Hello Meera Movie
-
'హలో మీరా' మూవీ రివ్యూ
నటీనటులు: గార్గేయి ఎల్లాప్రగడ దర్శకుడు: శ్రీనివాసు కాకర్ల నిర్మాణ సంస్థ: లూమియర్ సినిమా నిర్మాతలు: డాక్టర్ లక్ష్మణరావు దిక్కుల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల సంగీత: ఎస్.చిన్న సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ కొప్పినీడు విడుదల: ఏప్రిల్ 21, 2023 మంచి ప్రయోగాత్మక కథా చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రం హలో మీరా. ఇది సింగిల్ పాత్రతో రూపొందిన సైకిలాజికల్ డ్రామా చిత్రం. సింగిల్ పాత్రతో చిత్రం చేయడం అంటే కత్తి మీద సామే. ఇంతకు ముందు నటుడు పార్తీపన్ ఇదే తరహాలో రూపొందించిన ఒత్త చెరుప్పు చిత్రం విశేష ప్రేక్షకాదరణతో పాటు పలు అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు బాపు శిష్యుడు శ్రీనివాసు కాకర్ల తెరకెక్కించిన వైవిధ్య భరిత కథా చిత్రం హలో మీరా. ఈ చిత్రం ఏప్రిల్ 21, 2023న థియేటర్లలో విడుదలైంది. సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సినీ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. మీరా (గార్గేయి)కి అనే అమ్మాయికి రెండు రోజుల్లో పెళ్లి. పెళ్లి పనులు జరుగుతూ ఉండగా.. ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంటుంది. హైదరాబాద్‌లో జాబ్ చేసే అమ్మాయి పెళ్లి కోసం తన ఫ్రెండ్స్ అందరూ వివాహానికి హాజరయ్యేందుకు విజయవాడకు బయలుదేరుతారు. అప్పుడే టైలర్ దగ్గర కెళ్లి దుస్తులు కోసమని వెళ్లిన మీరాకు అప్పుడే ఒక ఫోన్ వస్తుంది. ఆ ఒక్క ఫోన్‌తో ఆమె జీవితం అంతా తలక్రిందులవుతుంది. అప్పటివరకు సంతోషంగా ఉన్న అమ్మాయికి వచ్చిన ఫోన్ కాల్ ఎవరిది? అవతలి వ్యక్తి ఏం మాట్లాడారు? అసలు తన పెళ్లి జరిగిందా? ఇంతకీ ఆ కాల్ ఎవరిదై ఉంటుంది? అనేది తెలియాలంటే 'హలో మీరా'ను చూడాల్సిందే. కథ ఎలా సాగిందంటే: ఒక సినిమా తీయాలంటే ఈ రోజుల్లో నటీనటులు ఎంతో కీలకం. ఎంతోమంది పాత్రలను తెరకెక్కించాలి. కానీ అలాంటివేమీ లేకుండా సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తీయడం అంటే కత్తిమీద సామే అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాను తీయాలంటే దర్శకుడికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటిదీ చేసి చూపించారు శ్రీనివాస్. కానీ చిత్రంలో మనకు తెరపై కనిపించేది కేవలం ఒక్కరే మీరా (గార్గేయి ఎల్లాప్రగడ). ఆమె తన పాత్రలో చూపించిన హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సినిమాలో ఒక్క పాత్రే అయినా ప్రతి క్షణం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ కథ మొత్తంలో మిగతా వారి ఫోన్ సంభాషణలతోనే కథ ఆసక్తికరంగా సాగింది. కానీ ఈ కథ మొత్తంలో తెరపై కనిపించింది మాత్రం మీరానే. హలో మీరా చిత్రంలో తాను చూపించిన హావభావాలకు ఎవరైనా ఫిదా కాకుండా ఉండలేరు. మొత్తానికి సగటు సినీ ప్రేక్షకుడిని సింగిల్ క్యారెక్టర్‌తో మెప్పించడం దర్శకుడు కాకర్ల శ్రీనివాస్ చేసింది పెద్ద సాహసమే అని చెప్పాలి. -
Hello Meera Movie: హాలో మీరా.. దర్శకుడి గొప్ప ప్రయోగమిది!
