hi alert
-
రిపబ్లిక్ డే టార్గెట్‌గా భారీ కుట్ర.. దేశ రాజధానిలో బాంబు కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఢిల్లీలో గుర్తుతెలియని దుండగులు బాంబును అమర్చారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలంగా మారింది. స్థానిక ఘాజీపూర్ ఫ్లవర్ మండీలో ఒక బ్యాగ్ ఉండటాన్ని స్థానికులు గమనించారు. చాలాసేపటి నుంచి బ్యాగ్ మార్కెట్లోనే ఉండటంతో అనుమానంతో.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, నేషనల్‌సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక పరికంతో బ్యాగ్ స్కాన్ చేసి పరిశీలించారు. ఆ బ్యాగ్‌లో పేలుడు పదార్థం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే స్థానికులను అప్రమత్తం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. భారీగా భద్రత దళాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. బ్యాగ్‌లో 3 కిలోల ఐఈడీ పేలుడు పరికరం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత.. ఒక రోబో సహయంతో ఆ బ్యాగ్‌ను మైదాన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ భూమిలో ఎనిమిదడుగుల లోతులో ఆ పరికరంను ఉంచి బాంబ్‌ను నిర్వీర్యం చేశారు. నేషనల్ సెక్యురీటి గార్డు అధికారులు సమయానికి స్పందించడంతో పెద్ద ముప్పుతప్పింది. ఇంకా ఎక్కడైన బాంబులు ఉన్నాయా.. అన్న కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్లవర్ మండీ మార్కెట్ భోగి పండుగ నేపథ్యంలో ప్రజలతో రద్దీగా ఉంటుంది. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సంవత్సరం పాటు చేపట్టిన దీక్షా స్థలం కూడా ఘాజీపూర్ మండీకి సమీపంలోనే ఉంది. గణతంత్ర దినోత్సవానికి కొద్దిరోజుల ముందే బాంబు ఘటన వెలుగుచూడటంతో నేషనల్ సెక్యూరిటీ గార్డు సిబ్బంది, స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం డీసీపీ ప్రమోద్ కుష్వాహ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని సీసీఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హై అలెర్ట్ కొనసాగుతుంది. చదవండి: యూపీ రాజకీయాల్లో కీలక మార్పులు.. ఎస్పీలో చేరిన ఇద్దరు బీజేపీ మంత్రులు -
పార్లమెంట్.. హై అలర్ట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణం మంగళవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర దాడుల నిరోధక వ్యవస్థ అలర్ట్ అయింది. ఒక ఎంపీ కారు పార్లమెంట్ ప్రాంగణంలోని సెక్యూరిటీ బ్యారియర్‌ను ప్రమాదవశాత్తూ గుద్దుకోవడంతో ఇంత హంగామా చోటు చేసుకుంది. ఉదయం 9 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి స్థానం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్‌కు చెందిన ఇన్నోవా కారు అనుకోకుండా సెక్యూరిటీ బ్యారియర్‌ను ఢీ కొంది. దీంతో సీఆర్పీఎఫ్ దళాలు ఎంపీల ప్రవేశ ద్వారాన్ని స్వాధీనంలోకి తీసుకున్నాయి. ‘కారు.. బూమ్ బ్యారియర్‌ను ఢీకొంది. దాంతో, ఆకస్మిక దాడులను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన భద్రత వ్యవస్థ అప్రమత్తమైంది’ అని సెక్యూరిటీ అధికారి ఒకరు వివరించారు. కాగా, ఘటన జరిగినప్పుడు ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ కారులో ఉన్నారా, లేదా అనేది స్పష్టం కాలేదు. (చదవండి: రెండో రోజూ.. ‘షేమ్’ సీన్) -
దేశంలోకి ఉగ్రవాదులు? హై అలర్ట్ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో బాంబు దాడులే లక్ష్యంగా ఐదుగురు ఉగ్రవాదులు గోరఖ్‌పూర్ సమీపంలోని ఇండో నేపాల్ సరిహద్దు గుండా దేశంలోకి చొరబడే ప్రయత్నాల్లో ఉన్నారంటూ నిఘావర్గాలు గురువారం హెచ్చరించాయి. దీపావళి పండుగ రోజు భారీ దాడులు చేయాలనే ప్రణాళికతో వారు ఉన్నారని వెల్లడించాయి. భారత్‌లో ప్రవేశించిన తర్వాత ఉగ్రవాదులకు కశ్మీర్‌లోని కొందరు వ్యక్తులు అవసరమైన సహాయమందిస్తారని వారి ఫోన్ సంభాషణలను బట్టి తెలుస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదుల ఫోన్లను ట్యాప్ చేసిన నిఘా విభాగం, లొకేషన్ ఆధారంగా చివరిసారిగా నేపాల్ సరిహద్దుల్లో వారిని గుర్తించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దేశంలో హై అలర్ట్ ప్రకటించింది. మరోవైపు పంజాబ్‌లోని రక్షణ స్థావరాలపై దాడి జరిగే అవకాశముందని బుధవారం నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. వాయుసేన పంజాబ్‌లోని పఠాన్‌కోట్ స్థావరంతో పాటు ఇతర ఎయిర్‌బేస్‌లలో ఆరెంజ్ నోటీసును జారీ చేసింది. మరోవైపు జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పటి వరకు దాదాపు 60 మంది ఉగ్రవాదులు ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దుల గుండా దేశంలో ప్రవేశించారని నిఘా విభాగం తెలిపింది. బంగ్లా సైనికుల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ మృతి మత్స్యకారులను విడిపించేందుకు చర్చలకు వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్లపై గురువారం బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ కాల్పులు జరపడంతో ఒక హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు. మరో కానిస్టేబుల్ గాయాల పాలయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్శీదాబాద్ జిల్లాలో గురువారం చోటుచేసుకొంది. బంగ్లా సరిహద్దుల్లో ఉన్న పద్మ నదిలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులను బంగ్లా బలగాలు తమ అదుపులోకి తీసుకొని అనంతరం ఇద్దరిని విడిచిపెట్టాయి. మిగిలిన ఒకరిని విడిపించడానికి బీఎస్ఎఫ్ అధికారులు బంగ్లా సైనికాధికారులతో చర్చలకు వెళ్లారు. ఈ సందర్భంగా బంగ్లా సైనికులు భారత జవాన్లతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో వెనుదిరిగిన బీఎస్ఎఫ్ జవాన్లపై వెనుక నుంచి బంగ్లా సైనికులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ విజయ్ భాన్ సింగ్ తలలో బుల్లెట్ దూసుకుపోగా, మరో బుల్లెట్ కానిస్టేబుల్ కుడి చేయి నుంచి వెళ్లింది. వీరిద్దరినీ సహచర జవాన్లు హాస్పిటల్‌కు తరలించగా, హెడ్ కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మరణించాడు. కాగా, ఈ ఘటన పరిణామాలపై చర్చించేందుకు బంగ్లా సైనిక ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. -
విశాఖ మన్యంలో హైఅలర్ట్
సాక్షి, విశాఖపట్నం : మావోయిస్టు సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో ఎలాంటి దాడులు జరగకుండా విశాఖ మన్యంలో ముందస్తు హైఅలర్ట్ విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గుర్రాలపై పెట్రోలింగ్ నిర్వహిస్తూ ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మావోలకు వ్యతిరేకంగా సంతల్లో శాంతి స్థూపాలు నెలకొల్పినట్లు తెలిపారు. -
పంజాబ్ గురుదాస్‌పూర్‌లో హై అలర్ట్
-
హై అలర్ట్
మందుపాతర్లతో అప్రమత్తమైన పోలీసులు ముల్లకట్ట బ్రిడ్జి వద్ద నాఖాబందీ అంతర్రాష్ట్ర వాహనాలు తనిఖీ ఫెర్రీ పాయింట్లు, అడవుల్లో బలగాల మోహరింపు ఏటూరునాగారం :ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకన్నగూడెం–రామచంద్రాపురం గ్రామాల మధ్య మావోయిస్టులు మందుపాతరలు అమర్చడంతో సరిహద్దులోని ఏటూరునాగారం ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ముల్లకట్ట బ్రిడ్జి వద్ద సీఐ రఘుచందర్, ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో స్పెషల్‌పార్టీ, సీఆర్పీఎఫ్ బలగాలతో ఆదివారం నాఖాబందీ నిర్వహించారు. 163 జాతీయ రహదారిపై అంతర్రాష్ట్ర వాహనాల తనిఖీ చేపట్టారు. లాడ్జీలు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారం అడవుల్లోకి మావోయిస్టులు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శనివరాం అర్ధరాత్రి వెంకటాపురం మండలంలో మావోయిస్టులు రోడ్డుపై ప్లాస్టిక్ బకెట్లలో మందుపాతరలు అమర్చి లేఖలను వదిలేశారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు ఆమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని లేఖలో పేర్కొన్నారు. రోడ్డుకు అడ్డంగా తాడు కట్టి వాటికి కరపత్రాలను అంటించారు. దీంతో అటు ఖమ్మం, ఇటు వరంగల్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఫెర్రీ పాయింట్ల వద్ద మోహరింపు ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాలు, గతంలో పడవలు, నావలపై రాకపోకలు సాగించిన ఫెర్రీ పాయింట్ల వద్ద పోలీసులు నిఘా వేశారు. గోదావరి దాటేందుకు వచ్చే ప్రజల వివరాలను సేకరిస్తున్నారు. అంతేకాక రెండు గ్రేహౌండ్స్ దళాలు ఏజెన్సీలోని అడవులను జల్లెడ పడుతున్నాయి. మూడు ఠాణాలకు భద్రత పెంపు ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట పోలీస్స్టేషన్లకు భద్రతను రెట్టింపు చేశారు. స్టేషన్‌కు వచ్చి పోయే ప్రజలు, ఇతరులపై సీసీ కెమెరాల పుటేజీలతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మాజీ మావోయిస్టులను విచారిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు, గ్రామాల్లో నూతన వ్యక్తులు సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. పట్టణాలకు పరుగులు తీస్తున్న టార్గెట్లు.. మావోయిస్టులు ఏజెన్సీలోని కొందరిని టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఈ వారోత్సవాలలోనే వారిపై చర్య తీసుకుంటామని బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. పత్రికా ప్రకటనల ద్వారా టార్గెట్ల పేర్లు వెలువరిస్తున్నారు. దీంతో వారు అప్రమత్తమై మారుమూల ప్రాంతాల నుంచి పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. -
అనంతలో హై అలర్ట్
అనంతపురం: హైదరాబాద్‌లో విధ్వంసానికి కుట్ర పన్నిన ఉగ్రవాదులు రెండు నెలల క్రితం అనంతపురంలో ఐదు రోజుల పాటు మకాం వేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో తేలడంతో జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. శనివారం మూడో పట్టణ పోలీసులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని లాడ్జీలన్నీ జల్లెడ పట్టారు. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్(ఏయూటీ) ఉగ్రవాదులు హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించేందుకు అవసరమైన ఆయుధాలు, పేలుడు సామగ్రి కోసం రెండు నెలల క్రితం జిల్లాకు వచ్చినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. కర్ణాటక నుంచి సామగ్రిని తెచ్చుకోవడానికి ఐదు రోజుల పాటు అనంతపురంలోని ఓ లాడ్జీలో మకాం వేశారు. ఐదు రోజుల తర్వాత వారిని వెనక్కు పంపాలని ఏయూటీ చీఫ్ షఫీ ఆర్మర్ ఆదేశించడంతో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లినట్లు ఎన్ఐఏకు పట్టుబడిన ఉగ్రవాదులు విచారణలో వెల్లడించారు. దీంతో జిల్లా పోలీసులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. ఐదు రోజులు ఉగ్రవాదులు లాడ్జీలో తిష్టవేసినా సమాచారం లేకపోవడం నిఘా వర్గాల వైఫల్యంగా భావిస్తున్నారు. -
ఖమ్మం సరిహద్దుల్లో హైఅలర్ట్
రేపటి నుంచి అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు భారీగా చేరుకుంటున్న ప్రత్యేక బలగాలు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ చర్ల (ఖమ్మం జిల్లా): ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలంటూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఖమ్మం జిల్లా ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాలను తరలిస్తున్నారు. మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో సరిహద్దులోని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ప్రధానంగా వెంకటాపురం సర్కిల్ పరిధిలోని చర్ల, దుమ్మగూడెం, వెంకటాపురం, వాజేడు, పేరూరు పోలీస్స్టేషన్లలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతానికి వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులు, మిలిటెంట్లు, మాజీ మిలిటెంట్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని మావోల కదలికలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ప్రత్యేక పోలీసు బలగాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బలగాలను కలుపుకొని జాయింట్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో అధికార పార్టీనేతలతో పాటు, ప్రధాన పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను పోలీసులు అప్రమత్తం చేశారు. మావోయిస్టు టార్గెట్లుగా ఉన్న వారిని తక్షణమే స్వగ్రామాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు మకాం మార్చాలంటూ సూచనలు చేశారు. -
షాబాద్, శంషాబాద్, షాద్ నగర్లలో హై అలర్ట్
వరుస ఉద్రిక్త పరిస్థితులతో తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ఏక్షణం ఏం జరుగుతుందా అని సామాన్య జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడోగానీ తమకు వినిపించని పోలీసుల బూట్ల చప్పుళ్లు ఇప్పుడు ప్రతిక్షణం.. ప్రతిచోట వినిపిస్తున్నాయి. అదే సమయంలో దొంగలు, దోపిడీ దారులు, ఉగ్రవాదులు మొత్తానికి రాష్ట్రేతరులు క్రూరపు ఆలోచనలతో అలజడులు సృష్టిస్తుండగా ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. మంగళవారం ఉదయం వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్ అనంతరం తెలంగాణలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో ముమ్మర గాలింపులు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. తుపాకులతో కొంతమంది వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారంతో షాబాద్, శంషాబాద్, షాద్ నగర్లలో హై అలర్ట్ ప్రకటించారు. వరంగల్‌లో ఎన్‌కౌంటర్‌కు ముందు గుర్తు తెలియని దుండగులు తమపై దాడులు చేయడంతో అది ముందస్తూ వ్యూహంతోనే జరిగిందా? తాము వెళుతున్న మార్గంలోనే ఉగ్రవాదులు అనుసరిస్తున్నారా అనే అనుమానం కూడా పోలీసులకు కలుగుతోంది. మొత్తానికి సూర్యపేట ఘటన కావచ్చు.. చిత్తూరు ఘటన కావచ్చు.. పోలీసుల మాత్రం ప్రస్తుతం డేగ కళ్లతో పనిచేస్తున్నారని చెప్పవచ్చు. -
