ప్రత్యేక ఫీవర్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి | Doctor Hari Kishan Speaks About Present Situation Of Covid 19 | Sakshi
Sakshi News home page

ప్రత్యేక ఫీవర్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి

Published Sat, May 2 2020 5:10 AM | Last Updated on Sat, May 2 2020 5:10 AM

Doctor Hari Kishan Speaks About Present Situation Of Covid 19 - Sakshi

హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు ఆసుపత్రి బ్రాంకస్‌ 2020 పేరిట ‘అలివియేటింగ్‌ చాలెంజెస్‌ ఆఫ్‌ కోవిడ్‌–19 ఇన్‌ బ్రాంకోస్కోపీ’అంశంపై 11 దేశాలకు చెందిన 19 మంది డాక్టర్లతో ఆన్‌లైన్‌లో ఈ–కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. ప్రొఫెసర్లు ఫెలిక్స్‌ హెర్త్‌ (జర్మనీ), జో చాంగ్‌హో, డాక్టర్లు యూ చెన్‌ (చైనా), మైకెల్‌ ప్రిట్‌చెట్, కైలీ హోగార్త్, ఎరిక్‌ ఫోల్చ్, కేథరిన్‌ ఒబెర్గ్, జస్లీన్‌ పన్నూ (అమెరికా), రాఖేశ్‌ పంచల్‌ (యూకే), మిఛెలా బెజ్జి (ఇటలీ), మెల్విన్‌టె (సింగపూర్‌), జమాలుల్‌ అజీజి (మలేసియా). ఫిలిప్‌ ఎమ్మాన్యూల్‌ (గ్రీస్‌), ఇల్యా సివొకోజొవ్‌ (రష్యా), రొనాల్డ్‌ ఫజార్దో (ఫిలిప్పైన్స్‌), హరికిషన్‌ గోనుగుంట్ల, వి,నా గార్జున, విశ్వేశ్వరన్, టింకూ జోసెఫ్‌ (ఇండియా) పాల్గొని తమ తమ దేశాల్లో కరోనా చికిత్స, అనుసరిస్తున్న పద్ధతులు, ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానాలపై  అభిప్రాయాలు పంచుకున్నారు. ఇలా వివిధ దేశాల్లోని డాక్టర్లు, నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు.

కరోనా పేషెంట్లతో పాటు మామూలు రోగులకూ డాక్టర్లు చికి త్స అందిస్తున్నందున, వారికీ ఈ వైరస్‌ సోకకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలి. డాక్టర్ల కొరత ఏర్పడితే అది వైద్య, ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 
♦ తగిన సంఖ్యలో కరోనా టెస్ట్‌ కిట్లు అందుబాటులో లేకపోతే ఎవరికైనా అవి నిజంగా అవసరం పడినపుడు సమస్యగా మారుతుంది. 
♦ అనెస్థిషియా, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్, బ్రాంకో స్కోపీ, ఐసీయూల్లో పని చేసే డాక్టర్లకు లెవల్‌–3 రక్షణను అందించాలి. ఈ విభాగాల డాక్టర్లకు ‘హైరిస్క్‌ ఆఫ్‌ ట్రాన్స్‌మిషన్‌’అవకాశాలుంటాయి. 
♦ ఇప్పటివరకు ప్రపంచస్థాయిలో లేదా ఏ దేశంలో కూడా కరోనా మహమ్మారి రాకుండా చేసేందుకు  వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో లేవు. హైడ్రాక్సి క్లోరోక్విన్‌ కూడా పెద్దగా ప్రభావం చూపుతున్నట్టుగా నిరూపితం కాలేదు. కరోనాకు ఎలాంటి ట్రీట్‌మెంట్‌ లేనందువల్ల ప్రజలు హోం ఐసోలేషన్‌తో పాటు మనిషికి మనిషికి మధ్య దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం  వంద శాతం పాటించాల్సిందే.
♦ బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తూ, ఇళ్ల నుంచి ఇష్టానుసారం బయటకు వచ్చి అన్ని చోట్లా తిరుగుతూ ఉంటే వైరస్‌ ఇన్ఫెక్షన్‌ అంటించుకోవడంతో పాటు ఇతరులకు దీనిని వ్యాప్తి చేసే ప్రమాదం పొంచి ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇళ్లకే పరిమితమైతే ఎన్నో రెట్లు మంచిది.

లాక్‌డౌన్‌ ఎత్తేస్తే కరోనా పోయినట్టే అనే భావన సరికాదు.. 
‘ప్రస్తుతం కమ్యూనిటీ స్ప్రెడ్‌కు ఆస్కారమున్నందున డాక్టర్లు ఎక్కువగా రక్షణ చర్యలు తీసుకోవాలని పల్మనాలజిస్ట్‌ హరికిషన్‌ గోనుగుంట్ల అన్నారు. ఈ వెబ్‌ కాన్ఫరెన్స్‌లో సమన్వయకర్తగా వ్యవహరించిన ఆయన ‘సాక్షి’తో సమావేశ వివరాలతో పాటు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘విడిగా ఫీవర్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలి. ఫార్మసీలోనూ మనుషుల మధ్య దూరాన్ని పాటించాలి. డాక్టర్లు ఔట్‌ పేషెంట్లను చూడటం మొదలుపెట్టినందున,  ఓపీల్లో దూరం పాటించేలా ఏర్పాటు చేయాలి. ఆసుపత్రులు వైరస్‌ వ్యాప్తి కేంద్రాలుగా మారితే చాలా ప్రమాదం. మలేరియా మందులు ఈ వైరస్‌ అదుపునకు సమర్థంగా పనిచేస్తున్నట్టు ఏ అధ్యయనంలోనూ నిరూపితం కాలేదు.

కొన్ని దేశాల్లో వ్యాక్సిన్‌ సిద్ధమైనట్లు, మనుషులపై ప్రయోగించినపుడు అవి విఫలమైనట్టు వాట్సాప్‌ గ్రూపుల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని  నమ్మొద్దు.  దీనిపై ప్రపంచంలోనే స్పష్టమైన వైద్య విధానం ఏర్పడలేదు. లాక్‌డౌన్‌ ఎత్తేస్తే కరోనాను అధిగమించినట్టేనన్న భావన సరి కాదు. లాక్‌డౌన్‌ ఉన్నా లేకున్నా ఈ వైరస్‌ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో టెలీ మెడిసిన్‌  మంచిది. ఎమర్జెన్సీ ఉన్న వారే డాక్టర్ల వద్దకు వెళ్లాలి. డాక్టర్లు తమ స్టెతస్కోప్, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి వాటికి బ్యాగ్‌లను విడిగా పెట్టుకోవాలి.  ఇవీ ఇన్ఫెక్షన్ల కారియర్లుగా మారుతున్నట్టు వెల్లడైంది. లాక్‌డౌన్‌ ఎత్తేశాక డాక్టర్లకు రోగుల నుంచి ఎక్కువ తాకిడి ఉంటుంది వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంగ్లండ్‌లో పాజిటివ్‌ పేషెంట్లను కూడా 28 రోజుల హోం ఐసోలేషన్, క్వారంటైన్‌లో పెట్టి ఫలితాలను సాధిస్తున్నందున, ఆ విధానాన్ని అనుసరిస్తే మరింత మేలు జరుగుతుంది’అని చెప్పారు.

‘కరోనా మహమ్మారి ప్రస్తుత ఉధృతి నియంత్రణకు ప్రత్యేకంగా ఫీవర్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. జ్వరంతో ఉన్న ప్రతి ఒక్కరికీ టెస్ట్‌లు నిర్వహిస్తే మంచిది.. ముఖ్యంగా ఈ మహమ్మారి సామాజికంగా వ్యాప్తి చెందడానికి ముందే ఫీవర్‌ ఆసుపత్రుల ఏర్పాటు అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అనుమానిత లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయడం ఉత్తమం.. పాజిటివ్‌ వచ్చిన పేషెంట్లు నిలకడైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటే ఇళ్లలోనే 28 రోజుల హోం క్వారంటైన్‌లో పెడితే సరిపోతుంది..’చైనా, అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, రష్యా, గ్రీస్, సింగపూర్, మలేసియా, ఫిలిప్పైన్స్, ఇండియాలో కరోనా చికిత్సలో నిమగ్నమైన పల్మనాలజిస్ట్‌లు వెలిబుచ్చిన అభిప్రాయాలివి.. – సాక్షి,హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement