సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రస్తుతం రాష్ట్రంలో మూడో దశలోకి ప్రవేశించినా, కమ్యూనిటీ స్ప్రెడ్ విస్తృతి పెరగకపోవడం మనకు కలిసొచ్చే అంశమని పల్మనాలజిస్ట్ డా.హరికిషన్ తెలిపారు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఒకట్రెండు చోట్ల కనిపిస్తున్నా కేసులు పెద్దగా పెరగకపోవడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. దేశంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా, వాటిలో మరణాల రేటు తక్కువగా ఉండటం, ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడున్న పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. కఠినమైన లాక్‌డౌన్ అమలు, ఇతరత్రా చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ప్రధానంగా లాక్‌డౌన్ వల్ల కేసుల పెరుగుదల గ్రాఫ్ నిలకడగా (ఫ్లాటెన్) సాగేట్లు చేయగలిగామని, దీనికి మరింత కిందకు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో తగ్గేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ తమ పేషెంట్లు, ఇతర ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారిని 70 నుంచి 100 మంది వరకు టెస్ట్ చేస్తే ఒకరు లేదా ఇద్దరిలోనే పాజిటివ్ రావడాన్ని బట్టి పరిస్థితి సానుకూలంగా ఉన్నట్లు భావించొచ్చని పేర్కొన్నారు. ఈ కారణాలన్నింటి వల్ల పాజిటివ్ కేసులను ప్రభుత్వం దాచిపెడుతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేయడం సరికాదన్నారు. లాక్‌డౌన్ ఎత్తేశారనో, మినహాయింపులు ఇచ్చారనో రోడ్లపైకి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేస్తే ఇన్ని రోజులు డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర రంగాల వారు చేసిన కృషి నిష్ఫలం అవుతుందని హెచ్చరించారు. వివిధ అంశాలపై హరికిషన్ వెలిబుచ్చిన అభిప్రాయాలు..
పెద్దలు బయటకు రావొద్దు..
రాబోయే నాలుగైదు నెలల పాటు పెద్ద వయసున్న, అనారోగ్య సమస్యలున్న వారు బయటకు రావొద్దు. ఇతరులు కూడా అత్యవసరమైతేనే బహిరంగప్రదేశాలకు రావాలి. పిల్లలకు భవిష్యత్‌లో ఇన్ఫెక్షన్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికైతే కరోనా నివారణకు వ్యాక్సిన్ రాలేదు. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు జంతువుల్లో కరోనా వైరస్ కట్టడికి యాంటీబాడీని డెవలప్ చేశారు. అయితే దీన్ని మానవులపై ప్రయోగించి పరిశోధనలు జరపాల్సి ఉంది. మనుషులకు ఉపయోగపడే వ్యాక్సిన్ అభివృద్ధికి కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కొన్ని ప్రయోగాలు జంతువులపై ఫలవంతమైనా మానవులపై ఇప్పుడే పరీక్షలు మొదలయ్యాయి. ఈ పరీక్షలు ఏ మేరకు ఫలప్రదం అయ్యాయో తెలుసుకునేందుకు కనీసం మరో 6 నెలల సమయం పడుతుంది.
వారికి ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్లు..
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు 65 ఏళ్లు పైబడిన వారికి న్యూమోకోకల్, ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సినేషన్ చేయడం ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను అధిగమించొచ్చు. పెద్ద వయసున్న వారు ఈ వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేసుకుంటే మరీ మంచిది. న్యూమోకోకల్ వ్యాక్సిన్లు పీసీవీ–13, పీపీఎస్వీ–23 రెండు రకాలు. 65 ఏళ్లు దాటిన పెద్దలకు పీపీఎస్‌వీ 23 వ్యాక్సిన్లను డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. పెద్ద వయసున్న వారికి ఈ వ్యాక్సిన్ ఎందుకు అవసరమంటే.. 65 ఏళ్ల వయసు దాటేటప్పటికి చిన్నప్పుడు వారు తీసుకున్న బీసీజీ, ఇతర వ్యాక్సిన్ల ప్రభావం తగ్గుతుంది. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఈ వ్యాక్సిన్లు తీసుకుంటే మంచిది.
నియంత్రణే పరమ ఔషధం..
కరోనా నివారణ, వైరస్ వ్యాప్తి కట్టడి అనేది నియంత్రణ చర్యలు, భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ల వినియోగం, వంటి ముందస్తు జాగ్రత్తలతోనే సాధ్యం. కరోనాకు ఇప్పుడున్న ట్రీట్‌మెంట్ ఇదొక్కటే. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సురక్షితమైన మార్గం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ఒక్కటే మార్గం.
Comments
Please login to add a commentAdd a comment