hetero Healthcare
-
కొత్త లోగో ఆవిష్కరించిన హెటిరో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ సంస్థ హెటిరో కొత్త లోగో, కార్పొరేట్ బ్రాండ్ గుర్తింపును ఆవిష్కరించింది. ప్రజలే తొలి ప్రాధాన్యతగా ఈ విలక్షణమైన గుర్తింపు హెటిరో వ్యాపార వృద్ధి, వికాసానికి మార్గనిర్దేశంతోపాటు వేగవంతం చేస్తుందని కంపెనీ బుధవారం ప్రకటించింది. ‘భౌగోళిక పరిస్థితులతో సంబంధం లేకుండా అసమానమైన పరిశోధన, తయారీ, మార్కెటింగ్ సామర్థ్యంతో ప్రజలకు సేవ చేయడానికి మేము మంచి స్థానంలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య అవసరాలకు తగ్గట్టుగా కంపెనీ పరిధిని విస్తరించడానికి, సామర్థ్యం పెంపునకు చురుకుదనంతో ప్రతిస్పందించడాన్ని మా కొత్త గుర్తింపు ప్రతిబింబిస్తుంది’ అని హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బి.పార్థ సారథి రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ ఆరోగ్యం అనే ఆలోచన ఆధారంగా నూతన లోగో రూపుదిద్దుకుందని సంస్థ ఎండీ వంశీ కృష్ణ బండి వివరించారు. చదవండి: అలాంటి రూ. 500 నోట్లు చెల్లవా?.. ఇది తెలుసుకోండి -
స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ తయారీ.. హెటిరోకు అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 నివారణలో వాడే స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ తయారీ, విక్రయానికై హైదరాబాద్ కంపెనీ హెటిరో బయోఫార్మాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. భారత్‌లో అత్యవసర వినియోగానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) నుంచి ఈ మేరకు ఆమోదం పొందామని కంపెనీ సోమవారం ప్రకటించింది. దేశీయ మార్కెట్లో నేరుగా వ్యాక్సిన్‌ను విక్రయించడానికి సంస్థకు ఈ ఆమోదం వీలు కలిపిస్తుంది. 18 సంవత్సరాల పైబడిన వారికి కోవిడ్–19 నివారణ కోసం 0.5 మిల్లీలీటర్ల ఒకే మోతాదులో ఈ వ్యాక్సిన్‌ను ఇస్తారు. భారత్‌లో స్థానికంగా తయారైన ఉత్పత్తికి.. తయారీ, మార్కెటింగ్ ఆమోదం పొందిన మొదటి బయోఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో కావడం విశేషం. దేశంలో ప్రస్తుతం ఆమోదం పొందిన అన్ని ఇతర వ్యాక్సిన్లు రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. భారత్‌లో సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్–19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమతి మంజూరు చేసింది. స్పుత్నిక్ లైట్ ఔషధ పరీక్షల్లో కోవిడ్–19ను తట్టుకునే స్థాయిలో అధిక యాంటీబాడీలను చూపిందని హెటిరో క్లినికల్ డెవలప్మెంట్, మెడికల్ అఫైర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ శుభదీప్ సిన్హా ఈ సందర్భంగా తెలిపారు. -
ఏపీ, తెలంగాణ, అసోంలో హెటెరో కొత్త యూనిట్లు
ముంబై: హెటెరో డ్రగ్స్‌లో భాగమైన హెటెరో హెల్త్‌కేర్ తన ఫార్ములేషన్ల వ్యాపార విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం రాష్ట్రాల్లో కొత్తగా మూడు యూనిట్లు ఏర్పాటు చేయనుంది. దేశీయ మార్కెట్‌కు ఫార్ములేషన్ల సరఫరా కోసం ఈ మూడు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఏపీలో ఏర్పాటు చేస్తున్న నూతన యూనిట్లో డిసెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, ఇక్కడ ఇంజెక్టబుల్స్‌ను తయారు చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. అసోంలోని గువాహటి ప్లాంట్ పనులు 75% పూర్తయ్యాయని వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధం అవుతుందని వెల్లడించింది. ఇక్కడ టాబ్లెట్లు, క్యాప్సుల్స్ తయారవుతాయని పేర్కొంది. అయితే, తెలంగాణ యూనిట్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం పడుతుందని హెటెరో హెల్త్‌కేర్ స్పష్టం చేసింది. ఈ మూడు యూనిట్ల ద్వారా కంపెనీ ఆదాయం 20 నుంచి 25%పెరుగుతుందని పేర్కొం ది. ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా హెపటైటిస్, ఆంకాలజీ, హెచ్ఐవీ విభాగాల్లో నూతన మాలిక్యూల్స్‌పై దృష్టి పెట్టినట్టు కంపెనీ తెలిపింది. ఫార్ములేషన్లను తయారు చేసే దేశ, విదేశీ ఫార్మా కంపెనీలకు అతిపెద్ద ముడి పదార్థాల (ఏపీఐ) సరఫరాదారు హెటెరో. దేశంతోపాటు విదేశాల్లో కలిపి కంపెనీకి 25 తయారీ కేంద్రాలున్నాయి. తాను తయారు చేస్తున్న ఏపీఐ, ఫార్ములేషన్లలో 60 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తోంది. హెచ్ఐవీ ఔషధాల్లో 30 శాతం వాటాతో ప్రపంచ లీడర్‌గా ఉంది.