పేదల ఆరాధ్యుడు
-
మారుమూల గిరిజన ప్రాంతాల్లో డాక్టర్ చిన్నబిల్లి సేవలు
-
ప్రతి ఆదివారం ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ
రాజవొమ్మంగి :
ఆదివారం వచ్చిందంటే శాంతాక్లాజ్ తాతలా గిరిజన బాలల ఎదుట రకరకాల బహుమతులతో ప్రత్యక్షమవుతారాయన. కలం చేతపట్టి బూర్జువా శక్తులను ఎలా ఎదుర్కోవాలో వ్యాసాలు రాస్తారు. పేదలు కనిపిస్తే.. ఆపద్బాంధవుడిలా దుస్తులు, ఆహారం ఇచ్చి ఆదుకుంటారు. ప్రతి ఆదివారం లోతట్టు ప్రాంతాల్లో గిరిజనులకు సేవ చేస్తుంటారు. తన సంపాదనలో కొంత సొమ్మును పేదల వైద్యం కోసం ఖర్చుచేస్తున్నారు. ప్రతివారం డాక్టర్ చిన్నబిల్లి కోసం గిరిజనులు ఎంతో ఆశగా ఎదురుచూస్తారంటే అతిశయోక్తికాదు. వివరాల్లోకి వెళితే..
రాజవొమ్మంగి మండలం అప్పలరాజుపేట గ్రామంలో ఆదివారం డాక్టర్ చిన్నబిల్లి సత్యనారాయణ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆయనను పలకరించగా, పేదలకు సేవ చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాలను డాక్టర్ చిన్నబిల్లి 1999లో కాకినాడలో ప్రారంభించానన్నారు. తన ఉచిత వైద్య సేవలను కేవలం పట్టణాలకే పరిమితం చేయకుండా, లోతట్టు గ్రామాల వారికి అందించాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. ఇప్పటివరకు (24 జూలై ఆదివారం) 134 ఉచిత వైద్యశిబిరాలను నిర్వహించినట్టు వివరించారు.
మందులతో పాటు ఆరోగ్య సూత్రాలు
వేలాది మందికి మందులతో స్వస్థత చేకూర్చడమే కాకుండా, ఆరోగ్యంగా జీవించేందుకు అనుసరించాల్సిన ఆరోగ్యసూత్రాలను డాక్టర్ చిన్నబిల్లి గిరిజనులకు వివరిస్తున్నారు. కూలీ జనం అంటే, కంజారు చేతపట్టి పాటలు పాడతారు. వైద్యానికన్నా ముందు తన శిబిరానికి వచ్చేవారికి వస్త్రాలు, దుప్పట్లు, దోమతెరలు, మస్కిటో కాయిల్స్, చిన్న పిల్లలకు బూట్లు, బిస్కట్లు, పెన్నులు, పెన్సిళ్లు పంచిపెడుతున్నారు. అత్యవసర వైద్యసేవలు అవసరమైన వారికి సూదిమందు ఇచ్చి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు.
కాకినాడలో వైద్య విద్య
గొల్లప్రోలు గ్రామానికి చెందిన చిన్నబిల్లి సత్యనారాయణ కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ అభ్యసించారు. సీపీఐ(ఎంఎల్) అనుబంధంగా గత 17 ఏళ్లుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జన సాంస్కతిక మండలి రాష్ట్ర అధ్యక్షుని పదవిలో గజ్జెకట్టి, గ్రామాల్లో ఉద్యమస్ఫూర్తిని నింపుతున్నారు. మానవుడు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి మానసిక సై్థర్యాన్ని నింపుతున్నారు.