శభాష్.. అథ్వాల్!
బార్సిలోనా: నాలుగు రోజుల క్రితం బార్సిలోనా ఉగ్రదాడి ఘటనలో ప్రాణాలకు తెగించిన ఓ భారత సంతతి బ్రిటీషర్పై ప్రశంసల జల్లు కురు స్తోంది. బర్మింగ్‌హామ్‌కు చెందిన హారీ అథ్వాల్.. సెలవులు గడిపేందుకు బార్సిలోనాకు వచ్చాడు. లాస్ రాంబ్లాస్ ప్రాంతంలో ఉండగానే.. ఉగ్రవాదులు వ్యాన్‌తో పర్యాటకులను ఢీకొట్టి దూసుకుపోయారు. ఈ విషయాన్ని గమనించిన అథ్వాల్ రోడ్డుపై రక్తమోడుతున్న ఓ బాలుడిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి ఒక్క ఉదుటున రోడ్డుపైకి వచ్చి.. ఆ చిన్నారిని ఒడిలోకి తీసుకున్నాడు. ఉగ్రవాదులు మళ్లీ వెనక్కి వస్తారేమోననే భయంతో అందరూ పారిపోతున్నా.. పోలీసులు హెచ్చరిస్తున్నా అథ్వాల్ మాత్రం తీవ్రగాయాలైన చిన్నారిని వదిలిపెట్టలేదు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
చిత్రాలు చూసిన వారంతా అథ్వాల్‌ను హీరోగా కీర్తిస్తున్నారు. కానీ ఆయన మాత్రం ‘నేను పరిగెత్తే సరికి చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వ్యాను ఢీకొన్న ధాటికి చిన్నారి కాలు వంకరైపోయింది. తలనుంచి ఆగకుండా రక్తం కారుతోంది. చేత్తో రక్తం ఆపుతూ.. పల్స్ దొరుకుతుందేమోనని ప్రయత్నించా. కానీ.. లాభంలేదు. చిన్నారిని ఆ స్థితిలో అక్కడ వదిలి రావాలనిపించలేదు’ అని అథ్వాల్ ఆవేదనగా చెప్పాడు. కాగా, బార్సిలోనాలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. దాడికి ముందురోజు బార్సిలోనా శివార్లలో ఉగ్రవాదులు దాచిన పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తూ పేలటంతో భారీ ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.
బార్సిలోనా ఘటనలో భారత సంతతి బ్రిటిషర్పై ప్రశంసలు
ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నం