Honeymoon couple
-
హనీమూన్‌లో విషాదం..
యశవంతపుర: చూడ చక్కని జంట. ఎన్నో కలలతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన ఆ దంపలను చూసి విధికి కన్నుకుట్టింది. హనీమూన్ ముగించుకొని ఎన్నో మరుపురాని జ్ఞాపకాలను మోసుకొని ఇంటికి వస్తుండగా మృత్యువు పంజా విసిరి నవ వరుడిని బలి తీసుకుంది. ఈ విషాద ఘటన హావేరి జిల్లా హిరేకరూరు తాలూకా కొడద గ్రామం వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. దావణగెరె జిల్లా హరిహర తాలూకా జిగళి గ్రామానికి చెందిన మఠం రాజయ్య, శోభ దంపతుల కుమారుడు సంజయ్(28) బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్నాడు. నవంబర్ 28న బైలహొంగలకు చెందిన టెక్కీ ప్రీతితో వివాహమైంది. కాపురం ఉండేందుకు బెంగళూరులో అద్దె ఇల్లు చూశారు. 12న ఆ ఇంటిలో చేరాల్సి ఉంది. అయితే హనీమూన్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. శనివారం ఉదయం సిగందూరు చౌడేశ్వరిని దర్శించుకున్న జంట.. ఆదివారం శిరసి మారికాంబా దేవిని దర్శించుకొని తిరిగి జిగళికి వస్తుండగా హావేరి జిల్లా హిరేకెరూరు తాలూకా కొడద వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఇద్దరికీ బలమైన గాయాలు కావడంతో రాణెబెన్నూరు ఆస్పత్రికి, తర్వాత దావణగెరెకు తరలిస్తుండగా మార్గం మధ్యలో సంజయ్ మృతి చెందాడు. స్ట్రెచర్‌లో విగతజీవిగా ఉన్న సంజయ్‌ను చూసి భార్య ప్రీతి కన్నీరుమున్నీరైంది. పోస్టుమార్టం అనంతరం సంజయ్ మృతదేహాన్ని జిగళి గ్రామానికి తరలించారు. -
హనీమూన్: భర్తతో విహరిస్తున్న ఎంపీ!
నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్, భర్త నిఖిల్ జైన్‌తో కలిసి మాల్దీవుల్లో ప్రణయయాత్ర చేస్తున్నారు. పార్లమెంటుకు తొలిరోజు వెస్టర్న్ దుస్తులు ధరించి వచ్చినందుకు తృణమూల్ ఎంపీలైన నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నూతన దంపతులైన నుస్రత్, నిఖిల్ ప్రస్తుతం మాల్దీవుల్లో హానీమూన్ జరుపుకొంటున్నారు. ఈ హనీమూన్‌కు సంబంధించి పలు ఫొటోలను నుస్రత్ జహాన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. యెల్లో ప్యాంట్, కలర్‌ఫుల్ ప్రింటెడ్ టాప్ ధరించి.. స్టైలిష్ హ్యాట్ పెట్టుకొని.. భర్తతో దిగిన ఓ ఫొటోను ఆమె పోస్టు చేశారు. మరోవైపు ఈ ప్రయణయాత్రలోనే ఆమె హిందూ మహిళల తరహాలో సంప్రదాయబద్ధంగా సింధూర దూజ్‌ను జరుపుకున్నారు. హిందూ వైవాహిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ.. చీరను ధరించి.. నుదుట కుంకమ పెట్టుకొని.. ఆమె భర్తతో కలిసి ఈ వేడుకను జరిపారు. ఇక, స్ట్రిప్డ్ బ్లూ టాప్ ధరించి ఒంటరిగా దిగిన ఫొటోను కూడా ఆమె పోస్టు చేయగా.. ‘హనీ.. హనీమూన్ ఎలా ఉంది’ అంటూ తోటి తృణమూల్ ఎంపీ మిమి చక్కవర్తి సరదాగా కామెంట్ చేశారు. ‘దీనికి ఇక్కడ హానీ బాగుంది. మూన్ బావున్నాడు. సూర్యుడే కొంచెం ఎక్కువ ఎండ కాస్తున్నాడు’ అంటూ నుస్రత్ తెలివిగా చమత్కరించారు. -
హనీమూన్‌లో కార్చిచ్చు.. కష్టాలు!
ఏథెన్స్ : ఓవైపు చెలరేగిన కార్చిచ్చు గ్రామాన్ని మొత్తం బూడిద చేయగా.. మరోవైపు విదేశీయులు సైతం ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు. అగ్నికీలలు స్థానికులతో పాటు పర్యాటకుల ప్రాణాలతో చెలగాడమాడాయని అధికారులు అంటున్నారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ సమీపంలోని మాటీ గ్రామంలో చెలరేగిన కార్చిచ్చులో 100 మంది మంటల్లో కాలిపోగా, మరో 1000 మందికి కాలిన గాయాలైన విషయం తెలిసిందే. హనీమూన్‌కు వచ్చిన ఎన్నో జంటల జీవితంలో కార్చిచ్చు పెను విషాదాన్ని నింపుతోంది. ఐర్లాండ్‌కు చెందిన జోయ్ హోలోహన్, బ్రేయిన్ ఓ కల్లాఘన్ల మనసులు కలిశాయి. కొంతకాలం ప్రేమించుకున్న అనంతరం గత గురువారం ప్రేయసి జోయ్‌తో కల్లాఘన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తమకు సమీపంలోని పర్యాటక ప్రాంతమైన ఏథెన్స్లోని మాటీకి వెళ్లారు. కానీ తమ హనీమూన్‌లో కార్చిచ్చు విషాదం నింపనుందని జోయ్ ఆందోళన చెందుతున్నారు. తాజా అగ్నిప్రమాదంలో తమ జంట వేరయిందని, భర్త కల్లాఘన్ జాడ తెలియటం లేదని ఆమె కన్నీటి పర్యంతమైంది. అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తనను సిబ్బంది రక్షించి ఆస్పత్రిలో చేర్పించారని, కళ్లు తెరిచి చూసేసరికి భర్త పక్కన లేడని చెప్పింది. పోలీసులకు భర్త ఫొటోతో పాటు వివరాలు ఇచ్చానని, దేవుడి దయ వల్ల అతడికి ఏం కాకూడదని నవ వధువు జోయ్ ప్రార్థిస్తోంది. పర్యాటనకు వచ్చి ఇలా పొరుగు దేశంలో ప్రాణాలు కోల్పోవడం నరక ప్రాయమని బాధిత టూరిస్టులు అంటున్నారు. దేవదారు వృక్షాల్లో మొదలైన చిన్న మంట.. కార్చిచ్చుగా మారి గ్రామాన్ని మొత్తం బూడిద చేసేసింది. ప్రాణాలు రక్షించుకునేందుకు స్థానికులతో పాటు పర్యాటకులు బీచ్‌ల వైపు పరుగులు తీశారు. అయినా వందల మందిని కార్చిచ్చు దహించివేసింది. ఆ ప్రాంతాల్లో అగ్గి పదే పదే రాజేసుకోవడంతో ఏం చేయాలన్న దానిపై చర్చిస్తున్నారు. పర్యాటకులు తమ దేశాలకు తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని గ్రీస్ అధికారులను కోరుతున్నారు. మహా దావానలం.. 100 మంది మృతి -
లండన్‌లో హనీమూన్..!
లవ్... నాగచైతన్య సమంతలది! లండన్... వాళ్ల హనీమూన్ డెస్టినేషన్! అంతే కాదు... మ్యారీడ్ లైఫ్‌లో అవుటాఫ్ ఇండియా వెళ్లడమూ ఇదే ఫస్ట్ టైమ్! యస్... ఇప్పుడు చైతూ–సమంత లండన్‌లో ఉన్నారు. నిజం చెప్పాలంటే... వీళ్లిద్దరూ హనీమూన్‌కి న్యూయార్క్ వెళతారనుకున్నారంతా! కానీ, లండన్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. వారం క్రితమే అక్కడికి వెళ్లారు. ఇండియాలో ఏ మూలకు వెళ్లినా... ఎవరోఒకరు గుర్తు పట్టి పలకరిస్తారు. మాంచి క్రేజీ కపుల్ అండ్ స్టార్స్ కూడా కదా! లండన్‌లో అయితే... అంత ఇబ్బంది ఉండదు. అందువల్ల, స్వేచ్ఛగా విహరిస్తున్నారు. తాము స్టార్స్ అనే సంగతి మరిచి, చేతిలో చెయ్యేసుకుని చక్కగా సిటీ అంతటినీ చుట్టేస్తున్నారట. మధ్య మధ్యలో అభిమానుల కోసం కొన్ని అప్డేట్స్ ఇస్తున్నారనుకోండి! అలాగే, చెన్నై రిసెప్షన్‌లోని ఫొటోలను కొన్నిటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సమంత. కొత్తగా పెళ్లైన ఈ జంట ఇంకో వారం రోజులు లండన్‌లోనే ఉంటారట! ఇండియా తిరిగొచ్చిన తర్వాత మళ్లీ ఎవరి షూటింగులతో వాళ్లు బిజీ బిజీ!! -
బాత్రూంలో చిరుత దూరింది!
వాళ్లకు కొత్తగా పెళ్లయింది. ఏదైనా మంచి ప్రాంతానికి వెళ్తే బాగుంటుందని హనీమూన్ స్పాట్‌గా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ను ఎంచుకున్నారు. అక్కడ ఉన్నవాటిలో మంచి హోటల్ ఒకదాంట్లో గది బుక్ చేసుకున్నారు. తెల్లవారుజామున పెద్ద శబ్దం వచ్చింది. ఏంటా అని చూస్తే.. బాత్రూంలో చిరుతపులి దూరింది! అయితే ఇందులో విచిత్రం ఏమిటంటే.. ఒకవైపు చిరుతపులిని చూసి ఆ కొత్తజంట భయపడితే, మరోవైపు చిరుతపులి కూడా ఎందుకో తెలియదు గానీ, బాత్రూంలో భయం భయంగా ఓ మూల నక్కి కూర్చుంది. తెల్లవారుజామున 4.45 సమయంలో అద్దం పగిలిన శబ్దానికి తాను లేచానని, చూస్తే కిటికీలోంచి చిరుతపులి లోపలకు దూరిందని.. దాంతో వెంటనే తాను, తన భార్య దుప్పటి కప్పేసుకుని దాక్కున్నామని.. చిరుతపులి నేరుగా వెళ్లి బాత్రూంలో దాక్కుందని సుమిత్ అనే సదరు భర్త చెప్పాడు. వెంటనే తాను వెళ్లి బాత్రూం తలుపు గడియ పెట్టి హోట్ యాజమన్యానికి విషయం చెప్పానన్నాడు. హోటల్ యజమాని అమిత్ సా వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా వాళ్లతో పాటు అటవీ శాఖాధికారులు కూడా వచ్చారు. వాళ్లు వల, మత్తు ఇంజెక్షన్లు తీసుకుని వచ్చినా.. చిరుతపులి మాత్రం ఎలాగోలా పారిపోయింది. కుక్కలు తరమడంతో అది ఇటువైపు వచ్చి ఉంటుందని, తాము ప్రయత్నించినా పారిపోయిందని నైనిటాల్ డీఎఫ్ఓ తేజస్విని అరవింద్ పాటిల్ చెప్పారు. దాని వయసు సుమారు ఏడాది ఉంటుందని, అడవిలో అయితే సురక్షితంగా ఉంటుందని అక్కడికే వెళ్లిపోయినట్లుందని ఆమె తెలిపారు. భలే దగ్గరగా చూశా చిరుతపులిని చూసి కాస్త భయపడిన మాట నిజమే అయినా.. తర్వాత మాత్రం దాన్ని అంత దగ్గర నుంచి చూడగలిగినందుకు చాలా సంతోషంగా ఉందని సుమిత్ భార్య శివాని చెప్పారు. కిటికీకి అద్దం తప్ప వేరే గ్రిల్ ఏమీ లేదని, అందువల్లే అది లోనికి రాగలిగిందని సుమిత్ అన్నారు. హరినగర్ ప్రాంతంలోని మసీదువైపు నుంచి చాలా వీధికుక్కలు తరుముకుంటూ వస్తుండగా చిరుతపులి హోటల్లోకి దూరడాన్ని తాను చూశానని అదే హోటల్లో బసచేస్తున్న మరో అతిథి రాజేష్ సిజ్వాలి చప్పారు. -
వరదల్లో హనీమూన్ జంట
అన్నానగర్ : తిరువేర్కాడులో గత నెల 27న వివాహం చేసుకున్న గౌరీ, రాజశేఖర్ కాశ్మీరు వరదల్లో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే, నగర రవాణా సంస్థ డ్రైవర్ ఎం.కరుణానిధి తన కుమార్తె అయిన గౌరీని రాజశేఖర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. హనీమూన్ కోసం ఈ దంపతులు సెప్టెంబరు 2వ తేదీన కాశ్మీరుకు వెళ్లారు. వీరు సెప్టెంబరు 6వ తేదీన తిరిగి చెన్నై చేరుకోవాల్సి ఉండగా, నేటి వరకూ ఈ హనీమూన్ ప్యాకేజ్ టూర్‌ను బుక్ చేసిన సదరు ట్రావెల్ ఏజెంట్ వధూ-వరుల తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు. కానీ బుధవారం గౌరీ తన తల్లిదండ్రులకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి తాము సురక్షితంగా ఉన్నామని తెలపడంతో పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం తమను చెన్నైకు పంపడానికి ఢిల్లీలోని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు గౌరీ ఫోన్లో తెలిపిందన్నారు. ఈ నెలాఖరుకి కొత్త పెళ్లి కొడుకైన రాజశేఖర్ కతార్‌లోని కొత్త ఉద్యోగంలో చేరవలిసి ఉందని కరుణానిధి తెలిపారు.