Hexaware Tech
-
హెక్సావేర్ డీలిస్టింగ్- ఎస్బీఐ అప్
ఆరు రోజుల ర్యాలీకి ముందురోజు బ్రేక్ పడినప్పటికీ తిరిగి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 279 పాయింట్లు ఎగసి 34,259కు చేరగా.. నిఫ్టీ 107 పాయింట్లు జంప్‌చేసి 10,136 వద్ద ట్రేడవుతోంది. కాగా.. విభిన్న సానుకూల వార్తల నేపథ్యంలో ఓవైపు ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్, మరోపక్క ప్రభుత్వం రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హెక్సావేర్ టెక్నాలజీస్ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి కంపెనీను డీలిస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు వెలువడిన వార్తలు సాఫ్ట్వేర్ సేవల సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్‌కు జోష్‌నిచ్చాయి. దీంతో ఈ కౌంటర్లో అమ్మకందారులు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం రూ. 52 పెరిగి రూ. 311.4 వద్ద ఫ్రీజయ్యింది. హెక్సావేర్‌లో మాతృ సంస్థ హెచ్‌టీ గ్లోబల్ ఐటీ సొల్యూషన్స్ 62.4 శాతం వాటాను కలిగి ఉంది. తద్వారా 18.63 కోట్ల షేర్లను కలిగి ఉంది. మిగిలిన 37.6 శాతం వాటాకు సమానమైన 11.2 కోట్ల షేర్లను పబ్లిక్ నుంచి కొనుగోలు చేసేందుకు ప్రమోటర్లు సన్నాహాలు చేస్తున్నట్లు హెక్సావేర్ తాజాగా బీఎస్ఈకి వెల్లడించింది. గత 15 రోజుల్లో ఈ షేరు 32 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. ఎస్బీఐ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ కౌంటర్ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 181 వద్ద ట్రేడవుతోంది. అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా వాటాను విక్రయించిన కారణంగా గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఎస్బీఐ ఆకర్షణీయ పనితీరు చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటికితోడు కొన్ని ఖాతాల నుంచి రికవరీ, తగ్గనున్న పన్ను వ్యయాలు వంటివి మెరుగైన ఫలితాలకు సహకరించవచ్చని భావిస్తున్నారు. క్యూ4లో నికర లాభం రూ. 600-1000 కోట్లుగా నమోదుకావచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత 15 రోజుల్లో ఎస్బీఐ షేరు 17 శాతం పుంజుకోవడం గమనార్హం! -
హెక్సావేర్ లాభం 26 శాతం అప్
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ నికర లాభం ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో 26 శాతం పెరిగింది. గత ఏడాది క్యూ1లో రూ.138 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.175 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను సస్పెండ్ చేసింది. కరోనా వైరస్ కల్లోలంతో అనిశ్చితి నెలకొనడమే దీనికి కారణమని వెల్లడించింది. గత ఏడాది మార్చి క్వార్టర్లో రూ.1,264 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది ఇదే క్వార్టర్లో 22 శాతం ఎగసి రూ.1,542 కోట్లకు పెరిగిందని పేర్కొంది. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 18 శాతం వృద్ధితో 2.3 కోట్ల డాలర్లకు, ఆదాయం 17 శాతం వృద్ధితో 21 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపింది. 26 శాతం పెరిగిన ఈపీఎస్... ఈ క్యూ1లో ఒక్కో షేర్ రాబడి(ఈపీఎస్) 26 శాతం వృద్ధితో రూ.5.86కు పెరిగిందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వికాస్ కుమార్ జైన్ వెల్లడించారు. నిర్వహణ సామర్థ్యాలపై దృష్టి పెట్టటంతో ఒక్కో షేర్ రాబడి ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించకముందే వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రారంభించామని తెలిపారు. ఐటీ విభాగంలో 99 శాతం మంది, బీపీఎస్ విభాగంలో 80 శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారని వివరించారు. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 19,998గా ఉందని, ఆట్రీషన్ రేటు 15.1 శాతమని పేర్కొన్నారు. నికర లాభం 26 శాతం పెరగడంతో హెక్సావేర్ టెక్నాలజీస్ షేర్ లాభపడింది. బీఎస్ఈలో ఈ షేర్ 3 శాతం లాభంతో రూ.296 వద్ద ముగిసింది. -
హెక్సావేర్ టెక్నాలజీస్ లాభం రూ.138 కోట్లు
న్యూఢిల్లీ: మిడ్– సైజ్ ఐటీ సేవల కంపెనీ హెక్స్‌వేర్‌టెక్నాలజీస్ ఈ ఏడాది జనవరి– మార్చి క్వార్టర్లో రూ.138 కోట్ల నికర లాభం సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.134 కోట్ల నికర లాభం వచ్చిందని, 3 శాతం వృద్ధి సాధించామని హెక్సావేర్ టెక్నాలజీస్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,049 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.1,264 కోట్లకు పెరిగిందని కంపెనీ చైర్మన్ అతుల్ నిశార్ చెప్పారు. మరోసారి రెండంకెల వృద్ధిని సాధించామని, పరిశ్రమకే తలమానికమైన వృద్ధిని సాధించాలన్న తమ తపనకు ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సీజనల్‌గా బలహీనంగా ఉన్నప్పటికీ, మంచి వృద్ధిని సాధించామని కంపెనీ సీఈఓ, ఈడీ ఆర్. కృష్ణ తెలిపారు. ఈ క్వార్టర్‌కు గాను ఒక్కో షేర్‌కు రూ.2.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. డాలర్ల పరంగా చూస్తే, ఈ మార్చి క్వార్టర్లో నికర లాభం 5 శాతం క్షీణించి 1.97 కోట్ల డాలర్లకు, ఆదాయం 11 శాతం వృద్ధి చెంది 18 కోట్ల డాలర్లకు చేరిందని నిశార్ తెలిపారు. గత ఆరు నెలల్లో 304 మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 16,509గా ఉందని తెలిపారు. ఉద్యోగుల వలస(ఆట్రీషన్ రేటు) 18.2 శాతంగా ఉందని కృష్ణ వివరించారు. ఈ ఏడాది మార్చి క్వార్టర్ నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.870 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెక్సావేర్ టెక్నాలజీస్ షేర్ 4 శాతం నష్టంతో రూ.333 వద్ద ముగిసింది. -
హెక్సావేర్‌కు బ్లాక్‌డీల్ దెబ్బ
సాక్షి, ముంబై: టెక్ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ శుక్రవారం భారీగా నష్టపోయింది. బ్లాక్‌డీల్స్ ద్వారా భారీ సంఖ్యలో షేర్లు చేతులు మారినట్లు వెల్లడికావడంతో హెక్సావేర్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలతో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) లో 19 శాతం వరకు పతనమైంది. రూ.401 వద్ద ఆల్‌టైం కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం కాస్త కోలుకుని దాదాపు 13 శాతం నష్టంతో రూ. 433 వద్ద ట్రేడవుతోంది. అయితే పలు బ్లాక్‌డీల్స్ ద్వారా మొత్తం ఈక్వీటీలో13.5 శాతం 40.06 మిలియన్ల షేర్లు చేతులు మారినట్టు ఎక్స్చేంజ్ గణాంకాలు ద్వారా తెలుస్తోంది. కంపెనీ ప్రమోటర్ బేరింగ్ ప్రయివేట్ ఈక్విటీ ఆసియా సంస్థ బ్లాక్‌డీల్స్ ద్వారా 8.4శాతం వాటాను విక్రయించినట్లు తెలుస్తోంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సిటీ ఈ లావాదేవీలను నిర్వహించినట్లు తెలియజేశాయి. రూ. 447.5 ఫ్లోర్ ప్రైస్ ప్రకారం బేరింగ్ పీఈకి వాటా విక్రయం ద్వారా సుమారు రూ.1100 కోట్లు లభించనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. ఈ వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించి ఉండవచ్చని అంచనా. కాగా జూన్ 30, 2018 నాటికి, హెక్సావేర్ టెక్నాలజీస్‌లో పీరింగ్ ఆసియా గ్లోబల్ ఐటి సొల్యూషన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ద్వారా 71.22శాతం వాటాను కలిగి ఉంది. హెక్సావేర్ టెక్నాలజీస్ మార్కెట్ గత ఏడాదితో పోల్చుకుంటే 81 శాతం పెరిగింది.