నోకియా స్మార్ట్ఫోన్ల కేర్‌టేకర్ అనూహ్య నిర్ణయం
నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి పునఃప్రవేశపెట్టిన కొన్నినెలల్లోనే హెచ్ఎండీ గ్లోబల్ సీఈవో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఎండీ గ్లోబల్ సీఈవో ఆర్టో నుమెలా తన పదవి నుంచి నిష్క్రమించారు. ఆర్టో రాజీనామా చేయడంతో ప్రస్తుతం హెచ్ఎండీ గ్లోబల్‌కు అధినేతగా ఉన్న ఫ్లోరియన్ సెషినే సీఈవోగా విధులు నిర్వర్తించనున్నారని తెలిసింది. హెచ్ఎండీ గ్లోబల్ ఆపరేషన్స్‌ను సృష్టించడానికి, టీమ్‌ను రూపొందించడానికి, కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి లాంచ్ చేయడానికి ఆర్టో నుమెలా కీలక పాత్ర పోషించారు. ఆర్టో అందించిన సహకారానికి కంపెనీ బోర్డు తరుఫున కృతజ్ఞతలు చెబుతున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ బోర్డు చైర్మన్ శామ్ చిన్ చెప్పారు.
ఆయన భవిష్యత్తు లక్ష్యాలకు శుభాకాంక్షలు తెలిపారు. కంపెనీ ప్రారంభమైన దగ్గర్నుంచి హెచ్ఎండీ గ్లోబల్‌కు అధినేతలాగా ఫ్లోరియన్ కో-లీడింగ్ సేవలందించినట్టు కొనియాడారు. ఆర్టో పదవిలో ఉన్న కాలంలో హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 3, 5, 6 స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరో స్మార్ట్‌ఫోన్ నోకియా 8ను హెచ్ఎండీ గ్లోబల్ జూలై 31న మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతుంది. నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లలో కెల్లా అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఇదే. దీని ధర భారత్‌లో రూ.40వేలకు పైననే ఉంటుందని తెలుస్తోంది. స్టీల్, గోల్డ్/కాపర్, బ్లూ, గోల్డ్/బ్లూ రంగుల్లో ఇది అందుబాటులోకి రాబోతుంది.