hindhu
-
లోక కల్యాణం కోరుకునేది హిందూధర్మమే
సాక్షి, హైదరాబాద్: యువతలో ఆత్మవిశ్వాసం నింపే భగవద్గీత వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరముందని, లోకకల్యాణం కోరుకునే ఏకైక ధర్మం హిందూ ధర్మం అని సాధుసంతులు అన్నారు. శుక్రవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్మాచార్యుల సమావేశం హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో జరిగింది. సమావేశానికి 82 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరై ప్రసంగించారు. వచ్చే డిసెంబర్ 14న గీత జయంతి రోజు లక్ష మంది యువకులతో ‘లక్ష యువగళ గీతార్చన‘కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా సాధు సంతులతో ధర్మాచార్యుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా విశ్వహిందూ పరిషత్ లక్ష యువగళ గీతార్చన వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు. యువతీ యువకులకు సంస్కార అమృతం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రపంచ దేశాలకు గురు స్థానంలో ఉన్న భారత్.. భగవద్గీత ఆధారంగా జ్ఞానాన్ని అందించిందని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి యాదిరెడ్డి మాట్లాడుతూ దేశంలో హిందుత్వం తగ్గితే మారణహోమం పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతీ హిందువు తమ కర్తవ్యంగా ధర్మ రక్షణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకుడు రాఘవులు, రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, లక్ష యువ గళ గీతార్చన కార్యక్రమ కన్వీనర్ వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు. -
హిందూ రాజ్యం కోసమే
సాక్షి, హైదరాబాద్: దేశంలో కొనసాగుతున్న బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక శక్తులు, సంస్థలు సంఘటితం కావాలని విప్లవ రచయితల సంఘం (విరసం) పిలుపునిచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకోవాలని కోరింది. ఫాసిజానికి వ్యతిరేకంగా దేశవాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రగతిశీల విద్యార్ధి ఉద్యమాలు ఉత్తేజాన్ని అందజేస్తున్నాయని ప్రశంసించింది. విప్లవ రచయితల సంఘం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న రెండు రోజుల మహాసభలు శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ‘సృజనాత్మక ధిక్కారం యాభై వసంతాల వర్గపోరాట రచన’పేరుతో నిర్వహించిన సభలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ విప్లవ రచయిత, ‘ఆముఖ్’పత్రికా సంపాదకుడు కంచన్‌కుమార్, ప్రముఖ కవి యాఖూబ్, ఖాదర్ మొహియుద్దీన్, రివేరా, చెంచయ్య, విరసం కార్యదర్శి పాణి, బాసిత్, భోపాల్‌కు చెందిన మహిళా హక్కుల కార్యకర్త, రచయిత్రి రించిన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంచన్‌కుమార్ ప్రారంభోపన్యాసం చేస్తూ హిందూ రాజ్య స్థాపన కోసమే బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ముందుకు తెచ్చిందని ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన ఈ చట్టం రద్దు కోసం అన్ని వర్గాలు ఏకం కావాలన్నారు. దేశంలోని ముస్లింలకు ఓటు హక్కు లేకుండా చేసేందుకే కేంద్రం జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)ను ముందుకు తెస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నేటికీ నాటి పరిస్థితులే... భూస్వామ్య, దళారీ బూర్జువా శక్తుల దుర్మార్గమైన, హింసాత్మక పాలనకు వ్యతిరేకంగా నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల వెలుగులో 1970లో విరసం ఆవిర్భవించగా నేటికీ డెబ్భైల నాటి పరిస్థితులే హిందుత్వ ఫాసిస్టు పాలన రూపంలో ముందుకొచ్చాయని కంచన్‌కుమార్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మరణశయ్యపై ఉందని, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జామియా మిలియా, అలీఘడ్, జేఎన్‌యూ విద్యార్థుల పోరాటాలు గొప్ప చైతన్యాన్ని కలిగిస్తున్నాయని, పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక కేంద్రంగా షహీన్‌బాగ్ చరిత్రలో నిలిచిపోతుందని, దేశవ్యాప్తంగా మరిన్ని షహీన్‌బాగ్‌లు ఆవిర్భవించాలన్నారు. విమలక్క తదితర కళాకారుల సాంస్కృతిక ప్రదర్శన.. వర్గ పోరాట దృక్పథంతోనే.. విరసం 50 ఏళ్ల వేడుకల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, కవి యూఖూబ్ మాట్లాడుతూ మనిషిని ఉన్నతంగా నిలబెట్టడంకోసం ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో విరసం ఎన్నో కష్టాలు, బాధలు, నిర్బంధాలు, హింసను ఎదుర్కొందన్నారు. విరసం సమాజాన్ని ప్రభావితం చేయడమే కాకుండా సమాజం నుంచి నిరంతరం ప్రభావితమవుతుందని విరసం కార్యదర్శి పాణి చెప్పారు. విరసం ప్రస్థానం ఉజ్వలం: వరవరరావు విరసం 50 ఏళ్ల వేడుకల సందర్భంగా భీమా కోరెగావ్ కుట్ర కేసులో పుణే జైల్లో ఉన్న విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు తన సందేశాన్ని లేఖ ద్వారా పంపారు. ఆ సందేశాన్ని విరసం సభ్యులు క్రాంతి చదివి వినిపించారు. ‘‘విరసం 50వ పుట్టిన రోజు సందర్భంగా మీ అందరి నుంచి 600 కి.మీ. దూరంలో ఒంటరి ఖైదులో ఉన్నాను. కానీ నా ఆలోచనలు, ఉద్వేగాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 1970 జూలై 4న విరసం స్థాపన సందర్భంగా చేసిన ప్రకటనపై సంతకం చేసిన వాళ్లలో ఇప్పటికీ విరసంలో కొనసాగుతున్న వాడిని నేను ఒక్కడినే. నాడు విరసం వ్యవస్థాపనకు కారణమైన పరిస్థితులను చాలాసార్లు చెప్పుకొన్నాం. ఈ సందర్భంగా విరసం సభ్యులంతా మరోసారి ఫ్రాన్స్ అంతర్యుద్ధ కాలాన్ని అధ్యయనం చేయాలి. ఆనాటి పారిస్ పరిస్థితులు ఇప్పటి భారత పరిస్థితులకు పెద్దగా తేడాలేదని నేను భావిస్తున్నా. హిందుత్వ బ్రాహ్మణీయ ఫాసిస్టు దాడి వల్ల, సామ్రాజ్యవాదంతో దాని మిలాఖత్తు వల్ల ఈ అవసరం మరింత పెరుగుతోంది. 50 ఏళ్ల విరసం పయనం ఎంతో ఉజ్వలమైనది, గర్వకారణమైనది’’అని వరవరరావు తన సందేశంలో చెప్పారు. విరసం జెండా ఆవిష్కరణ సభల ప్రారంభానికి ముందు ఎర్రజెండాను కేరళ హక్కుల కార్యకర్త రావున్ని, విరసం జెండాను విరసం వ్యవస్థాపక సభ్యులు కృష్ణా బాయి ఆవిష్కరించారు. అమరుల స్థూపాన్ని ఇటీవల అమరుడైన దండకారణ్య స్పెషల్ జోన ల్ కమిటీ కార్యదర్శి రామన్న సోదరుడి కుమారుడు కమలాకర్ ఆవిష్కరించారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
ట్రోల్స్‌కు బదులిచ్చిన ఎంపీ నుస్రత్ జహాన్
న్యూఢిల్లీ: హిందువులు ధరించే సిందూరాన్ని పెట్టుకొని, చీర ధరించి ఇటీవల పార్లమెంట్లో గత నెల ప్రమాణస్వీకారం చేసినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్‌ను నెటిజన్లు ట్రోల్ చేయగా ఆమె వాటికి ట్విటర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. తాను సమ్మిళిత భారత్‌ను సూచించేలా సిందూరాన్ని ధరించానని ధీటుగా జవాబిచ్చారు. అది మతం, కులం, వివక్షలకు అతీతమైనదని అన్నారు. హింసను, పగను రెచ్చగొట్టే ఉన్మాదుల కామెంట్లను తాను పట్టించుకోన్నారు. తాను ముస్లింగానే ఉంటానని, కానీ అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టంచేశారు. తానేం ధరించాలో తన ఇష్టమని తెలిపారు. ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి, నుస్రత్ నిజమైన భారతీయ స్త్రీని ప్రతిబింబించిందని అన్నారు. సహారాన్పూర్లోని జమీమా షేక్ ఉల్ హింద్‌కు చెందిన మత పెద్ద అసద్ క్వాస్మి మాట్లాడుతూ ఇస్లాంలో ఇతర మతాల వారిని పెళ్లి చేసుకోవడం నిషిద్ధమన్నారు. అయిప్పటికీ ఆమె జైన్ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని అన్నారు. సిందూరం ధరించడం ఇస్లాంకు వ్యతిరేకమన్నారు. ఆమె సినిమా రంగానికి చెందిన వ్యక్తి అని తనకు తెలిసిందని, సినిమా రంగంవారు మత సంప్రదాయాలను పాటించరన్నారు. ఆమెను తమ మతంలోకి ఆహ్వానిస్తున్నామని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అన్నారు. భవిష్యత్తు తమ మతంతోనే సురక్షితంగా ఉందని, హిందూ మతం స్త్రీలను గౌరవిస్తుందని నుస్రత్ గుర్తించిందన్నారు. -
తొలి తీవ్రవాది హిందూ మతస్తుడే
సాక్షి, చెన్నై/అరవకురిచ్చి: భారతదేశంలో తొలి తీవ్రవాది హిందూ మతస్తుడే అని సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి అరవకురిచ్చిలో ఎన్నికల ప్రచారంలో కమల్ మాట్లాడారు. ‘స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే’ అని అన్నారు. అతనితోనే తీవ్రవాదం ప్రారంభమైందన్నారు. తనకు తాను గాంధీ మనవడిగా కమల్ అభివర్ణించుకున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని.. మహాత్ముని విగ్రహం ముందు నిల్చుని మాట్లాడుతున్నానని అన్నారు. దేశంలో సమానత్వాన్ని కోరుకునే గొప్ప భారతీయుల్లో తానూ ఒకడినన్నారు. జాతీయ జెండాలోని 3 రంగులు విభిన్న విశ్వాసాలకు ప్రతీకలని, ఇవి ఎప్పటికీ చెక్కుచెదరవన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ.. కమల్ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కమల్‌పై చర్యలు తీసుకోవాలని సోమవారం కేంద్ర ఎన్నికల సంఘంను బీజేపీ కోరింది. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమల్ విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిలిసాయి సౌందర్యరాజన్ ఆరోపించారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో ఉన్నారు కాబట్టే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ సైతం కమల్ వ్యాఖ్యలను ఖండించారు. కళకు, ఉగ్రవాదానికి మతం ఉండదని తెలుపుతూ వివేక్ సోమవారం ట్వీట్ చేశారు. గాడ్సేని తీవ్రవాదిగా పోలిస్తే సరిపోయేదని.. అతని మతాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఏకీభవించిన నేతలు.. కమల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్, ద్రవిడార్ కజగం (డీకే) పార్టీలు మద్దతు తెలిపాయి. గాడ్సేకి ఆర్ఎస్ఎస్ శిక్షణ ఇచ్చిందని డీకే అధినేత కె.వీరమణి వ్యాఖ్యానించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి కూడా కమల్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ను ఐసిస్ ఉగ్రవాద సంస్థతో పోల్చారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బెయిల్‌పై బయట ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. -
కశ్మీర్లో తొలి బీజేపీ సర్కారు?
న్యూఢిల్లీ/శ్రీనగర్: మెహబూబా ముఫ్తీ రాజీనామా తర్వాత కశ్మీర్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత నిర్మల్ సింగ్, ప్రధాని మోదీలు బుధవారం ప్రధాని కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. నిర్మల్ సింగ్‌తో భేటీకి ముందు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్, పార్టీ జాతీయ కార్యదర్శి రామ్మాధవ్తోనూ మోదీ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పీడీపీ రెబల్స్, ఇతర పార్టీల చీలిక వర్గం ఎమ్మెల్యేలతో కలిసి తొలిసారి కశ్మీర్లో హిందువును సీఎంగా నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. వారం రోజుల క్రితమే కశ్మీర్లో బీజేపీ సర్కారు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. ఢిల్లీ, శ్రీనగర్‌లోని బీజేపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్న విషయం సుస్పష్టమే. రామ్‌మాధవ్, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జద్ లోనీతో సమావేశమవడం, తర్వాత లోనే ఢిల్లీకి వచ్చి మోదీతో భేటీ కావడం తెల్సిందే. -
హిందూ వ్యతిరేకిని కాను
సాక్షి ప్రతినిధి, చెన్నై: కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా తాను హిందూ వ్యతిరేకిని కాను, అందరివాడినని నటుడు కమల్‌హాసన్ అన్నారు. ఒక తమిళ వారపత్రికలో వస్తున్న ధారావాహిక సీరియల్లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాను కొందరికి వ్యతిరేకిని అనే భావం కలిగించేట్లుగా కొందరు వ్యక్తులు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఇలా అందరినీ సమభావంతో చూసేవాడినని తెలిపారు. ఇంట్లోనే పరమ భక్తుడైన అన్న చంద్రహాసన్‌ను పెట్టుకుని హిందూ వ్యతిరేకిగా ఎలా ఉండగలనని ప్రశ్నించారు. అలాగే ఎంతో భక్తురాలైన కుమార్తె శ్రుతిహాసన్‌ను విభేదించగలనా అని అన్నారు. -
మతవాదం ప్రమాదం
జెడ్పీ సెంటర్ (మహబూబ్‌నగర్): మతవాదం దేశానికి చాలా ప్రమాదకరమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుమడు ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విప్లవ రచయిత సంఘం (విరసం) 26వ రాష్ట్ర మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు సాగే ఈ మహాసభలను ఆనంద్ ప్రారంభించి మాట్లాడారు. దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. సుప్రీంకోర్టు హిందుత్వాన్ని ఒక జీవన విధానంగా నిర్వచించడంతో గందరగోళం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. 1920 దశకంలోనే∙దళిత , కమ్యూనిస్టు ఉద్యమాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డేవార్ ఇటలీలో గడిపిన సమయంలో అక్కడ ఫాసిజం ధోరణిని అధ్యయనం చేసి భారతదేశంలో ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్కు అధినేత అయిన గోల్వార్కర్ హిందుత్వం మరింత పాతుకుపోవడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. అలాగే, సావర్కర్ అండమాన్ జైలులో ఉండి వలసవాదులను నిరోధిస్తానని చెప్పి పుణ్యభూమి అనే భావన ద్వారా క్రిస్టియన్లు భారతీయులు కాదని చెప్పారన్నారు. అయితే, హిందుత్వం కేవలం ఆర్ఎస్ఎస్కు మాత్రమే పరిమితం కాలేదని కాంగ్రెస్ స్థాపనతో కూడా ముందుకొచ్చిందని తెలిపారు. మతాన్ని మార్కెట్‌కు ముడిపెట్టిన బీజేపీతో సమానంగా రాహుల్‌గాంధీ కూడా హిందుత్వం కాగడా పట్టుకున్నారని ఆనంద్ విమర్శించారు. ప్రత్యేకించి ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని, ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రచారంలో దూకుడుగా 2019 ఎన్నికల దిశగా వెళ్తున్నాయని చెప్పారు. ఇప్పటికిప్పుడు సాధ్యం కాకున్నా మున్ముందు హిందూ రాజ్యంగా మార్చడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. విరసం లేకుండా తెలుగు సాహిత్యం లేదు: హరగోపాల్ విప్లవ రచయితల సంఘం (విరసం) లేకుండా తెలుగు సాహిత్యాన్ని ఊహించడం కష్టమని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మానవత్వం మీద విశ్వాసముండే పాత్రను ప్రతీ ఒక్కరూ పోషించాలని, ఈ పాత్రను విరసం సభ్యులు బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. అలాగే, ప్రజలను సమీకరించడంతోపాటు సమాజాన్ని మార్చే చారిత్రక బాధ్యత విరసంపై ఉందన్నారు. విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, ప్రొఫెసర్లు పాణి, కాశీం, ఎక్బాల్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ పాలనతో పేట్రేగిపోతున్న బ్రాహ్మణీయ హిం దూ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. సంస్కృతి, మతం పేరుతో దేశంలోని రచయితలు, మేధావులపై ఆర్ఎస్ఎస్, హిందూత్వ శక్తులు దాడులు చేస్తున్నాయని విమర్శించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ విరసం రాష్ట్ర మహాసభలకు తమ సంఘీభావం ప్రకటించారు. అలాగే, కళాకారులతో కలసి అమరవీరుల త్యాగాలు మరువలేమని, గోమాత ఎవరు అనే పాటలు పాడి సభికులను అలరించారు. ఇంకా సభల్లో విరసం సభ్యులు వరవరరావు, బాసిత్, ఎక్బాల్, కాశీం, అరసవెల్లి కృష్ణ, గీతాంజలి, రాంకీ, రాజేంద్రబాబు, రాఘవాచారి, ప్రసాద్‌రావు, చెంచయ్య, ఉదయమిత్ర తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి హిందువు ఇంట్లో ఖడ్గం ఉండాలి
సాక్షి, బెంగళూరు (యాదగిరి): బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్–కర్ణాటక ప్రాంతంలోని యాదగిరిలో బుధవారం హిందూ విరాట్ సమావేశాన్ని నిర్వహించారు. శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్‌తో పాటు తెలంగాణలోని రాజాసింగ్ పాల్గొన్నారు. రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘మత మార్పిడితో పాటు హిందూ ఆలయాలను ధ్వంసం చేసిన టిప్పు సుల్తాన్ జయంతిని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సరికాదు. టిప్పు జయంతికి బదులుగా ఎవరైనా దేశ భక్తుడి జయంతిని