ఏపీలో 15 నుంచి హెల్త్‌కార్డుల పథకం!
సీఎస్, ఉద్యోగ సంఘాల నేతల భేటీలో నిర్ణయాలు
హైదరాబాద్: ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్‌కార్డుల పథకాన్ని స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేసే దిశగా ముందడుగు పడింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల మధ్య మంగళవారం సచివాలయంలో జరిగిన చర్చలు ముగిశాయి.
ఉచిత అవుట్ పేషెంట్(ఓపీ) ట్రీట్మెంట్ మినహా మిగతా డిమాండ్లకు సీఎస్ సానుకూలంగా స్పందించారు. చికిత్స గరిష్ట వ్యయాన్ని రూ.2 లక్షలకే పరిమితం చేశారు. పరిమితి దాటితే ప్రత్యేక అనుమతితో చికిత్స కొనసాగించడానికి అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీపై ఉద్యోగ సంఘాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి నివేదికను బుధవారం ముఖ్యమంత్రికి సీఎస్ సమర్పించనున్నారు.