heavy air
-
గాలొచ్చి బ్రిడ్జి కూలిందట
న్యూఢిల్లీ: ‘గాలి మరీ గట్టిగా వచ్చింది. అందుకే బ్రిడ్జి కడుతుండగానే కూలిపోయింది’ – కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రి నితిన్ గడ్కరీకి ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన వివరణ ఇది. దాంతో విస్తుపోవడం ఆయన వంతైంది. ఈ విషయాన్ని సోమవారం ఓ సమావేశంలో మంత్రే స్వయంగా చెప్పుకొచ్చారు. బిహార్‌లోని సుల్తాన్‌గంజ్‌లో గంగా నదిపై కడుతున్న ఓ బ్రిడ్జిలో కొంత భాగం ఏప్రిల్ 29న కూలిపోయింది. దీనిపై సంబంధిత ఐఏఎస్ అధికారిని వివరణ కోరితే పెనుగాలే కారణమని తేలిగ్గా చెప్పేశారన్నారు మంత్రి. ‘‘ఎంత గట్టిగా వీచినా గాలికి బ్రిడ్జి ఎలా కూలుతుందో నాకింత వరకూ అర్థం కాలేదు. ఏకంగా రూ.1,710 కోట్లతో కడుతున్న బ్రిడ్జి కూలిందంటే నిర్మాణంలోనే లోపముందన్నమాటే’’ అని అభిప్రాయపడ్డారు. 3.12 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతి పొడవైందిగా నిలవనుంది. -
అమరావతిలో ఈదురు గాలుల బీభత్సం
-
ఈదురుగాలులకు ఎగిరిపోయిన సచివాలయం రేకులు
-
ఈదురుగాలులకు ఎగిరిపోయిన సచివాలయం రేకులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నాం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న రాజధాని ప్రాంతం.. ఒక్కసారిగా ఈదురు గాలులు వీచడంతో చిగురుటాకులా వణికింది. గాలి, భారీవర్షం అమరావతి పరిసర ప్రాంతంలో బీభత్సం సృష్టించాయి. గాలల ధాటికి రాష్ట్ర సచివాలయంలో రేకులు ఎగిరిపడ్డాయి. సచివాలయ ప్రాంగణంలో స్మార్ట్‌పోల్, ఎంట్రీపాయింట్ కుప్పకూలాయి. బ్లాక్ టెర్రస్‌లో రేకులు ఎగిరిపడగా, నాలుగో బ్లాక్‌లో రేకులు ఈదురుగాలల ధాటికి విరిగిపోయాయి. అలాగే గుంటూరు, తాడికొండ ప్రాంతాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగళగిరిలో వడగాళ్ల వాన స్థానికులను అతలాకుతలం చేసింది. మీడియాకు అనుమతి నిరాకరణ మరోవైపు ఇటీవల నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనం కూడా దెబ్బతిన్నది. ఈదురు గాలులకు హైకోర్టు రేకులు ఊడిపోయాయి. అదే సమయంలో సమీపంలో ఉన్న రమణ అనే కార్మికురాలపై రేకులు పడి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రేకులు లేచిపోవడంతో అక్కడి సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన భవనాన్ని రిపేర్ చేశారు. హైకోర్టు ప్రాంగణంలోకి మీడియాను అనుమంతించకుండా భారీగా పోలీసుల్ని మోహరించారు. -
'నై'రుతి
పత్తా లేని ‘పవనాలు’ హోరెత్తిస్తున్న గాలి.. చెదరిపోతున్న మేఘాలు ప్రశ్నార్థకంగా ఖరీఫ్ సాగు వర్షంకోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతన్నలు అనంతపురం అగ్రికల్చర్ : నైరుతీ రుతుపవనాలు పత్తాలేకుండా పోయాయి. వరుణుడి జాడ లేకుండా పోయింది. తుంపర్లు మినహా జిల్లాలో ఎక్కడా చెప్పుకోదగ్గ వర్షాలు పడటం లేదు. అరకొర తేమలోనే అన్నదాతలు ఖరీఫ్ సాగు కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గాలలు దుమ్మురేపుతూ జిల్లాను హోరెత్తిస్తున్నాయి. బలమైన గాలులు వీస్తుండటంతో వర్షాకాలంలో కారుమబ్బులు కనిపించడం లేదు. అపుడపుడు మేఘాలు దోబూచలాడినా... గాలి వేగానికి చెదిరిపోతున్నాయి. ఫలితంగా రైతుల గుండెల్లో గుబులు రేగుతోంది. పత్తా లేని వరుణుడు కీలకమైన నైరుతీ రుతువపనాలు పత్తా లేకుండా పోవడంతో వరుణుడి జాడ కనిపించడం లేదు. నైరుతీ పవనాలు రాకమునుపే జిల్లాలో అంతో ఇంతో వర్షం కురిసింది. జూన్ 8న జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత వర్షాలు బాగా తగ్గుముఖం పట్టాయి. నెలరోజులుగా జిల్లాలో ఎక్కడా ఒక్కచోట కూడా భారీ వర్షం కురిసిన దాఖలాలు లేవు. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, తుంపర్లు నమోదవుతున్నాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా 59 మి.మీ నమోదైంది. జూలైలో సాధారణ వర్షపాతం 67.4 మి.మీ కాగా కేవలం 13.4 మి.మీ నమోదైంది. మొత్తమ్మీద ఇప్పటివరకు 25 శాతం తక్కువగా వర్షాలు కురవడంతో ఖరీఫ్ పంటల సాగు పడకేసింది. 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు రెండు, మూడు రోజులుగా జిల్లాలో గాలుల వేగం పెరిగింది. శనివారం నమోదైన వివరాలు పరిశీలిస్తూ అనంతపురం మండలంలో ఏకంగా 36 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గుమ్మగట్ట, బుక్కరాయసముద్రం, రాప్తాడు, ఆత్మకూరు, గార్లదిన్నె, పామిడి, రాయదుర్గం, ధర్మవరం, బ్రహ్మసముద్రం, వజ్రకరూరు, పెద్దవడుగూరు, రాప్తాడు, కనగానపల్లి, రామగిరి, తలుపుల, యాడికి, అమరాపురం, కదిరి, రొద్దం తదితర మండలాల్లో 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు హోరెత్తిస్తున్నాయి. మిగతా మండలాల్లో కూడా 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గాలిలో తేమ శాతం కూడా పడిపోయింది. ఈ సీజన్లో ఉదయం వేళల్లో గాలిలో తేమ 75 నుంచి 95 శాతం ఉండాల్సి ఉండగా ఇపుడు 60 నుంచి 75 శాతం మధ్య నమోదవుతోంది. మధ్యాహ్న సమయంలో కూడా తేమశాతం బాగా తగ్గుదల కనిపిస్తోంది. ప్రత్యామ్నాయం తప్పదా...? ఇప్పటివరకు 85 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ పంట వేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 15 వేల హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున పంటలు సాగులోకి రావాల్సి ఉండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. గాలులు దుమ్మురేపుతుండటంతో వేసిన పంటలు అపుడే వాడుముఖం పట్టాయి. వరుణుడి కటాక్షం కోసం ఆకాశంవైపు చూస్తూ కాలం వెళ్లదీస్తున్న దుస్థితి నెలకొంది. వారం రోజులు వర్షాలు రాకపోతే ఇక ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకోసం వ్యవసాయశాఖ అధికారులు 67 వేల క్వింటాళ్ల ప్రత్యామ్నాయ విత్తనాలు అవసరమని కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపారు. -
జిల్లాలో ఇసుక తుఫాన్!
నాగేపల్లి వద్ద రోడ్డును కప్పేసిన ఇసుక ఆషాడ గాలులతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు గాలుల తీవ్రతకు ఇళ్లపై ఇసుక మేటలు ఆషాడం.. వచ్చిదంటే ఆ ఊళ్లో ప్రజలకు వణుకుపుడుతోంది. 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే గాలుల తీవ్రతకు గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు దూరమైంది. గాలులతో పాటు ఇసుక ఎగిసి వచ్చి రోడ్లు, గృహాలను కప్పేస్తుండడంతో జనం ఇక్కట్లు చెప్పనలవి కావడం లేదు. ఇసుక తుఫాన్ తాకిడికి జనం బెంబేలెత్తుతున్నారు. రూ. కోట్లు వెచ్చించి ఎడారీకరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడతున్నా.. ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. - కణేకల్లు (రాయదుర్గం) రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు, బొమ్మనహళ్ మండలాల్లో వేదవతి హగిరి పరివాహక ప్రాంత గ్రామాల్లోని ప్రజలు ఆషాడం గాలులకు కుదేలవుతున్నారు. నదీ తీర ప్రాంతాల్లో బలమైన గాలులకు ఇసుక ఎగసి పడుతుండటంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. ఈ సీజన్లో పలుచోట్ల ఆర్అండ్బీ రోడ్డును సైతం ఇసుకమేటలు కప్పేస్తున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అసౌకర్యంగా మారుతోంది. 15 వేల ఎకరాల్లో ఇసుక మేటలు కణేకల్లు మండలంలోని మాల్యం, నాగేపల్లి, తుంబిగనూరు, గరుడచేడు, మీన్లహళ్లి, బిదరకుంతం, దర్గాహోన్నూరు, గోవిందవాడ, బల్లనగుడ్డం తదితర గ్రామాల్లో సుమారు 15వేల ఎకరాల్లో ఇసుకమేటలు విస్తరించి ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం వేదవతి హగిరి పరివాహకప్రాంతంలో కుండ పోత వర్షాలకు వేదవతి నదిలో భారీగా వరదనీరు ప్రవహించింది. ఆ సమయంలో వేదవతి హగిరి పరివాహక ప్రాంతంలోని ఇసుక పెద్ద ఎత్తున ఇక్కడకు తోసుకువచ్చింది. చిన్నచిన్న ఇసుక రేణువులతో ఈ ప్రాంతంలో ఇసుకమేటలు విస్తరించి... ఇసుకకొండలుగా మారాయి. మిగిలిన సీజన్లలో ఏలాంటి ఇబ్బందులు లేకున్నా... ఆషాడంలో మాత్రం ఇక్కడ ఇసుక తుఫాన్లు చెలరేగుతుంటాయి. రోజంతా ఇసుక తుఫాన్ బలమైన గాలులకు ఇసుక రేణువులు ఎగిసి ఓ తుఫాన్‌లా ముందుకు సాగుతూ గ్రామాలను చుట్టుముడుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకూ రోజంతా ఇసుక తుఫాన్ వాతావరణం నెలకొని ఉంటుంది. రోడ్డుపై వెళుతున్న వాహనదారులను ఇసుక కప్పేస్తుంటుంది. ఈ ప్రాంతం దాటే వరకూ ఇసుకలో మునిగి తేలాల్సిందే. ఇసుక తుఫాన్ దెబ్బకు ద్విచక్ర వాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్ వాడుతున్నారు. ఈ ప్రాంతం దాటగానే వారి శరీరంపై ఉన్న దుస్తుల నుంచి పెద్ద మొత్తంలో ఇసుక వెలికి వస్తుంది. బలమైన గాలులకు పొలాల్లోని ఇసుక ఇళ్ల మీద పడుతోంది. ఇంటి ఆవరణం, గవాచీ, కిటికీల ద్వారా ఇసుక ఇళ్లలో చేరుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇళ్లను సైతం ఇసుక మేటలు కప్పేస్తుంటుంది. ప్రధానంగా మాల్యం–నాగేపల్లి, దర్గాహోన్నూరు–గోవిందవాడ, బల్లనగుడ్డం వద్ద ఆర్అండ్బీ రోడ్డుపై ఇసుక వచ్చేస్తుండటంతో వాహనదారులు రోడ్డు దాటేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తతో వెళ్లిన ప్రమాదాలకు గురికాక తప్పదు. రక్షణగోడల ఏర్పాటు ఏదీ? ఇసుకతో ఆర్అండ్బీ రోడ్డు బ్లాక్ అయ్యే ప్రాంతాల్లో రక్షణగోడలు నిర్మించాలన్న ప్రతిపాదన కొన్నేళ్లుగా ఉన్నా.. ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. రోడ్డుకు పై భాగంలో పెద్ద ఎత్తున పొడువుగా ప్రొటక్షన్వాల్ నిర్మిస్తే ఇసుకంత ఆ వాల్ వద్దకు వచ్చి పడుతోందని రోడ్డుపై రాదని అధికారుల అభిప్రాయం. ఈ మేరకు రెండు, మూడు చోట్ల ప్రొటక్షన్వాల్ నిర్మిస్తామని గతంలో అధికారులు ప్రకటించారు. ఐతే నేటికి ఎక్కడ నిర్మించింది లేదు.