
పార్లమెంట్ వద్ద అప్రమత్తమైన సెక్యురిటీ సిబ్బంది
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణం మంగళవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర దాడుల నిరోధక వ్యవస్థ అలర్ట్ అయింది. ఒక ఎంపీ కారు పార్లమెంట్ ప్రాంగణంలోని సెక్యూరిటీ బ్యారియర్‌ను ప్రమాదవశాత్తూ గుద్దుకోవడంతో ఇంత హంగామా చోటు చేసుకుంది. ఉదయం 9 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి స్థానం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్‌కు చెందిన ఇన్నోవా కారు అనుకోకుండా సెక్యూరిటీ బ్యారియర్‌ను ఢీ కొంది. దీంతో సీఆర్‌పీఎఫ్ దళాలు ఎంపీల ప్రవేశ ద్వారాన్ని స్వాధీనంలోకి తీసుకున్నాయి. ‘కారు.. బూమ్ బ్యారియర్‌ను ఢీకొంది. దాంతో, ఆకస్మిక దాడులను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన భద్రత వ్యవస్థ అప్రమత్తమైంది’ అని సెక్యూరిటీ అధికారి ఒకరు వివరించారు. కాగా, ఘటన జరిగినప్పుడు ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ కారులో ఉన్నారా, లేదా అనేది స్పష్టం కాలేదు. (చదవండి: రెండో రోజూ.. ‘షేమ్’ సీన్)
Comments
Please login to add a commentAdd a comment