మడకశిరలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్
పరీక్ష ప్రారంభమైన అరగంటకే వాట్సాప్‌లో ప్రత్యక్షం
సాక్షి, అమరావతి, నెట్వర్క్: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పేపర్–1 ఎగ్జామ్ జరిగింది. అనంతపురం జిల్లా మడకశిరలో ప్రశ్నపత్రం లీక్ కావడం కలకలం సృష్టించింది. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగా.. అరగంటకే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. మడకశిర ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఏ, బీ సెంటర్లను ఏర్పాటు చేశారు. బీ సెంటర్లో మడకశిరలోని మాతా ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని, ప్రభుత్వ బాలికల హైస్కూల్‌కు చెందిన మరో విద్యార్థిని పరీక్ష రాస్తున్నారు. వీరిద్దరూ స్నేహితులు.
వీరిలో ఒకరికి స్లిప్పులు అందించేందుకు ఈశ్వర్, భాస్కర్, గణేశ్, పవన్‌కుమార్ అనే వ్యక్తులు అక్కడికి వచ్చారు. కిటికీ పక్కనే ఉన్న విద్యార్థిని వద్దకు వెళ్లి ప్రశ్నపత్రాన్ని బయటకు తీసుకున్నారు. సెల్ఫోన్లో ఫొటో తీసుకుని, ప్రశ్నపత్రాన్ని తిరిగిచ్చేశారు. అనంతరం అది వాట్సాప్‌లో హల్చల్ చేయడంతో పెద్ద దుమారం రేగింది. మడకశిర ప్రాంతంలో పర్యటించిన రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి పేపర్ లీక్‌పై విచారణకు ఆదేశించారు. ప్రశ్నపత్రంపై రాసిన హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఇన్విజిలేటర్ బి.కిశోర్, ఇద్దరు విద్యార్థినులు, మరికొంత మంది బయటి వ్యక్తులను విచారించారు. లీక్ ఘటనకు ఈశ్వర్, భాస్కర్, గణేశ్, పవన్‌కుమార్ బాధ్యులని తేల్చారు. ఈశ్వర్ మినహా మిగిలిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరించిన విద్యార్థినిని డీబార్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్ బి.కిశోర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.