Hindu Munnani
-
తీర్పులు కాదు..సంప్రదాయాలే ముఖ్యం!
చెన్నై: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించొచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా సంప్రదాయాలను ఉల్లంఘించలేమని హిందూ మహిళా భక్త సంఘాలు అంటున్నాయి. 50 ఏళ్ల వయసు వచ్చే వరకు వేచిచూస్తామని, తర్వాతే ఆలయాన్ని దర్శిస్తామని సంఘాలు తేల్చాయి. చెన్నైలోని గంగాదీశ్వర ఆలయంలో శనివారం భారత్ హిందూ మున్నాని ఆధ్వర్యంలో ‘లైట్‌ల్యాంప్’ ప్రార్థనా సమావేశం జరిగింది. రుతుక్రమం ముగిసేదాకా(50 ఏళ్లు) శబరిమల ఆలయాన్ని సందర్శించమని ఈ సందర్భంగా మహిళా భక్తులు ప్రతినబూనారు. ‘కోర్టు తీర్పులు ఎలా వచ్చినా పురాతన సంప్రదాయాలను గౌరవిస్తాం. సంప్రదాయాలపై నమ్మకాన్ని చాటిచెప్పడానికే లైట్‌ల్యాంప్ ప్రార్థన నిర్వహించాం. విశ్వాసాల మేరకే శబరిమలను సందర్శించాలని మహిళా భక్తులు ప్రతినబూనారు’ అని హిందూ మక్కల్ కచ్చి చీఫ్ అర్జున్ సంపత్ చెప్పారు. -
కమల్‌కు అప్పుడే చిక్కులు!
సాక్షి, రామంతపురం (తమిళనాడు) : ప్రముఖ నటుడు, తమిళనాడు రాజకీయాల్లో ఆరంగేట్రం చేసి క్రియాశీలకంగా మారనున్న కమల్‌హాసన్‌కు అప్పుడే చిక్కులు మొదలయ్యాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పాఠశాలను సందర్శించడానికి వీల్లేదంటూ తమిళనాడులోని హిందూ మున్నానీ అనే హిందూ సంస్థ డిమాండ్ చేసింది. రాజకీయాలను పాఠశాలలకు దూరం పెట్టాలని పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ జిల్లా విభాగ అధ్యక్షుడు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. కమల్‌ను అక్కడికి రాకుండా నిలువరించాలని కలెక్టర్‌ను వారు కోరారు. కలాం జన్మించిన రామేశ్వరం నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాలని కమల్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బుధవారం ఇక్కడ నుంచే పార్టీని ప్రకటించి పూర్తి స్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నారు. ఈ సందర్భంగా ఏపీజే కలాం చదివిన పాఠశాలను సందర్శించనున్నారు. -
'40వేల ఆలయాలను స్వాధీనం చేసుకుంటాం'
వేలూరు: తమిళనాడు రాష్ట్రంలోని 40వేల ఆలయాలను స్వాధీనం చేసుకొని అభివృద్ది చేస్తామని హిందూ మున్నాని తమిళనాడు ప్రధాన కార్యదర్శి మురుగానందం తెలిపారు. శనివారం ఉదయం వేలూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఆలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో ఎటువంటి అభివృద్ది జరగలేదని, వీటిని తాము స్వాధీనం చేసుకొని అభివృద్ది చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయాల్లో పౌర చట్టాన్ని అమలు చేయాలని, మత మార్పిడి చట్టాన్ని నిలుపుదల చేయాలని, హిందువులపై మతపరమైన దాడులను అరికట్టాలని, హిందువులకు ఉచిత చట్ట సహాయం చేయాలని, హిందువుల కేసులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, తదితర సమస్యలపై సమావేశంలో తీర్మానించారు. -
‘హిందూ’ నేత హత్య
రాష్ట్రంలో మరో హిందూ మున్నని నేతను దుండగులు హత్యచేశారు. తిరునెల్వేలి జిల్లా శంకరన్ కోవిల్ పట్టణానికి చెందిన జీవరాజ్ (37)ను శుక్రవారం అర్ధరాత్రి వేటకొడవళ్లతో నరికి హతమార్చారు. మృతునికి ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి : హిందూ మున్నని పట్టణ కార్యదర్శి గా వ్యవహరిస్తున్న జీవరాజ్‌ను 3 నెలల క్రితం సస్పెండ్ చేశారు. అదే ప్రాంతంలో మునీశ్వర్ ఆలయూన్ని నిర్మించిన జీవరాజ్ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ దళారిగా కూడా ఉన్నారు. పెద్ద భార్య అయ్యమ్మాళ్కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కరడికుళానికి చెందిన షర్మిలాదేవీ (28)ని ఆరు నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. పడమర పాట్టాత్తూరులో జీవా ఇటీవలే కొత్తగా నిర్మించుకున్న సొంత ఇంటిలో ఇద్దరు భార్యలతో నివసిస్తున్నాడు. శుక్రవారం భర్తపై అలిగిన అయ్యమ్మాళ్ అదే ఊరిలోని తన పుట్టింటికి వెళ్లింది. పిల్లలు ఇంట్లో నిద్రిస్తుండగా, సమీపంలోనే ఉన్న మునీశ్వర్ ఆలయం వాకిట్లో మంచం వేసుకుని జీవరాజ్ నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి దుండగులు ఆలయం ముందున్న లైట్లను పగులకొట్టి, జీవా కళ్లలో కారంపొడి చల్లి, వేటకొడవళ్లతో వెంటబడి విచక్షణా రహితంగా నరికారు. తండ్రి కేకలతో వెలుపలకు వచ్చిన కుమారుడు వల్లరసు రక్తపుమడుగులో పడివున్న జీవాను చేసి సృ్పహ తప్పిపోయాడు. తెల్లవారు జీవా రెండో భార్య, తెల్లవారుజామున భర్త మృతదేహాన్ని చూసి తల్లడిల్లింది. శంకరన్ ఆలయం ఉన్నకళుగుమలై రోడ్డులో ఉన్న మరో సామాజికవర్గం, హిందూమున్నని నేతల మధ్య వైషమ్యాలు ఉన్నాయి. ఆ సామాజిక వర్గం ఉన్నచోట వినాయకుని గుడి, పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. గత వినాయకచవితి రోజున మరో సామాజిక వర్గం ఉన్న ప్రాంతంలో ఊరేగింపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. శంకరన్‌కోవిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో హతుడిపై అనేక కేసులు ఉన్నాయి. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. రాష్ట్రంలో హిందూ ముద్ర వేసుకున్న నేతల హత్యల పరంపర కొనసాగుతోంది. వేలూరు జిల్లాలో ఒకరిని హత్యచేయగా, మరో సంఘటనలో ఒకరు తప్పించుకున్నారు. తిరుచ్చిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆడిటర్ రమేష్ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. మరో ఇద్దరిపై కూడా హత్యాయత్నాలు జరిగాయి. గత ఏడాదిలో హిందువులే లక్ష్యంగా హత్యలు సాగడంపై పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అయితే తాజా హత్యలో హిందూ నేపథ్యమా, ఇద్దరు భార్యల గొడవా, రియల్ ఎస్టేట్ తగాదాలా అని పోలీసులు విచారిస్తున్నారు.