రాజధానిలో హైఅలర్ట్
గ్రేటర్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందనే సమాచారం అందరినీ కలవర పెడుతోంది. నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో అణువణువూ జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతులు చోటు చేసుకోవచ్చనే అనుమానంతో ప్రతి అంగుళమూ తనిఖీ చేస్తున్నారు. ⇒ఉగ్రవాద దాడుల సంకేతాలు ⇒పోలీసు యంత్రాంగం అప్రమత్తం ⇒రంగంలోకి బాంబు స్క్వాడ్ ⇒లాడ్జీలు, బస్టాండ్లను జల్లెడ పడుతున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: బెంగుళూరులో బాంబు పేలుడు... కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల టార్గెట్‌లో గ్రేటర్ సిటీ ఉండడంతో నగరంలో పోలీసులు అణువణువునా జల్లెడ పడుతున్నారు. వాహన తనిఖీలు, కార్డన్‌సెర్చ్‌లు, లాడ్జీలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. దేవాలయాలు, పార్కింగ్ స్థలాల వద్ద 30 బాంబు స్క్వాడ్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. జంట కమిషనరేట్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల మొదలు డీసీపీల వరకు నాలుగు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ సిబ్బందిని ఆదేశించారు. అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేశారు. గతంలో జైలు నుంచి విడుదలై న అనుమానిత ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టారు. వెస్ట్‌జోన్ పరిధిలో డీసీపీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో కార్డన్‌సెర్చ్ చేపట్టారు. హైఅలర్ట్ నేపథ్యంలో స్టార్ హోటళ్లు, రిసార్టులు, ఫాంహౌస్‌లలో కొత్త సంవత్సర వేడుకల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. నిర్వాహకులు విధిగా పార్టీ వేడుకలు జరిగే ప్రదేశాల్లో మెటల్ డిటెక్టర్లు అమర్చుకోవాలని పోలీసులు సూచించారు. పోలీసు అనుమతులు తీసుకోవడంతో పాటు రాత్రి ఒంటిగంట వరకే కార్యక్రమాలను పరిమితం చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. మందుబాబులు అదుపు తప్పితే చర్యలు తప్పవని స్పష్టంచేశారు. టెన్షన్..టెన్షన్ ఆస్ట్రేలియాలో సిడ్నీ కేఫ్‌పై ఉగ్రవాదుల దాడి.. పాకిస్తాన్ పెషావర్‌లోని ఆర్మీ పాఠశాలలో తాలిబన్ ఉగ్రవాదులు సాగించిన నరమేథం.. భారత్‌పై దాడులు చేస్తామని లష్కర్-ఎ-తోయిబా నేత మసూద్ ప్రకటన.. జనవరి 26 గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ వస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదుల ముప్పు ఉందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించిన విషయం తెలిసిందే. వీటిని కూడా పరిగణనలోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలోని లాడ్జీలు, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. కొత్త వ్యక్తులు వస్తే... నిఘా పెట్టాల్సిందిగా అన్ని ఠాణాల ఎస్హెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వివిధ ప్రదేశాలలో భిక్షాటన చేస్తూ ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారి వేలి ముద్రలను సైతం సేకరిస్తున్నారు. ఈ రూపంలో కూడా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ దిశగా పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి -కమిషనర్ మహేందర్‌రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు బాంబు పేలుళ్ల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. అన్ని ప్రాంతాలపై నిఘా పెంచాం. అనుమానిత వ్యక్తులు, వస్తువులు, వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఉగ్రవాద కార్యకలాపాలలో హైదరాబాద్ వాసులు ఎక్కడా పాల్గొనలేదు. బయటి వ్యక్తులే వచ్చి ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించారు. ప్రతిసారి హైదరాబాద్ ప్రజలను ఉగ్రవాదుల పేరుతో అవమానించడం సరికాదు. అయినా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సున్నితమైన నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొంటామనే నమ్మకం ఉంది. దీనిలో భాగంగానే ప్రజలను సైతం భాగస్వాములను చేస్తున్నాం.