heavy rains in chennai
-
వరద విషాదం..43 మంది మృతి
న్యూఢిల్లీ/బెంగళూరు/తిరువనంతపురం/సాక్షి, ముంబై/ పింప్రి: కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్నాయి. మహారాష్ట్రలో వరదల కారణంగా 27 మంది మరణించారు. ముఖ్యంగా సాంగ్లీ జిల్లాలోని పలుస్ తాలూకాలో వరద బాధితులతో వెళ్తున్న బోటు బోల్తా పడటంతో 9 మంది మృత్యువాత పడ్డారు. కర్ణాటకలో 9 మంది, కేరళలో నలుగురు, తమిళనాడులోని కోయంబత్తూరులో ఇద్దరు, ఒడిశాలో ఒకరు వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు చరిత్రలోనే అత్యధికంగా నీలగిరి జిల్లా అవలాంచి అడవుల్లో 82 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వివిధ రాష్ట్రాల్లో వరదల్లో చిక్కుకున్న లక్షలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లు నేలమట్టం కావడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వానలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్డు, రైల్వే రవాణా స్తంభించింది. వరద బాధిత రాష్ట్రాల్లో సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ నేత రాహుల్ పిలుపునిచ్చారు. ఐదు జిల్లాల్లో అత్యధిక ప్రభావం మహారాష్ట్రలోని పుణే, సతారా సాంగ్లీ, కొల్హాపూర్, షోలాపూర్ జిల్లాల్లో వరదల కారణంగా ఇప్పటి వరకు 27 మంది మరణించినట్టు పుణే డివిజన్ కమిషనర్ దీపక్ మైసేకర్ తెలిపారు. ముఖ్యంగా సాంగ్లీ పలుస్ తాలుకాలో కృష్ణా, యేర్లా నదీ సంగమంలో వరద తీవ్రతకు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురువారం ఉదయం పలుస్ గ్రామస్తులను తరలిస్తున్న బోటు బోల్తా పడింది. దీంతో 14 మంది గల్లంతు కాగా 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. సహాయక సిబ్బంది 9 మృతదేహాలను వెలికితీశారు. సాంగ్లీ జిల్లా జైలు వరద నీటిలో చిక్కుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆ ప్రాంతానికి విమానంలో వెళ్లి రక్షణ, సహాయక చర్యలను పర్యవేక్షించారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో ఫోన్లో మాట్లాడారు. సాంగ్లీలో పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు ఆల్మట్టి డ్యాం నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కోరారు. వరదల కారణంగా కొల్హాపూర్–మిరజ్ మార్గంలో రైళ్లను రద్దు చేశారు. పుణే–బెంగళూర్ జాతీయ రహదారి దెబ్బతినడంతో పుణే–షోలాపూర్ రహదారి మీదుగా వాహనాలను మళ్లించారు. సాయం అందించండి: యడియూరప్ప కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు 9 మంది చనిపోగా 43 వేల మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యమంత్రి యడియూరప్ప బెళగావిలో మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.5వేల కోట్లు అవసరమవుతాయని, దాతలు ముందుకు రావాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సీఎం సహాయ నిధికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధామూర్తి రూ.10 కోట్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో భారీ వర్షాలు, కొండచెరియాలు విరిగిపడటంతో ఏడాది చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. -
చెన్నైలో కుండపోత
సాక్షి ప్రతినిధి, చెన్నై: భారీ వర్షాలకు చెన్నై తడిసిముద్దయింది. గత ఐదు రోజులుగా చెన్నైతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు, నాగపట్నం, తిరువారూరు, కడలూరు సముద్రతీర జిల్లాల్లో వర్ష బీభత్సంతో ప్రజలు, అధికారులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. గురువారం రాత్రంతా కురిసిన వర్షానికి చెన్నై నగరం, శివారు ప్రాంతాల్లో రోడ్లపై ఐదు అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మరో రెండ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాలేజీలు, స్కూల్స్‌కు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. శుక్రవారం ఉదయం నుంచి వర్షం కాస్త తెరపిచ్చినప్పటికీ సాయంత్రం నుంచి జోరువాన మొదలైంది. భయం గుప్పిట్లో జనం గత నెల 27వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై సహా పలు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షంతో చెన్నైలోని ప్రధాన ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మెరీనా బీచ్‌లో 30 సెంటీమీటర్ల వర్షం కురవటంతో బీచ్ సర్వీస్ రోడ్లన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయి. చాలాచోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. గురువారం రాత్రి సెయింట్ థామస్ మౌంట్ నుంచి కొడంబాకంకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రాత్రి 9.30 నుంచి తెల్లవారు జామున 3.20 గంటల వరకు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రైవేటు సంస్థలు శుక్ర, శని వారాల్లో ఉద్యోగులకు సెలవులు ప్రకటించాలని లేదా.. ఇంటినుంచి పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వదంతులు నమ్మొద్దు చెన్నై పరిసరప్రాంతాల్లోని రిజర్వాయర్లు నిండిపోయాయని అవి కూలిపోయే ప్రమాదముందనే సమాచారంతో చెన్నై శివార్లతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అవన్నీ వదంతులేనని.. రిజర్వాయర్లు భద్రంగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్నా వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లు సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. తమను ఆదుకోవాలంటూ చెన్నైలోని ముదిచుర్ రోడ్‌పై పలువురు నిరసన తెలిపారు. చెన్నై సహా వర్షప్రభావ జిల్లాల్లో రోడ్డు రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. అయితే దూరప్రాంత రైళ్లు, విమాన సేవలకు అంతరాయం కలగలేదని అధికారులు వెల్లడించారు. జాతీయ విపత్తుల నివారణ బృందాలు నగరంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. కరుణ, పన్నీర్‌సెల్వం ఇళ్లల్లోకి... చెన్నై గోపాలపురంలోని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, ఆళ్వార్‌పేటలోని డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వంసహా పలువురు మంత్రుల నివాసాల్లోకి వరదనీరు వచ్చింది. పట్టాలపై వరదనీరు చేరడంతో లోకల్ రైళ్లను నిలిపివేశారు. సీఎం పళనిస్వామి, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఎగసిపడుతున్న సముద్రం నాగపట్టణం భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోతోంది. ఒకవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉండగా మరోవైపు కుండపోత కారణంగా జిల్లాలో పలుప్రాంతాలు నీటమునిగాయి. జిల్లాలో వేల ఇళ్లు, లక్షల ఎకరాల్లో వరిపంట నీట మునిగాయి. దాదాపు 10వేల మంది మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఆగిపోయారు. తీర ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షంతోపాటు పిడుగులుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
చెన్నై జలమయం.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు!
సాక్షి, చెన్నై: ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో తమిళనాట పది జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చెన్నై, శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత అనుభవాల నేపథ్యంలో తాజా వర్షం ప్రజల్ని వణికించింది. 2015 డిసెంబరులో ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో కురిసిన వర్షాలతో చెన్నై జల దిగ్బంధంలో చిక్కిన విషయం తెలిసిందే. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గత ఏడాది ఈశాన్య రుతు పవనాల రూపంలో వర్ధా తుఫాన్ ప్రళయతాండవం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈశాన్య రుతు పవనాల ప్రవేశంతో చెన్నై, శివారు వాసుల్లో ఆందోళన పెరిగింది. సోమవారం ఉదయం నుంచి రుతు పవనాల ప్రభావం, బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనంతో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరులతో పాటుగా పది జిల్లాల్లో వర్షాలు పడుతూ వస్తున్నాయి. సోమవారం రాత్రి వర్షం తీవ్రత మరి ఎక్కువ కావడంతో లోతటు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రాత్రికి రాత్రే అనేక లోతట్టు ప్రాంతాల్లోని జనం తమ ఇళ్లను వదలి పెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మంగళవారం ఉదయాన్నే ఏ రోడ్డు చూసినా నదుల్ని తలపించేవిధంగా పరవళ్లు తొక్కాయి. చెన్నైలోని అనేక సబ్ వేలలో నీళ్లు చేరడంతో అటు వైపుగా వాహనాలు వెళ్ల లేని పరిస్థితి. చెన్నైలో యాభైకు పైగా ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజల్లో భయందోళన పెరిగింది. మొత్తం 22 సబ్ వేలలో నీళ్లు చేరడం వంటి ప్రభావంతో చెన్నై రోడ్లు మీద వాహనాలు నత్తనడకన సాగాల్సి వచ్చింది. ఇక, గత అనుభవాలతో శివారుల్లోని చెరువులకు ముందుగా గండ్లు కొట్టడంతో అడయార్ నదిలో మరింతగా ఉధృతి పెరిగింది. రామాపురం, ఈక్కాడు తాంగల్, సైదా పేట మీదుగా అడయార్, కోట్టూరు పురం వైపుగా అడయార్ నదిలోనీటి ఉధృతి పెరిగింది. గతంలో ఈ నది ఉధృతే చెన్నై నగరాన్ని ముంచేసింది. కాగా, మరో రెండు రోజుల పాటు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలలోనే కాకుండా కడలూరు, విల్లుపురం, తంజావూరు, నాగపట్నం, పుదుకోటై, రామనాధపురం, తిరువారూర్, కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలిల్లోనూ భారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో శీర్గాలిలో అత్యధికంగా 31 సె.మీ., చెన్నై తాంబరం, సెంబరబాక్కంలలో 18 సెం.మీ., మీనంబాక్కంలో 17 సెం.మీ., నుంగంబాక్కంలో 12 సెం.మీ. వర్షం పడింది. ఇక, పిడుగు పడి ఇద్దరు, గోడకూలి ఒకరు, విద్యుదాఘాతానికి మరో ఇద్దరు మరణించారు. -
పడవలు కాదు.. విమానాలు!
చెన్నై: భారీ వర్షాల కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం చిన్నపాటి నదిలా మారిపోయింది. దాంతో విమానాలు కాస్తా పడవల్లా తేలుతున్నాయి. వరుసగా పార్కింగ్ చేసిన విమానాలు దూరంగా పడవల్లా కనిపిస్తుంటే కేవలం చెన్నై వాసులే కాదు.. భారతీయులంతా విస్తుపోతున్నారు. చెన్నై విమానాశ్రయం మొత్తం నీళ్లతో నిండిపోవడంతో విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. ఇక చెన్నై మీదుగా వెళ్లాల్సిన 19 రైళ్లు కూడా రద్దయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో పీకల్లోతు నీళ్లు ప్రవహిస్తుండటంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. అడయార్ నదిమీద ఉన్న వంతెన పై నుంచి నీళ్లు ప్రవహిస్తుండటంతో వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. నగరంలో ప్రజలు ఎటూ కదలడానికి వీల్లేకుండా పోయింది.