వామ్మో ఇవేం ధరలు..
ఆకాశాన్నంటుతున్న ఎండుమిర్చి, నూనెలు, పప్పుల ధరలు
ఆత్మకూరు : నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్యులు వస్తువులు కొనలేక విలవిలలాడుతున్నారు. పచ్చడిలో వేసుకునే తెల్లగడ్డలు రూ.160కు చేరుకున్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం ఎండుమిర్చి ఓ రకం రూ.180 ఉండగా మేలురకం రూ.230గా ఉంది. కందిపప్పు రూ.160, మిన పప్పు రూ.150, పెసర రూ.120, పచ్చెనగపప్పు రూ.130, గోధుమలు రూ.35, సాయిపప్పు రూ.150, చింతపండు రూ.150 పలుకుతుంది. ఇక నూనెల విషయానికొస్తే పామాయిల్ రూ.60, సన్ఫ్లవర్ ఆయిల్ రూ.80, వేరుశెనగ నూనె రూ.120 ఉంది. ఈ రేట్లు చూసి మహిళలు వామ్మో ఇవేం రేట్లని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కూలీనాలీ చేసుకుని జీవించేవారి పరిస్థితి దారుణంగా ఉంది. నిత్యావసరాల ధరలు దించుతామని చెప్పిన ప్రభుత్వం తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో పేదలు పచ్చడి మెతుకులకు కూడా దూరమయ్యే పరిస్థితి నెలకొంది.