ఏథెన్స్ : ఓవైపు చెలరేగిన కార్చిచ్చు గ్రామాన్ని మొత్తం బూడిద చేయగా.. మరోవైపు విదేశీయులు సైతం ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు. అగ్నికీలలు స్థానికులతో పాటు పర్యాటకుల ప్రాణాలతో చెలగాడమాడాయని అధికారులు అంటున్నారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ సమీపంలోని మాటీ గ్రామంలో చెలరేగిన కార్చిచ్చులో 100 మంది మంటల్లో కాలిపోగా, మరో 1000 మందికి కాలిన గాయాలైన విషయం తెలిసిందే. హనీమూన్‌కు వచ్చిన ఎన్నో జంటల జీవితంలో కార్చిచ్చు పెను విషాదాన్ని నింపుతోంది.
ఐర్లాండ్‌కు చెందిన జోయ్ హోలోహన్, బ్రేయిన్ ఓ కల్లాఘన్‌ల మనసులు కలిశాయి. కొంతకాలం ప్రేమించుకున్న అనంతరం గత గురువారం ప్రేయసి జోయ్‌తో కల్లాఘన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తమకు సమీపంలోని పర్యాటక ప్రాంతమైన ఏథెన్స్‌లోని మాటీకి వెళ్లారు. కానీ తమ హనీమూన్‌లో కార్చిచ్చు విషాదం నింపనుందని జోయ్ ఆందోళన చెందుతున్నారు. తాజా అగ్నిప్రమాదంలో తమ జంట వేరయిందని, భర్త కల్లాఘన్ జాడ తెలియటం లేదని ఆమె కన్నీటి పర్యంతమైంది. అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తనను సిబ్బంది రక్షించి ఆస్పత్రిలో చేర్పించారని, కళ్లు తెరిచి చూసేసరికి భర్త పక్కన లేడని చెప్పింది. పోలీసులకు భర్త ఫొటోతో పాటు వివరాలు ఇచ్చానని, దేవుడి దయ వల్ల అతడికి ఏం కాకూడదని నవ వధువు జోయ్ ప్రార్థిస్తోంది.
పర్యాటనకు వచ్చి ఇలా పొరుగు దేశంలో ప్రాణాలు కోల్పోవడం నరక ప్రాయమని బాధిత టూరిస్టులు అంటున్నారు. దేవదారు వృక్షాల్లో మొదలైన చిన్న మంట.. కార్చిచ్చుగా మారి గ్రామాన్ని మొత్తం బూడిద చేసేసింది. ప్రాణాలు రక్షించుకునేందుకు స్థానికులతో పాటు పర్యాటకులు బీచ్‌ల వైపు పరుగులు తీశారు. అయినా వందల మందిని కార్చిచ్చు దహించివేసింది. ఆ ప్రాంతాల్లో అగ్గి పదే పదే రాజేసుకోవడంతో ఏం చేయాలన్న దానిపై చర్చిస్తున్నారు. పర్యాటకులు తమ దేశాలకు తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని గ్రీస్ అధికారులను కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment