మరికొద్ది రోజుల్లో మరణమృదంగం!
న్యూఢిల్లీ: కాలచక్రం గతితప్పిందా? మనిషి మనుగడ ప్రమాదంలో పడిందా? సమయానికి ప్రకృతి సహకారం లభించకపోవడం దేనికి సంకేతం? రావాల్సిన 'అచ్ఛే దిన్'.. మనుషులు చచ్చాక వస్తే ఫలితం ఉంటుందా? శాస్త్రవేత్తల అంచనాలను తలకిందులు చేస్తూ, జనంపై కరుణ చూపకుండా, ముఖం చాటేస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఇంకెప్పుడు? అవి రాకుంటే, వర్షం కురవకుంటే మరో నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా క్లిష్టపరిస్థితులు ఖాయంగా కనిపిస్తోంది. సాగు సంగతి పక్కనపెడితే, కనీసం తాగునీరైనా దొరకని పరిస్తితి తలెత్తనుంది. దేశంలోని 91 భారీ నీటి ప్రాజెక్టుల్లో నీటి నిలువలు అడుగంటిపోయాయంటూ కేంద్ర జలమండలి(సీడబ్ల్యూసీ) శుక్రవారం విడుదల చేసిన నివేదిక మున్ముందు మోగబోయే మరణమృదంగానికి సూచికలా ఉంది.
సీడబ్ల్యూసీ నిర్వహిస్తోన్న 91 భారీ నీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత జూన్ 16 నాటికి 15 శాతానికి పడిపోయింది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు 26.81 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) నుంచి 23.78 బీసీఎంలకు పడిపోయింది. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు వర్షాలు కురిపించకుంటే దేశం దుర్భిక్షపుటంచుల్లోపడే ప్రమాదం ఉందని సీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే దక్షిణాదిన నీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపింది. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో సీడబ్ల్యూసీ నిర్వహిస్తోన్న 31 ప్రాజెక్టుల్లో జూన్ 16 నాటికి నీటి నిల్వలు 4.86 బీసీఎంలు (9శాతం నీటి లభ్యత) మాత్రమే ఉండటం శోచనీయం.
ఇప్పటికే భారత భూభాగంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మదగమనంతో సాగుతుండటంతో వర్షాలు అంతకంతకూ ఆలస్యం అవుతున్నాయి. ఈ కారణంగా గత ఏడాదితో పోల్చుకుంటే 2016 సంవత్సరంలో ఖరీఫ్ సాగు 10 శాతం తగ్గిపోనుదని సీడబ్ల్యూసీ నివేదిక చెప్పింది. సాగుకు వినియోగంగా ఉన్న 93.63 లక్షల హెక్టార్లలో ఈ ఏడాదికిగానూ కేవలం 84.21 లక్షల హెక్టార్లలోనే రైతులు పనులు మొదలుపెట్టినట్లు పేర్కొంది. 2014లో 12 శాతం, 2015లో 14 శాతం లోటు వర్షం కురిసినట్లే ఈ ఏడాది కూడా వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నట్లు నివేదికనుబట్టి తెలుస్తోంది. నీటి నిలువలు తగ్గిపోవడంతో ఇప్పటికే కొండెక్కి కూర్చున్న కాయగూరలు, పప్పుదినుసుల ధరలు.. వర్షాలు కురవకపోతే ఇంకా పైపైకి వెళతాయి. అదే జరిగితే దేశంలోని 40 కోట్ల మంది పేదల జీవితాలు అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది!