రాష్ట్రంలో మరో హిందూ మున్నని నేతను దుండగులు హత్యచేశారు. తిరునెల్వేలి జిల్లా శంకరన్ కోవిల్ పట్టణానికి చెందిన జీవరాజ్ (37)ను శుక్రవారం అర్ధరాత్రి వేటకొడవళ్లతో నరికి హతమార్చారు. మృతునికి ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి : హిందూ మున్నని పట్టణ కార్యదర్శి గా వ్యవహరిస్తున్న జీవరాజ్‌ను 3 నెలల క్రితం సస్పెండ్ చేశారు. అదే ప్రాంతంలో మునీశ్వర్ ఆలయూన్ని నిర్మించిన జీవరాజ్ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ దళారిగా కూడా ఉన్నారు. పెద్ద భార్య అయ్యమ్మాళ్‌కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కరడికుళానికి చెందిన షర్మిలాదేవీ (28)ని ఆరు నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. పడమర పాట్టాత్తూరులో జీవా ఇటీవలే కొత్తగా నిర్మించుకున్న సొంత ఇంటిలో ఇద్దరు భార్యలతో నివసిస్తున్నాడు. శుక్రవారం భర్తపై అలిగిన అయ్యమ్మాళ్ అదే ఊరిలోని తన పుట్టింటికి వెళ్లింది. పిల్లలు ఇంట్లో నిద్రిస్తుండగా, సమీపంలోనే ఉన్న మునీశ్వర్ ఆలయం వాకిట్లో మంచం వేసుకుని జీవరాజ్ నిద్రపోతున్నాడు.
అర్ధరాత్రి దుండగులు ఆలయం ముందున్న లైట్లను పగులకొట్టి, జీవా కళ్లలో కారంపొడి చల్లి, వేటకొడవళ్లతో వెంటబడి విచక్షణా రహితంగా నరికారు. తండ్రి కేకలతో వెలుపలకు వచ్చిన కుమారుడు వల్లరసు రక్తపుమడుగులో పడివున్న జీవాను చేసి సృ్పహ తప్పిపోయాడు. తెల్లవారు జీవా రెండో భార్య, తెల్లవారుజామున భర్త మృతదేహాన్ని చూసి తల్లడిల్లింది. శంకరన్ ఆలయం ఉన్నకళుగుమలై రోడ్డులో ఉన్న మరో సామాజికవర్గం, హిందూమున్నని నేతల మధ్య వైషమ్యాలు ఉన్నాయి. ఆ సామాజిక వర్గం ఉన్నచోట వినాయకుని గుడి, పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. గత వినాయకచవితి రోజున మరో సామాజిక వర్గం ఉన్న ప్రాంతంలో ఊరేగింపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
శంకరన్‌కోవిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో హతుడిపై అనేక కేసులు ఉన్నాయి. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. రాష్ట్రంలో హిందూ ముద్ర వేసుకున్న నేతల హత్యల పరంపర కొనసాగుతోంది. వేలూరు జిల్లాలో ఒకరిని హత్యచేయగా, మరో సంఘటనలో ఒకరు తప్పించుకున్నారు. తిరుచ్చిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆడిటర్ రమేష్ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. మరో ఇద్దరిపై కూడా హత్యాయత్నాలు జరిగాయి. గత ఏడాదిలో హిందువులే లక్ష్యంగా హత్యలు సాగడంపై పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అయితే తాజా హత్యలో హిందూ నేపథ్యమా, ఇద్దరు భార్యల గొడవా, రియల్ ఎస్టేట్ తగాదాలా అని పోలీసులు విచారిస్తున్నారు.
‘హిందూ’ నేత హత్య
Published Sat, Jul 5 2014 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM
Advertisement
Advertisement