫలితాలను సాధిస్తున్నందున, ఆ విధానాన్ని అనుసరిస్తే మరింత మేలు జరుగుతుంది’అని చెప్పారు. ‘కరోనా మహమ్మారి ప్రస్తుత ఉధృతి నియంత్రణకు ప్రత్యేకంగా ఫీవర్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. జ్వరంతో ఉన్న ప్రతి ఒక్కరికీ టెస్ట్‌లు నిర్వహిస్తే మంచిది.. ముఖ్యంగా ఈ మహమ్మారి సామాజికంగా వ్యాప్తి చెందడానికి ముందే ఫీవర్ ఆసుపత్రుల ఏర్పాటు అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అనుమానిత లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయడం ఉత్తమం.. పాజిటివ్ వచ్చిన పేషెంట్లు నిలకడైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటే ఇళ్లలోనే 28 రోజుల హోం క్వారంటైన్లో పెడితే సరిపోతుంది..’చైనా, అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, రష్యా, గ్రీస్, సింగపూర్, మలేసియా, ఫిలిప్పైన్స్, ఇండియాలో కరోనా చికిత్సలో నిమగ్నమైన పల్మనాలజిస్ట్లు వెలిబుచ్చిన అభిప్రాయాలివి.. – సాక్షి,హైదరాబాద్ -
నవ్వు.. భయం.. ఖాయం
‘ప్రేమకథా చిత్రమ్, జక్కన్న’ వంటి హిట్స్ అందించిన ఆర్పీఏ క్రియేషన్స్ ప్రస్తుతం ‘ప్రేమకథా చిత్రమ్ 2’ రూపొందించనుంది. ‘బ్యాక్ టు ఫియర్’ అన్నది క్యాప్షన్. సుమంత్ అశ్విన్ హీరోగా హరికిషన్ దర్శకత్వంలో ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సీనియర్ డైరెక్టర్ సాగర్ క్లాప్ ఇవ్వగా, అమరేందర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. అఖిల్ రెడ్డి తొలి సన్నివేశానికి డైరెక్షన్ చేశారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రేమకథా చిత్రమ్’ హిలేరియస్ కామెడీతో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ప్రేమకథా చిత్రమ్ 2’ ప్రారంభించాం. హరికిషన్‌ను దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. కామెడీ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథ ఇది. మా బ్యానర్లో మరో సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాం. కెమెరామెన్ సి.రాంప్రసాద్, ఎడిటర్ ఉద్ధవ్, సంగీత దర్శకుడు జేబీ, డైలాగ్ రైటర్ చంద్రశేఖర్ లాంటి టెక్నీషియన్స్ మెయిన్ పిల్లర్స్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: ఆయుష్ రెడ్డి, ఆర్.పి. అక్షిత్ రెడ్డి. -
‘ఆసరా’ అభాసుపాలు
సంగారెడ్డి మున్సిపాలిటీ : భర్త బతికుండగానే భార్యకు వితంతు పింఛన్.. మరో వ్యక్తి ఎటువంటి ైవె కల్యం లేకున్నా.. అతడికీ పింఛన్.. అధికార పార్టీకి చెందిన ఓ నేతకు చేనేత కార్మికుడిగా గుర్తించి అతడికీ పింఛన్ పంపిణీ చేస్తున్నారు అధికారులు. తాము అర్హులమని పింఛన్లు ఇవ్వాలని ఆధారాలతో పాటు కాళ్లకు చెప్పులు అరిగే లా తిరుగుతున్నా వారిని కాదని అధికారులు అనర్హులకు పింఛన్ జాబితాలో చోటు కల్పించడం విమర్శలకు తావిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని 31 వార్డుల్లో వివిధ రకాల పింఛన్ల కోసం 5,360 దరఖాస్తులు రాగా 2,571 దరఖాస్తులను అధికారులు ఆన్లైన్ పూర్తి చేయగా అందులో 1,900 వివిధ రకాల పింఛన్లను మంజూరు చేశారు. అందులో 22వ వార్డులో పింఛన్ జాబితాలో పట్టణంలోని టీఆర్ఎస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్, ఎమ్మెల్యే సన్నిహితుడుగా ఉన్న హెచ్ హరి కిషన్‌కు చేనేత కార్మికుడిగా గుర్తించి రూ. 1000 పింఛన్‌ను మంజూరు చేస్తూ అధికారులు బుధవారం మున్సిపల్ కార్యాలయం నోటీసు బోర్డుపై ప్రకటించిన జాబితాలో పేర్కొన్నారు. దీంతో పాటు సోమేశ్వర్వాడ 18వ వార్డుకు చెందిన సయ్యద్ నేహకు వికలాంగురాలిగా గుర్తించి గత నెలలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా రూ.1500 తీసుకున్నా.. బాలిక ప్రస్తుతం అధికారులు వితంతు పింఛన్‌ను మంజూరు చేశారు. 16వ వార్డులో సరస్వతి భర్త బతికి ఉండగానే ఆమెకు వితంతు పింఛన్ మంజూరు చేశారు. ఒకటో వార్డుకు చెందిన సుజాతకు కూడా భర్త బు చ్చిరాములు బతికే ఉండగా ఆమెకు సైతం వితంతు పింఛన్ మంజూరైంది. రజీయాబేగం భర్త బతికి ఉండగానే ఆమెకు వితంతు పింఛన్ మంజూరైం ది. వాస్తవానికి ఆమె భర్త వృద్ధ్యాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆమెకు వితంతు పింఛన్ మంజూరు కావడం గమనార్హం. కమిషనర్ వివరణ : టీఆర్ఎస్ నాయకుడు పింఛన్ మంజూరు చేయడంపై ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ గయాజుద్దీన్‌ను వివరణ కోరగా కంప్యూటర్ ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో పొరపాట్లు జరిగాయని వాటిని సవరిస్తామన్నారు. అనర్హులకు పింఛన్ తొలగించి అర్హులకు అందజేస్తామని తెలిపారు. హరికిషన్ వివరణ : పింఛన్ మంజూరుపై టీఆర్ఎస్ నాయకుడు హరికిషన్‌ను వివరణ కోరగా తాను ఎలాంటి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోలేదని వివరణ ఇచ్చారు. తమది చేనేత సామాజిక వర్గం కాదని వివరణ ఇచ్చారు. -
గంజాయి తోటలపై ఎక్సైజ్ దాడులు
మనూరు, న్యూస్‌లైన్ : గంజాయి క్షేత్రాలపై జిల్లా ఎక్సై జ్ సూపరింటెండెంట్ హరికిషన్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి సుమారు రూ. 15 కోట్లు విలువ చేసే మొక్కలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మనూరు మండ లం ఇరక్‌పల్లి పంచాయతీ శామనాయక్ తండాల్లో 15 ఎకరాల గంజాయిని సాగు చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. దీంతో గురువారం సిబ్బంది దాడులు నిర్వహించినట్లు వివరించారు. పంట మొత్తాన్ని, కూలీలు, ట్రాక్టర్ పెట్టి దున్ని వేయించినట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా సాగుదారులను గుర్తించి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అరుణ్‌కుమార్, నారాయణఖేడ్ ఇన్చార్జ్ సీఐ సూర్యప్రకాష్, ఎస్ఐలు కుర్మయ్య, మురళీధర్, లక్ష్మీనారాయణ, పట్టాభి సిబ్బంది పాల్గొన్నారు.