ఎక్స్‌రే నుంచి సీటీ స్కాన్ దాకా..
లబ్బీపేట(విజయవాడతూర్పు): గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్, కడుపునొప్పి ఇలా వ్యాధి ఏదైనా నిర్ధారించేది రేడియాలజిస్టులే. గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యం నుంచి వృద్ధాప్యంలో వచ్చే వ్యాధుల వరకూ నిర్ధారణలో రేడియాలజిస్టుల పాత్ర కీలకం. ఎక్స్‌రే నుంచి డిజిటల్ ఎక్స్‌రేలు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ఆ్రల్టాసౌండ్ స్కాన్ ఇలా అనేక ఇమేజింగ్ పరికరాలు నేడు వైద్య రంగంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. నవంబరు 8న ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం...
రక్తనాళాల్లో పూడికలనూ...
ఒకప్పుడు గుండె రక్తనాళాల్లో పూడికలు గుర్తించాలంటే యాంజియోగ్రామ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆస్పత్రిలో అడ్మిషన్ అవసరం లేకుండానే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ(సీటీ)స్కాన్ అందుబాటులోకి వచ్చింది. సంప్రదాయక సింగిల్ స్కాన్‌తో ప్రారంభమై డ్యూయల్, 4, 6, 8, 16 స్లయిస్ నుంచి నేడు 256, 320 స్లయిస్ సీటీ స్కాన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. సంపూర్ణ దేహానికి వర్తించేలా నాన్ ఇన్వేసిన్ యాంటియోగ్రఫీ 3డీ సీటీ వంటివి వేగం, నాణ్యత, వైవిధ్యం విషయంలో ఎన్నో రకాలుగా వ్యాధి నిర్ధారణకు దోహదపడుతున్నాయి. గుండె, కిడ్నీ, మెదడు, లివర్ వ్యాధులతో పాటు, రక్తనాళాల్లోని లోపాలను గుర్తించే అత్యాధునిక సీటీ స్కాన్లు జిల్లాలో అందుబాటులోకి వచ్చాయి.
జీజీహెచ్‌లో సమగ్ర రేడియాలజీ సేవలు
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో సమగ్ర రేడియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎంఆర్ఐ, రెండు సీటీ స్కానింగ్ యంత్రాలతో పాటు, పది ఆల్ట్రాసౌండ్ యూనిట్లు ఉన్నాయి. అత్యాధునిక డిజిటల్ ఎక్స్‌రే యూనిట్లు ఉన్నాయి. ఇక్కడకు వచ్చే రోగుల వ్యాధి నిర్ధారణకు అవసరమైన స్కానింగ్‌లు చేస్తూ రిపోర్టులు అందిస్తున్నారు. ఒక ప్రొఫెసర్, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇలా 10 మంది రేడియాలజిస్టులు ఇక్కడ పనిచే స్తున్నారు.
కణజాలాల తేడాలను గుర్తించే ఎంఆర్ఐ
శరీరంలోని అంతర్గత తేడాలను గుర్తించడంలో ఎంఆర్ఐ(మాగ్నటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్) ఎంతగానో దోహదపడుతుంది. సూక్ష్మమైన లోపాలను సైతం ఈ స్కానింగ్‌లో గుర్తించగలుగుతున్నారు. వెన్నుపూస, అబ్డామిన్, మెదడు వంటి అనేక లోపాలను గుర్తించడంలో ఎంఆర్ఐ స్కాన్ కీలకంగా మారింది. ఈ స్కానింగ్ పరికరం 0.2 టెస్లాతో ప్రారంభమై ప్రస్తుతం 1.5 టెస్లా అందుబాటులోకి వచ్చింది. దీని స్కానింగ్ ఇమేజీలు వ్యాధి నిర్ధారణలో కీలకంగా ఉన్నాయి.
ఆ్రల్టాసౌండ్తో విప్లవాత్మక మార్పులు
మహిళల్లో పెనుముప్పుగా పరిణమించిన రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలో ఆ్రల్టాసౌండ్ కీలకభూమిక పోషిస్తుంది. సూక్ష్మదశలో గుర్తించే ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కిడ్నీలు, పిత్తాశయంలో రాళ్లు గుర్తించడం, 24 గంటల కడుపునొప్పి, లివర్ పనితీరు ఇలా ఎన్నో రకాల వ్యాధులను సకాలంలో గుర్తించగలుగుతున్నారు. రోగి ప్రమాదం నుంచి బయట పడేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.