హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 నివారణలో వాడే స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ తయారీ, విక్రయానికై హైదరాబాద్ కంపెనీ హెటిరో బయోఫార్మాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. భారత్‌లో అత్యవసర వినియోగానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) నుంచి ఈ మేరకు ఆమోదం పొందామని కంపెనీ సోమవారం ప్రకటించింది. దేశీయ మార్కెట్లో నేరుగా వ్యాక్సిన్‌ను విక్రయించడానికి సంస్థకు ఈ ఆమోదం వీలు కలిపిస్తుంది. 18 సంవత్సరాల పైబడిన వారికి కోవిడ్–19 నివారణ కోసం 0.5 మిల్లీలీటర్ల ఒకే మోతాదులో ఈ వ్యాక్సిన్‌ను ఇస్తారు.
భారత్‌లో స్థానికంగా తయారైన ఉత్పత్తికి.. తయారీ, మార్కెటింగ్ ఆమోదం పొందిన మొదటి బయోఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో కావడం విశేషం. దేశంలో ప్రస్తుతం ఆమోదం పొందిన అన్ని ఇతర వ్యాక్సిన్లు రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. భారత్‌లో సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్–19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమతి మంజూరు చేసింది. స్పుత్నిక్ లైట్ ఔషధ పరీక్షల్లో కోవిడ్–19ను తట్టుకునే స్థాయిలో అధిక యాంటీబాడీలను చూపిందని హెటిరో క్లినికల్ డెవలప్‌మెంట్, మెడికల్ అఫైర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ శుభదీప్ సిన్హా ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment