హర్విందర్‌కు స్వర్ణం
జకార్తా: పారా ఆసియా క్రీడల్లో భారత దివ్యాంగ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. హర్విందర్ సింగ్ ఆర్చరీలో భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. ఐదో రోజు పోటీల్లో భారత్ ఈ స్వర్ణం సహా తొమ్మిది పతకాలను సాధించింది. ఇందులో నాలుగేసి చొప్పున రజత, కాంస్యాలున్నాయి. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 37కు చేరింది. బుధవారం జరిగిన పురుషుల ఆర్చరీ డబ్ల్యూ2/ఎస్టీ కేటగిరీలో హర్విందర్ 6–0తో చైనాకు చెందిన జావో లిగ్జూను కంగుతినిపించి బంగారు పతకం అందుకున్నాడు. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్11 కేటగిరీలో మోను ఘంగాస్, లాంగ్‌జంప్ టి42/టి61/టి63 కేటగిరీలో విజయ్ కుమార్ రజతాలు గెలిచారు. పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 కేటగిరీలో మొహమ్మద్ యాసిర్‌కు కాంస్యం లభించింది.
మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్ ఫైనల్లో భవినబెన్ పటేల్–సోనల్‌బెన్ పటేల్ జోడీ 4–11, 12–14తో అసయుత్ దరరత్–పాటర్వడీ వరరిడంరొంకుల్ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడింది. దీంతో భారత జోడీ రజతంతో తృప్తిపడింది. చెస్ మహిళల వ్యక్తిగత విభాగంలో రజతం గెలుపొందిన జెన్నిత అంటో... టీమ్ ఈవెంట్లో ప్రేమ కనిశ్రీతో కలిసి కాంస్యం నెగ్గింది. మహిళల టీమ్ ఈవెంట్లో మృణాళి, మేఘ, టైజన్ పునరం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు గెలిచారు. పురుషుల పవర్‌లిఫ్టింగ్‌లో 80 కేజీల కేటగిరీలో పోటీపడిన సుధీర్ 192 కేజీల బరువెత్తి కాంస్యం చేజిక్కించుకున్నాడు.