Himanshu Rana
-
VHT 2023: రాణా అజేయ శతకం.. ఫైనల్లో హర్యానా
విజయ్ హజారే ట్రోఫీ 2023లో హర్యానా ఫైనల్స్‌కు చేరింది. తమిళనాడుతో ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు 63 పరుగుల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. హిమాన్షు రాణా (118 బంతుల్లో 116 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), అన్షుల్ కంబోజ్ (9-0-30-4) హర్యానా గెలుపులో కీలకపాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా.. హిమాన్షు అజేయ శతకంతో మెరవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగుల చేసింది. హర్యానా ఇన్నింగ్స్‌లో హిమాన్షుతో పాటు యువరాజ్ సింగ్ (65), సుమిత్ కుమార్ (48) ఓ మోస్తరుగా రాణించారు. తమిళనాడు బౌలర్లలో టి నటరాజన్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సాయికిషోర్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన తమిళనాడు.. మీడియం పేసర్ అన్షుల్ కంబోజ్ చెలరేగడంతో 47.1 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటై, ఓటమిపాలైంది. హర్యానా బౌలర్లలో రాహుల్ తెవాటియా 2, సుమిత కుమార్, నిషాంత్ సింధు, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో బాబా ఇంద్రజిత్ (64) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. టోర్నీలో భాగంగా కర్ణాటక, రాజస్థాన్ జట్ల మధ్య రేపు (డిసెంబర్ 14) రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో హర్యానా ఈనెల 16న ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. -
కుర్రాళ్లు లెక్క సరిచేశారు
ఇంగ్లండ్ అండర్–19 జట్టుపై భారత్ ఘన విజయం ముంబై: బ్యాట్స్‌మెన్‌తోపాటు బౌలర్లు కూడా రాణించడంతో... ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత అండర్–19 జట్టు 129 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలి వన్డేలో 23 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్ రెండో మ్యాచ్‌లో నెగ్గి ఐదు వన్డేల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. ఓపెనర్ హిమాన్షు రాణా (66 బంతుల్లో 58; 10 ఫోర్లు), హార్విక్ దేశాయ్ (62 బంతుల్లో 75; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా... కమలేశ్ నాగర్కోటి (32 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (24), అభిషేక్ శర్మ (24) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ ఫిషర్ నాలుగు, హెన్రీ బ్రూక్స్ మూడు వికెట్లు తీశారు. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి 33.4 ఓవర్లలో 158 పరుగులకు కుప్పకూలింది. రాలిన్స్ (35 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా ఆడినా... మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. భారత్ తరఫున స్పిన్నర్ అనుకూల్ రాయ్ మూడు వికెట్లు పడగొట్టగా... శివమ్, ఇషాన్ పోరెల్లకు రెండేసి వికెట్లు లభించాయి. సిరీస్‌లోని మూడో వన్డే శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది.