hatchback models
-
పాత కార్లలో యూత్ రైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొన్నేళ్ల క్రితం వరకు కొత్త కారు కావాలంటే షోరూంకు వెళ్లి కొన్ని గంటల్లోనే నచ్చిన వాహనంతో రోడ్డుపై దూసుకుపోయేవారు. కొన్ని మోడళ్లకే కొద్ది రోజులు వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాహన రంగంలో పరిస్థితులు మారిపోయాయి. ఏ మోడల్ కారు కావాలన్నా తప్పనిసరిగా కొన్ని వారాలు, నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి. దీనికంతటికీ కారణం సెమికండక్టర్ల కొరత. మరోవైపు ముడి సరుకు వ్యయాలు భా రం కావడంతో వాహనాల ధరలను తయారీ కం పెనీలు ఎప్పుడూ లేని విధంగా క్రమం తప్పకుం డా పెంచుతూ పోతున్నాయి. దీంతో పాత కార్లకు డిమాండ్ అనూహ్యంగా అధికమైంది. అయితే ప్రీ–ఓన్డ్ కార్లను కొనేందుకు నవతరం ముందంజలో ఉన్నారని ఆన్లైన్ యూజ్డ్ కార్ల మార్కెట్‌ప్లేస్ కంపెనీ కార్స్24 నివేదిక చెబుతోంది. కొనుగోలుదార్లదే మార్కెట్.. పరిశ్రమలో అవ్యవస్థీకృత రంగానిదే 95 శాతం వాటా. రూ.2 లక్షల పెట్టుబడితో ఔత్సాహికులు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కొనుగోలుదార్లు వాహనం ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షిస్తున్నారు. కండీషన్నుబట్టి ధర నిర్ణయం అవుతోంది. పైగా కారు ఎక్కడ కొన్నా బ్యాంకులు రుణం ఇవ్వడం కలిసి వస్తోంది. వాహనం ఒకట్రెండేళ్లు వాడి 10,000 కిలోమీటర్లలోపు తిరిగితే యజమాని చెప్పిందే ధర. అదే రెండేళ్లు దాటితే కొనుగోలుదారు చెప్పిన ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఉంది. అయిదేళ్లలోపు వాడిన కార్లకే అత్యధికులు మొగ్గు చూపుతున్నారని వసంత్ మోటార్స్ ఎండీ కొమ్మారెడ్డి సందీప్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రస్తుతం కొనుగోలుదార్లదే మార్కెట్ అని ఆయన అన్నారు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోళ్లకు సై.. పాత కార్ల కొనుగోలుదార్లలో యువత వాటా ఏకంగా 80 శాతం ఉంది. యాప్, వెబ్ ఆధారిత వేదికలు వృద్ధి చెందేందుకు వీరు దోహదం చేస్తున్నారు. వాహన ధరలు పెరుగుతుండడం, మహమ్మారి కారణంగా వచ్చిన జీవనశైలి మార్పులు, ఆన్లైన్ కంపెనీల దూకుడు.. వెరళి డిజిటల్ వేదికల జోరుకు కారణం అవుతున్నాయి. యువ కస్టమర్లలో పురుషులదే పైచేయి. మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక కార్ల విషయానికి వస్తే హ్యాచ్బ్యాక్స్ వైపు మొగ్గు చూపుతున్నవారి సంఖ్య ఏకంగా 43% ఉంది. ఎస్‌యూవీలకు 26% మంది సై అంటున్నారు. పెట్రోల్ వాహనాలకే అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. యూజ్డ్ కార్ ఏ స్థితిలో ఉందన్నదే కొనుగోలుదార్లకు కీలక అంశం. ఇదీ దేశీయ మార్కెట్.. భారత్‌లో 2020–21లో 38 లక్షల పాత కార్లు చేతులుమారాయి. ఇందులో 5–7 ఏళ్లు వాడిన వాహనాల వాటా 31 శాతం, 8–10 ఏళ్లవి 29 శాతం ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 15 శాతం పెరగనుంది. ఏటా 12–14 శాతం వృద్ధితో 2025–26 నాటికి ఈ సంఖ్య 70 లక్షల యూనిట్ల పైచిలుకు నమోదు కానుందని నివేదికలు చెబుతున్నాయి. చవకగా ఉండి అధిక మైలేజీ ఇచ్చే కార్ల కోసం కస్టమర్లు ఎగబడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త కార్లు 27.11 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనినిబట్టి పాత కార్లకు ఉన్న డిమాండ్ అర్థం అవుతోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ 20–30 శాతం దూసుకెళ్లింది. ముఖ్యంగా దక్షిణాదిన పాత కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కోవిడ్ కారణంగా వ్యక్తిగతంగా వాహనం ఉండాలన్న భావన ప్రజల్లో బలపడుతోంది. -
కొత్త బాలెనో బుకింగ్స్ షురూ..
న్యూఢిల్లీ: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో కారు కొత్త వెర్షన్ ముందస్తు బుకింగ్స్‌ను.. మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) ప్రారంభించింది. రూ.11,000 ఇనీషియల్ పేమెంట్ కింద చెల్లించి నూతన కారును బుక్ చేసుకోవచ్చని మంగళవారం ప్రకటించింది. వచ్చే నెల్లో ఈ నూతన వెర్షన్ మార్కెట్లోకి విడుదల కానుండగా.. ఫిబ్రవరి తొలినాళ్లలోనే లాంచింగ్ కార్యక్రమం ఉండవచ్చని భావిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘కారు ముందు వైపు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అతివేగాన్ని తెలియజేసే వ్యవస్థ, డ్రైవర్ పక్కన వ్యక్తి సీట్ బెల్ట్ రిమైండర్, వెనుక వైపు పార్కింగ్ సెన్సార్లు వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఈ నూతన వెర్షన్లో ఉన్నాయి.’ అని ఎంఎస్ఐ ప్రకటనలో పేర్కొంది. -
హ్యుందాయ్ గ్రాండ్ వచ్చేసింది
న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ కొత్త కాంపాక్ట్ కారు, గ్రాండ్ ఐ10ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. మందగమనంలో ఉన్న అమ్మకాలకు ఊపునివ్వడానికి ఈ కొత్త కారును తెస్తున్నామని, ధరను రూ.4.29 లక్షల నుంచి రూ.6.41 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని కంపెనీ తెలిపింది. గ్రాండ్ ఐ10 కారు డీజిల్, పెట్రోల్ రెండు వేరియంట్లలలో లభిస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.4.29 లక్షల నుంచి రూ.5.47 లక్షల రేంజ్లోనూ, 1.1 లీటర్ డీజిల్ వేరియంట్ ధర రూ. 5.23 లక్షల నుంచి రూ.6.41 లక్షల రేంజ్లోనూ (రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. 1.1 లీటర్ డీజిల్ సెగ్మెంట్లో చౌక ధరలో లభ్యమవుతున్న కారు ఇదే. ఈ కారు 18.9 కి.మీ. (పెట్రోల్), 24 కి.మీ.(డీజిల్) మైలేజీనిస్తుందని అంచనా. ఈ కారు మారుతీ స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో, షెవర్లే బీట్, హోండా బ్రియో కార్లకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. 8 రంగులు, 4 వేరియంట్లు(ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా(టాప్ ఎండ్ వేరియంట్))లలో లభ్యమయ్యే ఈ కారు మారుతీ స్విఫ్ట్ కారు ధర కన్నా రూ.20,000-రూ.57,000 తక్కువ. ఈయాన్, శాంత్రో, ఐ10, ఐ20 తర్వాత హ్యుందాయ్ అందిస్తోన్న ఐదవ హ్యాచ్‌బాక్ ఇది. కారు ప్రత్యేకతలు: మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ విద్ బ్లూటూత్, స్టార్ట్/స్టాప్ పుష్ బటన్ ఉన్న స్మార్ట్ కీ, 256 లీటర్ల బూట్ స్పేస్, 2 డిన్ ఎంపీ3 ఆడియో సిస్టమ్(1 జీబీ ఇన్‌బిల్ట్ మెమెరీ), 14 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, టిల్ట్ స్టీరింగ్, లెదర్ స్టీరింగ్ వీల్, ఆడియో, ట్రిప్ మీటర్ కంట్రోల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్, మిర్రర్స్‌పై టర్న్ ఇండికేటర్లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, రియర్ స్పాయిలర్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, రియర్ డీ ఫాగర్, రియర్ వాషర్, వైపర్, ఎత్తు అడ్జెస్ట్ చేసుకునే డ్రైవర్ సీట్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, రియర్ ఏసీ వెంట్స్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ వంటి ప్రత్యేకతలున్నాయి.