భయానక కరువు!
–అడగంటిన భూగర్భజలాలు.. ఎండిపోయిన పంటలు
– తాగునీటికి కటకటలాడుతున్న పల్లెసీమలు
–బతకలేక వలసపోయిన 4.87 లక్షల కుటుంబాలు
– విలవిలాడిపోతున్న ‘అనంత’ ప్రజానీకం
– అయినా స్పందించని ‘అనంత’ ప్రజాప్రతినిధులు
(సాక్షిప్రతినిధి, అనంతపురం)
‘అనంత’లో అధికారికంగా 2. 11 లక్షల వ్యవసాయబోర్లు ఉన్నాయి. ఇందులో 87,574 బోర్లు ఎండిపోయాయి. పొలాల్లోని మోటర్లను రైతులు ఇళ్లకు చేర్చారు.
– జిల్లా చరిత్రలో ఎన్నడూ ఈ స్థాయిలో బోర్లు ఎండిపోలేదు
‘జిల్లాలో సరాసరి భూగర్భజలనీటి మట్టం 26 మీటర్లు. పుట్లూరు. యల్లనూరు, గాండ్లపెంట, యాడికి, అగళితో పాటు పలు మండలాల్లో ప్రస్తుతం 70–90 మీటర్లకు భూగర్భజలమట్టం పడిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంతకంటే భూగర్భజలమట్టం పడిపోయిన జిల్లా మరొకటి లేదు.
– ఇంత అట్టడుగుకు భూగర్భజలాలు పడిపోవడం చరిత్రలో తొలిసారి
- జిల్లాలో 15.42 లక్షల ఆవులు, గేదెలు, ఎద్దులు ఉండేవి. ప్రస్తుతం 8.22లక్షలకు పడిపోయింది.
– పశుసంపద ఇంత దారుణంగా తరిగిపోవడం ఇదే ప్రథమం
పై మూడు ఉదాహరణలు చూస్తే కరువు రక్కసి ఏ స్థాయిలో ‘అనంత’పై పంజా విసిరిందో...దాని దెబ్బకు రైతు..కూలీ...గొడ్డు...ఎలా విలవిలాడిపోతున్నారో ఇట్టే తెలుస్తుంది. ప్రస్తుతం ‘అనంత’ భయంకరమైన కరువుతో అల్లాడిపోతోంది. ఎంతలా అంటే గత 19 ఏళ్లలో కనీవినీ ఎరుగుని రీతిలో కరువు కమ్మేసింది. వర్షపుచుక్కలేదు...పచ్చటి గడ్డిలేదు.. బోరులో నీటి చెమ్మలేదు...బతికేందుకు కూలిపని లేదు...మొత్తం మీద జిల్లాలో రైతులు...రైతు కూలీలు తినేందుకు ముద్ద లేదు. దీంతో పొట్టనింపుకునేందుకు లక్షలాదిమంది వలసబాట పట్టారు. ఇదిలాగే కొనసాగితే అనంత....ఆకలిచావులకు నిలయంగా మారే ప్రమాదం ఉంది.
ఈ ఏడాది జిల్లాలో 15.15లక్షల హెక్టార్లలో వేరుశనగ, మరో 3–4లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యాయి. వేరుశనగ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తక్కిన పంటల్లో కూడా కంది, పత్తితో పాటు దాదాపు అన్ని పంటలదీ అదే పరిస్థితి. వరుసగా మూడేళ్లుగా పంట నష్టాలు చోటు చేసుకోవడంతో అన్నదాతలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఈ ఏడాది పరిస్థితి మరీ భయంకరంగా మారడంతో ‘వ్యవసాయం’ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైంది. పంట కోసం చేసిన అప్పులు తీర్చడం తలకు మించిన భారంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకునేవాళ్లు, పిల్లల చదువుల ఫీజులు కట్టలేక మధ్యలోనే కళాశాలలు మాన్పించిన వారు. దీర్ఘకాలిక జబ్బులకు చికిత్స కూడా చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నవారు చాలామంది ఉన్నారు. వెరసి ఈ సమస్యలను అధిగమించలేక, అవమాన భారం తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు తెగుస్తున్నారు.
ఉపాధిలేక ‘అనంత’ వలసబాట
జిల్లాలో 40.57లక్షల జనాభా ఉంది. ఇందులో 7.72లక్షల మేర జాబ్‌కార్డులు ఉండగా, 40 శాతం మందికి ఉపాధి పనులు కల్పిస్తున్నట్లు డ్వామా అధికారులు చెబుతున్నారు. ఒక్కో కుటుంబానికి 150రోజులు పని కల్పిస్తామంటున్నారు. అయితే జిల్లాలో 150రోజులు పనిదినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలు వందకు మించి లేవు. కుటుంబంలో నలుగురు ఉంటే 25 రోజుల్లో వీరికి కేటాయించిన ‘పని’ పూర్తి అయిపోతుంది. ఆపై ఉపాధి లభ్యం కాక వలసలు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం 4.87లక్షల మంది వలసెళ్లినట్లు ఓ స్వచ్ఛందసంస్థ తన సర్వేలో వెల్లడించింది. ఉపాధి లేక రైతుకూలీలతో పాటు రైతులు కూడా వలసెళ్లుతున్నారు. కేరళలో కొందరు రైతులు భిక్షాటన చేస్తున్నారు. వాస్తవ పరిస్థితిని పక్కదారి పట్టిస్తూ అధిక డబ్బుల కోసం వలసెళుతున్నారంటూ మంత్రి అయ్యన్నపాత్రుడుతో పాటు జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, జిల్లా మంత్రులు వ్యాఖ్యానించారంటే ‘అనంత’ రైతులపై వీరికి ఎంత మేర బాధ్యత ఉందో ఇట్టే అర్థమైపోతోంది.
తాగునీటికి కటకట
జిల్లాలో 1,003 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 678 గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొంది. ఇందులో 357గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటడంతో తాగునీటి సమస్య మరింత జఠిలమైంది. ప్రస్తుతం 26 మీటర్లకు భూగర్భజల నీటిమట్టం పడిపోయింది. రాష్ట్రంలోని 13 జిల్లాలో ఈ స్థాయిలో నీటిమట్టం మరే జిల్లాలో పడిపోలేదు. జిల్లాలో 2.11లక్షల వ్యవసాయబోర్లు ఉన్నాయి. ఇందులో 87,574బోర్లు ఎండిపోయాయి. విధిలేని పరిస్థితుల్లో రైతులు పొలాల్లోని మోటర్లను ఇంటికి చేర్చారు. నీళ్లు లేక 10వేల హెక్టార్లలో మల్బరీ, 5వేల హెక్టార్లలో చీనీ, బొప్పాయి, అరటి లాంటి పండ్లతోటలు ఎండిపోయాయి. గ్రామాల్లో పశువులకూ తాగేందుకు నీరు కరువవుతోంది. పశువుల దప్పిక తీర్చేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని రైతులంతా ఏకమై ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి దప్పిక తీరుస్తున్నారు.
తరిగిపోయిన పశుసంపద
వర్షపుజాడ లేకపోవడంతో జిల్లాలో ఎక్కడా పచ్చని గడ్డిపోచ కన్పించడం లేదు. పొలాల్లో అక్కడక్కడ నేలకు అతుక్కుపోయిన ఎండుగడ్డిని గొర్రెలు, పశువులు తినేందుకు ప్రయత్నిస్తున్నాయి. గడ్డిలేదని తెలుసుకున్న అవి కాస్తా అక్కడి మట్టిని నాకుతున్నాయి. గడ్డిలేక రైతులు పశువులను సంతలో అమ్మేస్తున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉండటంతో పశువులను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదు. దీంతో కబేలా వ్యాపారులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో 15.42లక్షల పశువులు ఉంటే ప్రస్తుతం వీటి సంఖ్య 8.22లక్షలకు పడిపోయింది. 38లక్షల గొర్రెలు, 8లక్షల మేకలను మేపు కోసం సుదూర ప్రాంతాలకు నెలల తరబడి తీసుకెళ్తున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో గడ్డి సరఫరా చేసి రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం జిల్లా నుంచి కర్ణాటక ప్రభుత్వం గడ్డి కొనుగోలు చేసి తరలించుకుపోతుంటే చేష్టలుడిగి చూస్తోంది.
ఎనిమిదేళ్లుగా జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా:
సంవత్సరం వర్షపాతం(మి.మీలలో) భూగర్భజలమట్టం(మీ।।లలో)
2009–10 615.6 13.04
2010–11 722.4 12.01
2011–12 495.4 14.65
2012–13 455.6 16.23
2013–14 538.7 18.59
2014–15 404.3 21.87
2015–16 503 22.32
2016–17 284 23.50
ఏడేళ్లుగా అనంతపురంజిల్లాలో ఖరీఫ్ పంట నష్టం(అధికారిక లెక్కల ప్రకారం):
సంవత్సరం పంట నష్టం(రూ.కోట్లలో)
2009 2,150
2010 2,300
2011 1,950
2012 2,225
2013 2,650
2014 3,100
2015 3,400
2016 3,500–4000
–––––––––––––––––––––––––––––––