సమస్యలపై సరిగా వ్యవహరించలేదు
♦ ఆత్మహత్యకు ముందు పరిణామాలను అధికారులు పట్టించుకోలేదు
♦ అణగారిన వర్గాల విద్యార్థుల సమస్యలపై వెంటనే స్పందించాలి
♦ కేంద్ర ప్రభుత్వానికి నిజనిర్ధారణ కమిటీ నివేదిక
న్యూఢిల్లీ: రోహిత్ వేముల ఆత్మహత్యకు ముందు వర్సిటీలో చోటుచేసుకున్న సమస్యలను పరిష్కరించడంలో హెచ్సీయూ అధికారులు సరిగ్గా వ్యవహరించలేదని ఈ ఉదంతంపై కేంద్రం ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ పేర్కొంది. దాని ఫలితంగానే రోహిత్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు షకీలా శంషు, సూరత్ సింగ్లతో కూడిన ద్విసభ్య కమిటీ శుక్రవారం తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ‘‘ఆత్మహత్యకు ముందు కొన్ని అంశాలపై వర్సిటీ అధికారులు సున్నితంగా వ్యవహరించి ఉండాల్సింది.
కానీ అలా జరగలేదు’’ అని నివేదికలో పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల సమస్యలను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేసింది. వారు విద్యాసంస్థల్లో ఎదుర్కొంటున్న సమస్యల పట్ల వర్సిటీ అధికారులు కూడా సరైన రీతిలో స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రోహిత్ ఆత్మహత్య అనంతరం హెచ్సీయూకు వచ్చిన ఈ కమిటీ విద్యార్థులు, విద్యావేత్తలు, వర్సిటీ అధికారులతో సమావేశమై వారి అభిప్రాయాలు సేకరించింది.