ఆచరించాలి. ప్రతి హిందువూ తన ఇంట్లో లాఠీని, ఖడ్గాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి. సందర్భం వచ్చినప్పుడు హిందూ ధర్మాన్ని విరోధించే వారి తలలను ఖడ్గంతో నరకాలి’ అని వ్యాఖ్యానించారు. ఆ కార్యక్రమానికి హాజరైన యువకులు రాజాసింగ్ వ్యాఖ్యలతో తమ చేతుల్లోకి ఖడ్గాలను తీసుకొని తిప్పడం కనిపించింది. ప్రమోద్ ముతాలిక్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ‘దేశం, ధర్మాన్ని రక్షించుకునేందుకు ప్రతి హిందూ ఖడ్గాన్ని చేపట్టాలని నేను కూడా 15 ఏళ్లుగా చెబుతూ వస్తున్నాను. అయితే ఈ ఖడ్గాన్ని తప్ప తాగి ఎవరిపైనైనా దాడి చేసేందుకు కానీ, మంచి వారికి హాని తలపెట్టేందుకు కానీ వినియోగించకూడదు’ అని చెప్పారు. -
హిందుస్తాన్ హిందువులదే: భాగవత్
ఇండోర్: భారత్ కేవలం హిందువుల దేశమేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘జర్మనీ ఎవరి దేశం? జర్మన్లది. బ్రిటన్ బ్రిటిషర్లది. అమెరికా అమెరికన్లది. అలాగే హిందుస్తాన్(భారత్) హిందువులది’ అని అన్నారు. ఇతర మతస్తులు భారత్‌లో జీవించవచ్చని సెలవిచ్చారు. భారత సంస్కృతిని అనుసరిస్తూ జీవించేవారందరూ భారతీయులేనన్నారు. ఏ రాజకీయ నేత, పార్టీ కూడా దేశాన్ని గొప్పగా మార్చలేరని, ఇందుకు తొలుత సమాజంలో చైతన్యం రావడం అవసరమన్నారు. ప్రజలు తమ మనసుల్లోంచి అన్ని రకాల వివక్షల్ని తొలగించుకుంటేనే భారత్ శక్తిమంతమైన విశ్వ గురువుగా అవతరిస్తుందన్నారు. -
ప్రేమ కోసం రషీద్ .. రాహుల్‌గా మారాడు
చిన్నశంకరంపేట (మెదక్): ప్రియురాలి కోసం ఓ రాజు భాగ్యనగరం నిర్మించారని విన్నాం. ప్రేమ కోసం తాజ్ మహల్ నిర్మించారని చరిత్రలో చూస్తున్నాం. లవ్ జిహాద్ ఆరోపణలనూ గమనిస్తున్నాం. కానీ, ప్రేమించిన అమ్మాయి కోసం మతం మారిన ముస్లిం యువకుడి కథ ఇది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట గ్రామానికి చెందిన ఎండీ రషీద్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు తెలిస్తే తమ ప్రేమ పెళ్లికి అడ్డుగా నిలుస్తారని భావించారు. ఎవరికీ తెలియకుండా సికింద్రాబాద్‌లోని న్యూ బోయిన్పల్లి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అక్కడ హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేయాలంటే ఇద్దరు హిందువులే అయి ఉండాలని చెప్పడంతో రషీద్ మతం మారేందుకు నిర్ణయించుకున్నాడు. తన పేరును రాహుల్‌గా మార్చుకుని హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లికి సిద్ధపడ్డాడు. ఈ నెల 25న మతం మారడంతోపాటు, పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆ జంట చిన్న శంకరంపేట పోలీస్‌లను కలిసి ఇక ముందు తాము తల్లిదండ్రులతో సంబంధం లేకుండా స్వతంత్రంగా జీవిస్తామని, ఇందుకు సహకరించాలని కోరారు. యువకుడు హైదరాబాద్‌లోని జియో టెలికాం సంస్థలో పనిచేస్తుండగా, అమ్మాయి డీఈడీ చదువుతోంది. -
సమంత హిందూమతానికి మారిందా?
నటి సమంత హిందుమతానికి మారారా? ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్న న్యూస్ ఇదే.దక్షిణాదిలో అగ్రకథానాయకిగా రాణిస్తున్న సమంత ఇటీవల తమిళ, తెలుగు భాషాచిత్రాలన్నీ మంచి విజయాన్ని సాధించి ఈ ముద్దుగుమ్మ స్టార్ ఇమేజ్ను మరింత పెంచాయని చెప్పవచ్చు. అయితే సమంత అవకాశాలను మాత్రం తగ్గించుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు కారణం కల్యాణ గడియలు దగ్గర పడుతుండడమే అనే టాక్ వినిపిస్తోంది. సమంత, టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య గాఢంగా ప్రేమలో మునిగితేలుతున్నారన్న ప్రచారం మీడియాలో చాలా కాలంగా హెడ్లైన్లో హాట్ న్యూస్‌గా ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. కాగా వచ్చే ఏడాది తమ వివాహం జరగనుందన్న విషయాన్ని నాగచైతన్య ఇటీవల చెన్నైకి వచ్చిన సందర్భంగా తెలిపారు కూడా. అయితే నాగచైతన్య హిందూ మతానికి చెందగా నటి సమంతది క్రిస్టియన్ కుటుంబం. దీంతో వీరి పెళ్లి రెండు మతాల సంప్రదాయం ప్రకారం రెండు సార్లు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో నటి సమంత ఇటీవల హిందూ మతాన్ని స్వీకరించినట్లు మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. -
వీహెచ్‌పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న "ఘర్ వాపసీ"
-
ఇస్లామిక్ కళాశాల ఏర్పాటు ఉగ్రవాదుల కుట్రలో భాగమే
చంద్రగిరి , న్యూస్‌లైన్: హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తిరుపతి పరిసర ప్రాం తంలో ఏర్పాటు చేసిన ఇస్లామిక్ కళాశాలను వెంటనే తొలగించాలని విజయవాడకు చెందిన శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ డిమాండ్ చేశారు. చంద్రగిరి మండలం తొండవాడ వద్ద హీరా సంస్థ నిర్మిస్తున్న ఇస్లామిక్ కళాశాల ప్రాంతంలో శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ ఉగ్రవాదుల దుశ్చర్యలో భాగమే ఇస్లామిక్ కళాశాల ఏర్పాటు అని ఆరోపించారు. దేశంలో మరెక్కడా స్థలం లేనట్టు ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి ప్రాంతంలో కళాశాలను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. కళాశాల నిర్మాణానికి నిధుల సేకరణ, విధివిధానాలు, విద్యార్థుల వివరాలను గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోందన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ర్యాలీ నిర్వహించడంతో చంద్రగిరి, తిరుపతి రూరల్ సీఐలు నాగభూషణం, సుబ్రమణ్యంతో పాటు నలుగురు ఎస్ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ జనజాగృతి సంస్థ అధికార ప్రతినిధి ఆకుల కృష్ణకిషోర్, దళిత హిందూ పరిరక్షణ అధ్యక్షులు బాపూజీ, హిందూ ధర్మ చైతన్య సంఘం నాయకుడు బీవీ.రత్నంశెట్టి, జయచంద్రారావు, తొండవాడ సర్పంచ్ సిద్దముని, పీ.మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందూ జన గర్జనను విజయవంతం చేయండి తిరుపతిలోని ఇందిరా మైదానంలో ఈనెల 20వ తేదీనిర్వహించే హిందూ జన గర్జన సభను విజయవంతం చేయాలని విజయవాడకు చెందిన శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామీజీ కోరారు. వంద మంది పీఠాధిపతులతో సభ జరుపుతున్నట్టు చెప్పారు. -
ఒక హిందు - ఒక ముస్లిం ప్రేమకథ
హిందువులంతా దేశభక్తులు, ముస్లిమ్‌లంతా దేశద్రోహులు కాదనే కథాంశంతో నవీన్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఒక హిందు - ఒక ముస్లిం’. జీఎన్కె ప్రొడక్షన్స్, ఆర్మల్ మూవీస్ పతాకంపై నందిత నిర్మిస్తున్నారు. అక్షిత్ సేనాని, పల్లవి హీరో, హీరోయిన్లు. హైదరాబాద్‌లోని పాత బస్తీ, వైజాగ్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఒక హిందూ యువకుడు, ఓ ముస్లిమ్ యువతి మధ్య సాగే ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది? అనే కథతో ఈ చిత్రం రూపొందిస్తున్నాం.‘ఓరుగల్లు...’ అనే పాటను చిత్రీకరిస్తున్నాం. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే నెల 2 పాటలను, టీజర్‌ను, నవంబర్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, పవన్, భరత్, శివారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిట్టా, కెమెరా: ఇ.హెచ్.ఎస్.ప్రసాద్, సహనిర్మాతలు: జైహింద్‌గౌడ్-వెలగందుల శశిధర్.