రాతి పులుసు 'అనే యూరప్ జానపద కథ ఒకటి ఉన్నది. భలే చమత్కారమైన కథ. వీలయినంత గుర్తున్నది చెప్పడానికి ప్రయత్నిస్తా రండి.' ఒకానొక మనిషి కాలినడకన తోవ పట్టుకు పోతున్నాడు. ఎక్కడికో తెలీదు. నడిచీ నడిచీ కడుపులో దహించుకుపోయేంత ఆకలి. మనిషి మట్టి కొట్టుకు పోయి ఉన్నాడు. జేబులో నాలుగు డబ్బులు ఉండి ఉంటే ఏ బండి చక్రాన్నో పట్టుకునేవాడు. ఆ మాత్రం కూడా లేనట్టు ఉంది. నడవగా నడవగా ఒక ఊరు తగిలింది. మొదట కనపడిన ఇంటి తలుపు ముందు నిలబడి తినడానికి ఏమైనా ఉంటే కాస్త పెట్టమని అడిగాడు. ఇంట్లో ఏముందో ఏంలేదో తెలీదు. ఇతగాడి వాలకం చూస్తే మాత్రం ఏమీ పెట్టబుద్ది అయినట్లు లేదు. రెండో ఇల్లు అంతే, ఆ ఇంటి తరువాత ఒక నాలుగు గడపలు దాటి అడిగినా అయిదో ఇంట్లో కూడా అదే స్పందన. మన కథానాయకుడు ఎవరైనా కానీ, ఏమైనా కానీ చాలా తెలివైన వాడు. ప్రాధేయపడి అడిగాం ఫలితం లేదు ఈ ఊరిలో ఇది కాదు పద్దతి అనుకున్నాడు. ఈసారి తలుపు తట్టిన ఇంటి వారికి మాత్రం తినడానికి ఏమైనా ఇవ్వండి అని అడగలేదు. ఇప్పుడే ఇస్తా ఒక కుండ ఉంటే ఇవ్వమని అడిగాడు . కుండ ఇచ్చినావిడ తలుపుకానుకుని ఏం చేస్తాడా అని చూస్తుంది. కుండని అలా నేలమీద పెట్టి అటు ఇటూ కనపడిన మూడు రాళ్లని, కాసింత ఎండు కొమ్మలు, గడ్డి పోచలు పట్టుకు వచ్చి మూడు రాళ్ల పొయ్యిగా ఆమర్చి దానిపై కుండని పెట్టి పొయ్యి వెలిగించ బోతూ వెనక్కి తిరిగి, కాసిన్ని మంచి నీళ్లు దొరుకుతాయా అవి ఉంటే చాలు పని అయిపోతుంది అన్నాడు. ఆవిడ కుండ నిండా నీళ్లు తెచ్చి ఇచ్చి చోద్యం చూస్తుంది. మనవాడు కుండ కింద మంట పెట్టి జేబులో చేయి పెట్టి ఒక గులక రాయిని బయటకు తీశాడు, భక్తిగా కళ్లకద్దుకుని ఆ రాయిని కుండలో జార విడుస్తూ ఆవిడ కేసి చూసి నవ్వాడు మరేం లేదమ్మా పులుసు రాయి అంతే అన్నాడు. పులుసు రాయా, అదేంటి ఎప్పుడూ వినలేదే ? అని వింత పోయింది ఆవిడ. ఈ రాయి వేసి పులుసు కాస్తే ఉంటుంది , అబ్బా అని లొట్టలేసి చూస్తారుగా అంటూ ఒక కర్ర పుల్ల తీసుకుని కుండలో కలియతిప్పడం మొదలు పెట్టాడు. తిప్పి తిప్పి మరిగిన నీళ్లు కాసిన్ని నాలుక మీద వేసి రుచి చూసుకుని అహా అన్నట్టు కనుబొమలు ఎగరేసి వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే ఈ రాయి చమత్కారం విని ఇరుగింటి ఆశమ్మ, పొరుగింటి పోశమ్మ, ఎదురింటి బూశమ్మ తతిమ్మా అమ్మలు కూడా చేరారు. పులుసు తయారీ దారు తనలో తాను అనుకున్నట్టుగా అంటూనే వారికి వినిపించేలా, బావుంది, చాలా బావుంది కానీ కాస్త చింతపండు, ఉప్పు, ఇంత జీలకర్ర ఉండి ఉంటే ఇంకా అద్భుతంగా తయారవుతుంది. ఈ మాటలు చెవిన పడ్డమే