ప్రేమంటే ఇలాగే ఉంటుందేమో!
బర్మింగ్ హామ్: ప్రేమించడం అందరూ చేస్తారు. కానీ ఆ ప్రేమను కొందరే నిలుపుకుంటారు. ప్రేమించిన వ్యక్తి ఎప్పుడూ పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. వారి ఆలోచనలు అలా మనసులో ఉండిపోతే చాలు.. జీవితాంతం మరే దిగులు లేకుండా బతికేయోచ్చనుకునేవారు కొందరైతే.. తనతో పెళ్లవకపోయినా.. ప్రేమించిన వ్యక్తి ప్రాణాలతో ఎదురుగా ఉంటే అప్పుడప్పుడు చూసైనా సంతోషంగా జీవితాన్ని ముందుకు పోనిద్దాం అని ఆలోచించేవారు మరికొందరు. ఇంకొందరు ప్రారంభంలో ఎంత దూరంగా ఉన్నా.. ఆ వ్యక్తి శాశ్వతంగా దూరమవుతున్నాడని తెలిసినప్పుడు క్షణం కూడా విడిచిపెట్టకుండా తోడుగా ఉండేవారు.
నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని ఒట్టేసి చెప్పుకునే ప్రేమికులు చాలావరకూ.. పెళ్లి కాకుండానే విడిపోతున్న ఈ రోజుల్లో మరో మూడు రోజుల్లో తనను ప్రేమించిన వ్యక్తి కనుమూస్తాడని తెలిసి ఆ కొద్ది కాలంపాటు జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధమైంది హైస్కూల్లో చదివే పదహారేళ్ల అమీ క్రాస్ వెల్. నిచ్చెలి చేయందుకున్న మూడు రోజుల్లోనే అతడు చనిపోయాడు. ఆ జ్ఞాపకాలతో తిరిగి అమీ జీవితాన్ని ప్రారంభించింది.
బర్మింగ్ హామ్ కు చెందిన అమీ క్రాస్ వెల్, ఒమర్ అల్ షేక్ అనే ఇద్దరు ఓ హైస్కూల్లో చదువుతున్నారు. వీరిద్దరికి కూడా పదహారేళ్లు. స్కూల్లో చేరిన కొద్ది రోజులకే అమీపై ఒమర్ మనసు పారేసుకున్నాడు. ఎంతో కష్టంతో ఆ విషయాన్ని తెలియజేశాడు. చివరికి అమీ ఒప్పుకోవడంతో అతడి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ, ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. తన ప్రేమ విషయాన్ని చెప్పిన కొద్ది రోజులకే భయంకరమైన క్యాన్సర్ ల్యుకేమియా తనకు ఉందని, ఎక్కువ రోజులు బతకడని ఒమర్‌కు తెలిసింది. దీంతో అప్పటి నుంచి ఆ ప్రేమికులిద్దరూ తీవ్ర బాధలోకి కూరుకుపోయారు.
ఒమర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అమీ ఒక్కతే స్కూల్‌కు వెళ్లొస్తుండేది. మరో మూడు రోజులు మాత్రమే ఒమర్ బతుకుతాడని తెలిసి.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒమర్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ఆ నిర్ణయాన్ని ఇరువురి కుటుంబసభ్యులకు తెలిపింది. ముందు ఒప్పుకోకపోయినా తర్వాత అమీ తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో గత సోమవారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో వీల్ చైర్‌పై ఉన్న ఒమర్.. అమీ చేతికి రింగ్ తొడిగాడు. ఆ వెంటనే తన భర్తగా మారిన ప్రేమికుడిని ఆస్పత్రి అధికారుల అనుమతితో కారిడార్‌లో ప్రేమగా కొన్ని మాటలు చెప్పుకుంటూ అటూఇటూ తిప్పింది.
ఆ మూడు రోజులు.. క్షణం కూడా విడిచిపెట్టకుండా తన చేతిలో చేయ్యేసి ఆస్పత్రిలోనే ఉండిపోయింది. అమీ కళ్లముందే ఒమర్ శాశ్వతంగా లోకం విడిచి వెళ్లిపోయాడు. ఆ క్షణం అమీ కళ్లలో.. నీళ్ల సుడిగుండం, చేతిలో ఒమర్ చేయి. భారంగా పక్కకు పెట్టింది. ఈ సందర్భంగా ఒమర్ తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడు చనిపోయినా ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన కోడలు తనకు కూతురిగా దొరికిందని చెప్పుతూ ప్రేమగా అమీని ఆలింగనం చేసుకొంది.