స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలిన ఈవీఎంలు
16న తేలనున్నఅభ్యర్థుల భవితవ్యం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు బుధవారం ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఖమ్మం, పాలేరు అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఈవీఎంలు సెయింట్ జోసఫ్, మౌంట్‌ఫోర్ట్ హైస్కూళ్లలోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను ఖమ్మం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపరిచారు.
భద్రాచలం, పినపాక, ఇల్లందు నియోజకవర్గాల పరిధిలోని ఈవీఎంలను కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో భద్రపరిచారు. మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. భారీ బందోబస్తు మధ్య ఆయా స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు.
మే 16న కౌంటింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లెక్కింపు వరకు ఆయా స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పోలీస్ బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు సైతం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద విధులు నిర్వహించనున్నారు.
16న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో స్ట్రాంగ్‌రూమ్‌లలోని ఈవీఎంలలో అభ్యర్థుల జాతకాలు ఉన్నాయి. వీరి భవితవ్యం తేలాలంటే ఈనెల 16 వరకు ఆగాల్సిందే. ఎన్నికలు ముగియడంతో గెలుపోటములపై అభ్యర్థులు ఒక అంచనాకు వస్తున్నారు. తమకు అనుకూల, ప్రతికూల అంశాలు ఏమిటని బేరీజు వేసుకుంటున్నారు. అయితే ఎవరికి వారు తమదే విజయమని ధీమా వ్యక్తంచేస్తున్నారు.