ఆలస్యం వెంటనే దినుసులు దిగి పోయాయి. చిరు నవ్వుతో వాటిని అందుకుని ఆ నీళ్లలోకి వంపాడు, పులుసు మరుగుతోంది, ఆవిరి తేలుతోంది. ఏం పర్లేదు కాస్త సమయం పడుతుంది. అన్నట్లూ మీరు పుట్టి బుద్ది ఎరిగిన దగ్గరి నుంచి ఈ ఊరు దాటి పొయిన వారిలా లేరు, ఇక్కడి నుండి దక్షిణం వైపుకు వంద మైళ్ల దూరంలో జింత్ర అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో పండుతాయండి క్యారెట్లు అబ్బో ఎంత రుచి అనుకున్నారు, ప్రపంచంలో అట్లాంటి కారెట్లు మరెక్కడా దొరకవు. వస్తున్నప్పుడు పాపం ఒక రెండు దుంపలు మీకోసం తేవాల్సింది. అన్నట్లూ మీ ఊర్లో క్యారెట్ ఎట్లా ఉంటాయి, పర్లేదా? అనే ప్రశ్న ముగిసి ముగియకమునుపే ఒకావిడ క్యారెట్ బుట్ట పట్టుకు వచ్చింది. ఆ బుట్టలోనే ఒక వైపు ఉర్లగడ్డలు కూడా ఉన్నాయి. పర్లేదే! చూడ్డానికి రంగు బాగా ఉన్నాయి, రుచి పరీక్షిస్తే పొలా అని ఒక చేత్తో నాలుగు కేరట్ దుంపలు ఇంకో చేత్తో ఆరు ఉర్లగడ్డలు ఆ మరుగు తున్న నీటిలో పడేసీ మళ్ళీ కబుర్లు మొదలు పెట్టాడు. ఉర్లగడ్డ పడిందిగా పులుసు చిక్కనయింది, ఘుమఘుమలు కూడా మొదలయ్యాయి. మళ్ళీ పుల్ల పట్టుకు తిప్పి రుచి చూడబోయాడు, ఈ సారి ఒక ఇల్లాలు చేయి చాపింది, పులుసు చుక్కలు ఆవిడ చేతిలో ఒంపాడు, ఆవిడ తన అరచేతిని నాకేసి తన్మయత్వంగా మొహం పెట్టింది, మరి ఇంట్లో తరిగిన క్యాబేజీ పోగులు ఉన్నాయి అవి కూడా వేద్దామా? అని అడిగింది. దానికేమమ్మా భాగ్యం? పులుసు రాయి దేనినయినా రుచితుల్యం చేస్తుంది పాపం వెళ్లి తెచ్చుకోండి అని ఉదారంగా అనుమతి ఇచ్చేశాడు. మొత్తానికి ఆసారి ఆయిన్ని, ఈసారి ఈయిన్ని దినుసులు చేరుతూనే ఉన్నాయి. ఇంతలో వేటకని అడివికి వెళ్లిన మగవాళ్లు పల్లెకు వచ్చేశారు. నలుగుడు ముక్క లేకుండా పులుసు ఏమిటి అని ఒక పెద్దాయన కోప్పడి తను వేటాడి తెచ్చిన కుందేళ్ల తాజా మాంసం ముక్కలు అందులో మరగనిచ్చాడు. పులుసు తయారు. అంతకన్నా అద్భుతమైన పులుసు ముందెన్నడూ తిని ఎరగలేదని తిన్నవాళ్లంతా ఏకగ్రీవపడ్డారు. తాను కూడా ఆ ఊరి అంత మంచివాళ్లని మునెపెన్నడూ ఎరిగి ఉండనని దానయ్య కూడా ప్రకటించి తన గుర్తుగా ఉంచుకొమ్మని కానుకగా ఆ పులుసు రాయిని వారికి ఇచ్చేసి తన దారి తాను చూసుకున్నాడు . ఈ కథని మా మిత్రుడు శ్రీనివాస్ చదివి కాని, విని కాని ఉంటారని నేను అనుకోవడం లేదు. ఆయనకు ఈ కథకు ఉన్న సంబంధం అల్లా, ఎట్లా అయితే ఆ కథలో కథానాయకుడు వనరులు ఏమీ లేని చోట, నలుగురూ నాలుగు చేతులు వేసినప్పుడు ఒక మహద్భుతం చేయవచ్చని నమ్మికతో నడుస్తున్నాడో , శ్రీనివాస్ ది అదే నమ్మిక. సినిమాలు తీయాలి. దాని కొరకు ముందుగా ఒక సినిమా అయినా తీయాలి అనేదే ఆయన లక్ష్యం. చేతిలో మ్యాజిక్ ఉంది. కాని చూసే వాడికి అవి ఖాళీ చేతుల్లా కనపడుతున్నాయే.. మరెలా అని కథ అనే గులకరాయిని పట్టుకుని ఆయన నడక మొదలెట్టాడు. పిడికిట్లో అది ఒదిగి ఉంది. నడక అనంతరం గుప్పిట విప్పి చూస్తే అది ముత్యంలా తయారయింది. ఒక పాతికేళ్ల అమ్మాయి, పేరు మీరా. రేపొక్క రోజు ఆగితే ఎల్లుండి తన పెళ్లి. బట్టలు తెచ్చుకోడానికి బయలు దేరిన అమ్మాయి సాయంత్రం అయిదు దాటింది.. ఆరు దాటింది.. ఏడయినా ఇల్లు చేరదే ! ఎక్కడా తప్పి పోయింది లేదు .. అమ్మ చేసినా.. నాన్న చేసినా , తమ్ముడు చేసినా.. కాబోయే శ్రీవారు, వారి అమ్మగారు, చిన్ననాటి మిత్రులు ఎవరు చేసినా ఫోన్ ఎత్తుతోంది .. వారితో మాట్లాడుతూనే ఉంది.. జవాబు చెబుతూనే ఉంది. పోని ఇదేమయినా ఇష్టం లేని పెళ్లా అంటే అదేం కాదు.. ప్రేమించిన అబ్బాయినే పెళ్లాడబోతుంది. మరేమిటి? ఇంటి నిండా బంధువులు, విడిదింట్లో మగపెళ్లి వారు, హోటల్ గదుల్లో మిత్రులు అంతా వచ్చి ఉన్నారు. టైలర్ షాపు నుంచి తిన్నగా ఇంటికి రావాల్సిన అమ్మాయి.. ఇంటి వైపు కాక ఊరిని వదిలి పెట్టి హైదరాబాదు నగరం వైపు.. నేషనల్ హైవే మీద ఒంటరిగా కారు నడుపుతూ వెళ్లావలసిన అవసరం ఏంటి? ఇదేం క్రైం థ్రిల్లర్ కాదు, యాక్షన్ ఓరియెంటెడ్ జానర్ అసలే కాదు. పూర్తిగా సంసార పక్ష సినిమా.. కుటుంబ గాథా చిత్రం. మనుషులు, అనుబంధాలు, నమ్మకాలు, ద్రోహాలు, కాసిన్ని కన్నీళ్లు, గోరంత దీపమంత ధైర్యం వెలుగులో కొండంత భయాన్ని ఎదుర్కొన్న ఒక ఆడపిల్ల కథ. సినిమా అంతా ఇందులో మీరా అన్న పాత్ర వహించిన గార్గేయి తప్పా మరో మనిషి మొహం కనపడదు. ఎన్నో గొంతులు వినపడతాయి. ఎన్నెన్నో భావనలు అర్థమవుతాయి. ఇందులో మనకు వినపడిన ప్రతి కరుకు గొంతు, ప్రతి మెత్తని పలుకు, ప్రతి కంగారు స్వరం ఆ మనిషి ఎలా ఉండి ఉంటారనేది మనకంటూ ఒక ఊహని కలుగ జేస్తుంది. మనం కళ్లతో సినిమా చూస్తూ.. ఊహల్లో సినిమాలోని పాత్రలని నిర్మించుకుంటాం. ఇంతకన్నా కథని ఏమి చెప్పలేను. ఇదంతా దర్శకత్వ ప్రతిభ . డైరెక్టర్ మూవీ ఇది. తెలుగులో గొప్ప ప్రయోగం ఇది. సగటు ప్రేక్షకుడి పైన ఉన్న నమ్మకం ఈ సినిమా . గర్వించే మన సినిమా ఇది. సినిమా చివరలో సుఖాంతంలో పెద్ద సమస్య నుంచి మీరా బయట పడుతుంది. ఆ మొహంలో, కళ్లల్లో, పెదవుల మీద గొప్ప రిలీఫ్ . ఆ సమయంలో ఏం చేయాలి? పిడుగును ఒడిసి పట్టి నలిపి పడేసినంత, కొండలని పిండి కొట్టి చెల్లా చెదురు చేసినంత గొప్ప ఫీల్ కావాలి. ఆ విజయాన్ని ఆస్వాదించాలి. కానీ ఆ అమ్మాయి చేసిన మొట్ట మొదటి పని తన తమ్ముడికి కాల్ కలిపి, బట్టలు కుట్టిన టైలర్‌కి చాలా అవసరంగా డబ్బులు కావాలి. అర్థ రాత్రి దాటి ఉన్నా పర్లేదు, ముందు ఆ అమ్మాయికి డబ్బులు అందించమంటుంది. సూది కుట్టంత చిన్న మనిషి, ఆవిడ అవసరం దగ్గర ఆపేసిన గొప్ప సినిమా ఇది. తప్పక చూడండి. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
థ్రిల్‌కి గురి చేసే మీరా
ప్రముఖ దర్శకులు బాపు వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన కాకర్ల శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘హలో మీరా’. గార్గేయి యాల్లాప్రగడ లీడ్ రోల్ చేశారు. జీవన్ సమర్పణలో డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. కాకర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఒకే ఒక్క పాత్రతో రూపొందిన చిత్రం ‘హలో మీరా’. వైవిధ్యభరితమైన కథలో వచ్చే ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. తెరపై కనిపించేది మీరా (గార్గేయి పాత్ర పేరు) అయినా వినిపించే పాత్రలన్నీ సగటు ప్రేక్షకుడి మదిలో మెదిలేలా ఉంటాయి. ప్రేమ, స్నేహం, స్నేహితుల కోసం దెబ్బలు తినడం, రౌడీయిజమ్, బ్రేకింగ్ న్యూస్ వంటి అన్ని అంశాలు ప్రేక్షకుడి కళ్ల ముందు ఉండేలా జాగ్రత్త పడ్డాం. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది’’ అన్నారు. -
సింగిల్ క్యారెక్టర్.. గంటన్నర వినోదం.. హలో మీరా..!!
ఓకే ఒక్క క్యారెక్టర్లో సినిమా తీయడం సాధ్యమేనా? ఇంతకుముందు ఇలాంటి సినిమాలు తీశారా? ఎలాంటి డైలాగ్స్, ఫైట్స్, కామెడీ సీన్స్ లేకుండా.. అది ఓకే పాత్రతో తెరకెక్కించడం అది పెద్ద సాహసమే. ఒకే ఒక్క క్యారెక్టర్లో సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ వెండితెరపై పండించడం అంత సులువు కాదు. అదే చేసి చూపించారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్. తెరపై కేవలం ఒక అమ్మాయిని మాత్రమే చూపిస్తూ సగటు ప్రేక్షకుడి బుర్రలో బోలెడు రోల్స్ మెదిలేలా ఈ సినిమాను తెరకెక్కించడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. గార్గేయి ఎల్లాప్రగడ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హలో..మీరా. ఈ చిత్రానికి శ్రీనివాస్ కాకర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ చిన్నా సంగీతం అందిస్తున్నాడు. ల్యూమిరే సినిమా బ్యానర్‌పై తెరకెక్కుతున్న హలో..మీరా ఈనెల 21న థియేటర్లలో విడుదల కానుంది. కేవలం ఒకే ఒక్క క్యారెక్టర్‌తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. -
ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేసే చిత్రాలివే!
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని వారు ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే చూసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రతి వారం సినీ ప్రియులను అలరించేందుకు చిత్రాలు రెడీ ఉన్నాయి. అలాగే ఈ వారంలో థియేటర్లలో సందడి చేసే చిత్రాలు కూడా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం. సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం 'విరూపాక్ష'. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించారు.తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, ట్రైలర్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 21న థియేటర్లలో సందడి చేయనుంది సింగిల్ క్యారెక్టర్‌తో 'హలో మీరా' గార్గేయి యల్లాప్రగడ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'హలో మీరా'. ఈ చిత్రం ద్వారా కాకర్ల శ్రీనివాసు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. కేవలం ఓకే ఒక్క క్యారెక్టర్‌తో సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ సినిమా కథ మొత్తం మీరా అనే పాత్ర చూట్టే తిరుగుతుంది. ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ హౌ టు గెట్ రిచ్ (ఇంగ్లీష్) - ఏప్రిల్ 18 చింప్ ఎంపైర్ (డాక్యుమెంటరీ) -ఏప్రిల్ 19 ది మార్క్డ్ హార్ట్ (సీజన్2) - ఏప్రిల్ 19 చోటా భీమ్ (సీజన్-17) - ఏప్రిల్ 20 టూత్‌పరి (హిందీ) - ఏప్రిల్ 20 డిప్లొమ్యాట్ (ఇంగ్లీష్) - ఏప్రిల్ 20 సత్య2 (తెలుగు) -ఏప్రిల్ 21 రెడీ (తెలుగు) -ఏప్రిల్ 21 ఇండియన్ మ్యాచ్ మేకింగ్ (వెబ్‌సిరీస్) - ఏప్రిల్ 21 ఎ టూరిస్ట్స్ గైడ్ టు లవ్ (ఇంగ్లీష్) - ఏప్రిల్ 21 సోనీలివ్ గర్మీ (సిరీస్) హాట్‌స్టార్ సుగా (డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 21 -
సినిమా మొత్తం ఓకే ఒక పాత్ర.. ప్రయోగాత్మకంగా ‘హలో మీరా’
ఒక సినిమా అంటే ఎన్నో రకాలు పాత్రలు ఉంటాయి. అలా ఉంటేనే సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని, రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేయొచ్చని అంతా అనుకుంటారు. కానీ పరిమితమైన పాత్రలతోనూ అద్భుతాలు చేయొచ్చని ఇది వరకు ఎన్నో సార్లు నిరూపితమైంది. అయితే ఇప్పుడు తెలుగులో మరో ప్రయత్నంగా గార్గెయి యల్లాప్రగడ నటిస్తున్న హలో మీరా అనే సినిమా రాబోతోంది. ఒకే ఒక పాత్రతో సినిమాను తెరకెక్కించడం సాహసమనే చెప్పాలి. కాకర్ల శ్రీనివాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో.. డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు మంచి స్పందన లభించింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఇకపై మరింతగా ప్రమోషన్ కార్యక్రమాలు పెంచబోతోన్నట్టుగా నిర్మాతలు తెలిపారు. -
ఆసక్తికరంగా ‘హలో మీరా’ ట్రైలర్
గార్గేయి ఎల్లాప్రగడ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హలో..మీరా. ఈ చిత్రానికి శ్రీనివాస్ కాకరాల కథ, స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ చిన్నా సంగీతం అందిస్తున్నాడు. ల్యూమిరే సినిమా బ్యానర్‌పై తెరకెక్కుతున్న హలో..మీరా ట్రైలర్‌ను డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేస్తూ ఈ సినిమా బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 2 నిమిషాల 26 సెకనుల నిడివితో కట్ చేసిన ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. సినిమాలోని మీరా అనే సింగిల్ క్యారెక్టర్ ని చూపిస్తూ జీవితంలో చేసిన ఓ చిన్న తప్పు ఆమెకు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? కుటుంబం, పెళ్లి, స్నేహితులు, పోలీసులు ఇలా డిఫరెంట్ యాంగిల్స్ లో మీరాకు వచ్చిన చిక్కులేంటి? అనేది ఈ సినిమాలో చూపించనున్నారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మీరా అనే క్యారెక్టర్ తోనే ఈ ట్రైలర్ రూపొందించి సినిమాపై ఆసక్తి మరింత పెంచేశారు మేకర్స్. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు. డా : లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా.. ఎస్ చిన్న సంగీతం అందించారు.