మాధురికి 'మ్యాగీ' చిక్కులు
తప్పుచేసివారితోపాటు అందుకు పలువిధాలుగా సహకరించినవారు కూడా నిందార్హులేనన్న న్యాయసూత్రం బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ విషయంలో మరోసారి రుజువైంది. ప్రకటనల్లో నటించేటప్పుడు పారితోషికమే కాదు సదరు ఉత్పత్తి ఎలాంటిది? జనానికి మంచి చేసేదా.. చెడు చేసేదా అనే విషయాలపై నటీనటులు ఇకనైనా దృష్టిసారించాల్సిన అవసరాన్ని గుర్తుచేసేలా హరిద్వార్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయం సంచలనం రేపింది. ఇంతకీ మాధురీ దీక్షిత్ ఏం చేసింది?
ప్రస్తుతం టీవీల్లో ప్రసారమవుతోన్న 'రెండు నిమిషాల్లో నూడుల్స్' ప్రకటనలో మాధురీ దీక్షిత్.. 'అలసిపోయిన పిల్లలు మ్యాగీ నూడుల్స్ తింటే ఇట్టే శక్తి వస్తుంది. నేను తినిపిస్తున్నాను. మీరూ తినిపించండి' అని అంటుంది. ఈ ప్రకటనలో ఆమె చెప్పినట్లుగా నూడుల్స్లో న్యూట్రిషన్ విలువలన్నాయన్న మాటలను ఏవిధంగా నిరూపిస్తారో చెప్పాల్సిందిగా హరిద్వార్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం మాధురీ దీక్షిత్ కు నోటీసులు జారీచేసింది.
15 రోజుల్లోగా సంతృప్తికరమైన సమాధానం చెప్పకుంటే కేసు నమోదు చేస్తామని ఫుడ్ సెక్యూరిటీ అధికారి మహిమానంద్ జోషి తెలిపారు. మ్యాగీ నూడుల్స్లో పరిమితికి మించి సీసీం (లెడ్), మోనో సోడియం గ్లూటమేన్ ఉన్నట్లు ఇటీవలే వెలుగులోకి రావడంతో ఒక బ్యాచ్ ఉత్పత్తుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు మ్యాగీ నూడుల్స్ తయారీదారు నెస్లే సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.