Horn OK Please
-
నోటీసులు అందాయి
‘హార్న్ ఓకే ప్లీజ్’ (2008) సినిమా సెట్లో నటుడు నానా పటేకర్, ‘చాక్లెట్’ సినిమా సెట్లో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తనతో అసభ్యంగా ప్రవర్తించారని నటి తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రి తరఫు న్యాయవాదులు తనుశ్రీకి నోటీసులు పంపారు. ‘‘తన పట్ల వివేక్ అగ్నిహోత్రి అమర్యాదగా ప్రవర్తించారన్న తనుశ్రీ మాటల్లో వాస్తవం లేదు. పబ్లిసిటీ లేదా వ్యక్తిగత లబ్ధి కోసమే ఆమె ఇలా చేస్తున్నారు’’ అన్నది ఆ నోటీసుల సారాంశమట. ‘‘నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిల నుంచి నాకు గురువారం నోటీసులు వచ్చాయి. వేధింపులు, అవమానం, అన్యాయాలకు నోరు విప్పితే ఇక్కడ ఇలాంటి బహుమతులు వచ్చాయి. నానా, వివేక్ బృందాలు నాపై బురద చల్లడానికి అసత్యాలు మాట్లాడుతున్నారు’’ అని తను శ్రీ ఆవేదన వ్యక్తం చేశారని బాలీవుడ్లో తాజాగా కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. ‘‘ఎప్పుడో పదేళ్ల క్రితం నాటి సంఘటనను ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. నానా పటేకర్ చాలా మంచి వ్యక్తి’’ అని ముంబై మంత్రి ఒకరు ఫోన్లో తనుశ్రీతో సంభాషించారని వార్తలు వస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ ఫ్రీదా పింటో కూడా తనుశ్రీకి మద్దతు తెలిపారు. -
క్షమాపణలు సరిపోవు
నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు హిందీ పరిశ్రమలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘హార్న్ ఓకే ప్లీజ్ ’ సినిమా టైమ్‌లో నానా పటేకర్ తనను వేధించిన విషయాన్ని సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు (సీఐఎన్‌టీఏఏ) ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయిందని తనుశ్రీ వాపోయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పుడే తనుశ్రీ కారుపై జరిగిన దాడి తాలూకు వీడియో ఒకటి బయటికొచ్చింది. ఆ వీడియో నిజమా? కాదా? అనే చర్చ జరుగుతోంది. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు సీఐఎన్‌టీఏఏ స్పందించింది. ‘‘ 2008లో తనుశ్రీ చేసిన ఫిర్యాదును సక్రమంగా పరిష్కరించలేకపోయామని చెప్పడానికి చింతిస్తున్నాం. అప్పటి చీఫ్ గ్రీవెన్స్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ విభాగం ఈ ఇష్యూను సమావేశంలో ప్రస్తావించలేదు. అప్పటితో పోలిస్తే ఇప్పటి విధుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆమెకు మా క్షమాపణలు సరిపోవు. కానీ నిబంధనల ప్రకారం మూడేళ్ల క్రితం నాటి కేసులు అసోషియేషన్ పరిగణించదు. ఇకపై ఇలాంటి ఫిర్యాదులను మా అసోసియేషన్ తేలికగా తీసుకోదు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే తనుశ్రీ వివాదం కొలిక్కి రావాలని అందుకోసం ఓ ఎంక్వైరీ టీమ్ ఉండాలని సంబంధిత ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తాం’’ అని సీఐఎన్‌టీఏఏ ప్రతినిధులు ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారంటూ బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. అలాగే తనుశ్రీకి ఎవరో బెదిరింపు కాల్స్ చేయడంతో ఆమెకు ముంబై పోలీసులు రక్షణ కూడా ఇస్తున్నారన్నది తాజా సమాచారం. మరోవైపు తాను చేసిన ఆరోపణలకు సంబంధించి నానా పటేకర్ నుంచి తనకు ఇంకా ఏ నోటీసులు రాలేదని తనుశ్రీ అంటున్నారని బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే నటి డింపుల్ కపాడియా ఎప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో నానా ఎంతో ప్రతిభ ఉన్నవాడని ప్రశంసల వర్షం కురిపించిన డింపుల్ అతనిలో ఉన్న ‘డార్క్ సైడ్’ కూడా తెలుసు అనడం విశేషం. -
తనుశ్రీ దత్తాని నమ్మాలి
ప్రస్తుతం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమాకు సంబంధించి తనుశ్రీ దత్తా – నానా పటేకర్‌ల వివాదం హిందీ పరిశ్రమలో ఎంతటి చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ విషయంపై తనుశ్రీకి మద్దతుగా బాలీవుడ్ నటులు ఫర్హాన్ అక్తర్, సోనమ్ కపూర్, ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ వంటి వారు గళం విప్పారు. ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. తాజాగా ‘36 చైనా టౌన్ (2004), ధోల్ (2007)’ సినిమాల్లో తనుశ్రీతో కలిసి వర్క్ చేసిన పాయల్ రోహత్గీ ఈ విషయంపై స్పందించారు. ‘‘ఒక మహిళగా తనుశ్రీ చెప్పిన విషయంపై నాకు నమ్మకం ఉంది. ఆమె మాటలను అందరూ వినాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనే నాకు 2011లో ఎదురైంది. దర్శకుడు దిబాకర్ బెనర్జీ నాతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. కానీ చాలా మంది అతను మంచివాడు అన్నారు. ఏ వ్యక్తి అయినా కేవలం వృత్తిపరంగానే కాదు నిజ జీవితంలోనూ విలువలు పాటించాలి. అనురాగ్ కశ్యప్, సుధీర్ మిశ్రా లాంటి వాళ్లు ఒకప్పుడు నా మానసిక స్థితి బాగోలేదన్నారు. ఇప్పుడు తనుశ్రీకి మద్దతుగా అనురాగ్ కశ్యప్ మాట్లాడుతున్నారు. కాస్త అయోమయంగా ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇండియాలో స్త్రీవాదం ఉందంటే నాకు నమ్మబుద్ధి కావడంలేదు. దిబాకర్ బెనర్జీ నాతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పడం నా కెరీర్‌పై ప్రభావం చూపించింది. కొంతకాలం నేను సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. టీవీల్లో రియాలిటీ షోలు చేశా. మలయాళం నటుడు దిలీప్‌కుమార్ వివాదం, శ్రీ రెడ్డి వివాదం వంటివి వచ్చినప్పుడు ‘మీ టూ’ లాంటి ఉద్యమాలు ఇండియాలో ఎందుకు ఊపందుకోవడం లేదో అర్థం కావడం లేదు. కొందరు చేసే ఆరోపణలకు అండగా నిలవడం, కొందరిని తేలికగా తీసుకోవడం.. ఈ వ్యత్యాసం ఎందుకు? అన్ని సంఘటనలను సమానంగానే చూడాలన్నది నా అభిప్రాయం’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచి.. నానా పటేకర్, తనుశ్రీ వివాదం గురించి చెప్పాలంటే... ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్ 4’ షూటింగ్ కోసం జై సల్మేర్‌లో ఉన్న నానా పటేకర్ ముంబై వచ్చిన వెంటనే ఈ వివాదం గురించి ఓ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేస్తారని ఆయన తరఫు న్యాయవాదాలు చెబుతున్నారు. ఈ వివాదం ఎందాకా సాగుతుంది? అనేది చూడాలి. -
తప్పు చేసినవాళ్లు అనుభవించాల్సిందే
‘హార్న్ ఓకే ప్లీజ్’ (2008) చిత్రానికి చెందిన టైటిల్ సాంగ్ చిత్రీకరణ సమయంలో నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించినట్లు నటి తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాకేష్ సారంగ్, నిర్మాత సమి సిద్ధిఖీ, నృత్యదర్శకుడు గణేశ్ ఆచార్యలు లొకేషన్లో ఉన్నప్పటికీ తన ఇబ్బందిని పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడీ ఈ వివాదంపై సదరు చిత్రబృందం ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ‘‘తనుశ్రీ బాలీవుడ్లో తిరిగి అవకాశాలు దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడీ వివాదాన్ని సృష్టిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ ‘నథానీ ఉతారో’ మొదట్లో సోలో సాంగ్ అని, కావాలనే డ్యూయెట్గా మార్చామంటున్న ఆమె మాటల్లో వాస్తవం లేదు. ఒకవేళ అదే నిజమైతే ఈ పాట కోసం ఆమె సాధన చేసినప్పుడు మేల్ వాయిస్ కూడా ఉందనే విషయాన్ని గుర్తుచేసుకోవాలి. సందేహం ఉంటే అప్పుడే అడగాలి. కానీ అడగలేదు. ఆ పాటను మొదట్నుంచి డ్యూయెట్గానే అనుకున్నాం. నానా పటేకర్ చాలా కాలం తర్వాత ఓ పాటకు రెడీ అయిన టైమ్ అది. ఆ అత్యుత్సాహం ఆమెకు చెడు ప్రవర్తనగా అనిపించి ఉండొచ్చు. నాలుగు వందలమంది చూస్తున్నప్పుడు ఓ మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి ఎవరైనా ధైర్యం చేస్తారా? ఆ తర్వాత ఈ విషయమై నానా పటేకర్‌కు చెందిన వాళ్లు ఆమె కారును ధ్యంసం చేశారని సినీ ఆర్టిస్టు అండ్ టెలివిజన్ ఆర్టిస్టు అసోసియేషన్ (సిఐఎన్‌టీఏఏ)కు ఫిర్యాదు చేశారు తనుశ్రీ. కొన్ని డిమాండ్స్ కూడా చేశారు. ఈ సమస్యను సిఐఎన్‌టీఏఏ అప్పట్లోనే పరిష్కరించింది. మళ్లీ ఇప్పుడు తనుశ్రీ ఇలా చేస్తున్నారు. ఈ విషయంపై నానా పటేకర్ చట్టపరంగా ముందుకు వెళ్తారనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చారు చిత్రదర్శకుడు సారంగ్. ‘‘రిహార్శల్స్ టైమ్‌లోనే ఈ సాంగ్‌లో నానా పటేకర్ కూడా ఉంటారని నేను తనుశ్రీకి చెప్పాను. నానాజీ చాలా మంచి వ్యక్తి. అతను ఎప్పుడు అలా చేయరు’’ అని ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ గణేశ్ పేర్కొన్నారు. ‘‘లొకేషన్లో 50 నుంచి 100 మంది ఉన్న నేపథ్యంలో లైంగికంగా వేధించాననడం విచిత్రంగా ఉంది. మరి.. తనుశ్రీ మాటలకు అర్థం ఏంటో నాకు అర్థం కావడం లేదు. లీగల్‌గా ఎలా ప్రొసీడ్ అవుతానో వేచి చూడండి’’ అన్నారు నానా పటేకర్. రాకేశ్ సారంగ్, గణేశ్ ఆచార్యల కామెంట్స్‌పై తనుశ్రీ రెస్పాండ్ అయ్యారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ‘‘గణేశ్ ఆచార్య అబద్ధం చెబుతున్నాడు. అతనికి రెండు ముఖాలు ఉన్నాయి. పదేళ్ల క్రితం వేధింపులకు సంబంధించిన వారిలో ఇతని పేరు కూడా ఉంది. ఈ విషయాన్ని అతను ఒప్పుకోడు. ఇలాంటివారిపై నిషేధం విధిస్తే తప్పుచేయాలనుకునేవారికి ఉదాహరణగా ఉంటారు. నా ఫైట్ నానా పటేకర్, గణేశ్ ఆచార్యలపై కాదు. వాళ్లతో నేను వర్క్ చేయాలనుకోవడం లేదు. అయితే వాళ్లు చేసినదానికి అనుభవించాలనుకుంటున్నాను’’ అంటూనే బాలీవుడ్లో మళ్లీ సినిమాలు చేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారట తనుశ్రీ. మరి.. ఈ వివాదం ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ సినిమా ట్రైలర్ రిలీజ్లో భాగంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ల ముందు తనుశ్రీ దత్తా విషయం ఉంచితే.. ‘‘ఈ విషయంపై స్పందించడానికి నేనేం తనుశ్రీని కాదు. నానా పటేకర్‌ని కాను. నేం చెప్పలేను’’ అని అమితాబ్ పేర్కొన్నారు. ‘‘ఒక విషయంపై కచ్చితమైన అవగాహన లేకుండా నా అభిప్రాయాన్ని చెప్పలేను. అయితే ఇలాంటివి జరగకూడదనే కోరుకుంటాను. నిజంగా ఇలాంటి సంఘటనలు బాధాకరం’’ అని ఆమిర్ చెప్పారు. -
నానా వేధింపులు
లైంగిక వేధింపులపై ఇటీవల కాలంలో కొందరు నటీమణులు బహిరంగంగా నోరు విప్పుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీ దత్తా (‘వీరభద్ర’ సినిమా ఫేమ్) ‘‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రీకరణ టైమ్‌లో ఓ నటుడు నన్ను లైంగికంగా వేధించాడు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నటుడెవరో కాదు.. నానాపటేకర్ అంటూ పేరు బయటపెట్టడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ‘‘నానా పటేకర్ గొప్ప నటుడే. కానీ, మహిళల పట్ల అతని ప్రవర్తన అసభ్యంగా ఉంటుంది. నటీమణులను తిడతాడు, కొడతాడు. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయం ఇండస్ట్రీలోని అందరికీ తెలుసు. కానీ బయటకు చెప్పడానికి ఎవరికీ ధైర్యం సరిపోదు. కనీసం అతన్ని తమ సినిమాల్లోకి తీసుకోకుండా బ్యాన్ కూడా చేయరు. అక్షయ్ కుమార్ ఎనిమిదేళ్లుగా నానాతో నటిస్తూనే ఉన్నాడు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఇటీవల అతనితో ‘కాలా’ సినిమాలో నటించారు. ఇలాంటి పెద్ద పెద్ద స్టార్లే నానా లాంటి క్రిమినల్స్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎన్ని ‘మీ టూ’ ఉద్యమాలు వచ్చినా ఉపయోగం ఉండదు’’ అన్నారు. -
నో హారన్ ప్లీజ్....
మంచి, చెడుల గురించి పెద్దగా ఆలోచించకుండా దేన్నైనా నిషేధించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా సరకుల రవాణా ట్రక్కుల వెనుక రాసి ఉండే 'హారన్ ఓకే ప్లీజ్'ను నిషేధిస్తూ మహారాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొన్న ఆవు మాంసాన్ని (బీఫ్), అంతకుముందు... పతంగులు ఎగరేసేందుకు ఉపయోగించే 'మాంజా'ను, దానికి ముందు రక్త సంబంధీకులు కానివారిని 'అంకుల్' అని పిలవద్దంటూ వరుసగా ఉత్తర్వులు జారీచేస్తూ వచ్చింది. ట్రక్కుల వెనుక 'హారన్ ఓకే ప్లీజ్' అని రాయడం వల్ల వాహనదారులను హారన్ కొట్టాల్సిందిగా ప్రోత్సహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అలా రాయడాన్ని నిషేధించడం ద్వారా శబ్ద కాలుష్యాన్ని అరికట్టడంలో ముందున్నామంటూ తనకు తాను జబ్బలు చరచుకుంది. అర్థమయ్యే ట్రాఫిక్ బోర్డులనే మన వాహన చోదకులు పట్టించుకోరు. అలాంటిది స్పష్టంగా అర్థం కాని 'హారన్ ఓకే ప్లీజ్'ను ఎంతమంది పట్టించుకుంటారు? ఇంతకూ అసలు 'హారన్ ఓకే ప్లీజ్' అనే నానుడి ఎలా వచ్చిందనే విషయంలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. సాధారణంగా హారన్ ప్లీజ్ అని ఉండాలి. ఒకప్పుడు అలాగే ఉండేది. మరి 'ఓకే' అనే పదం మధ్యలో ఎందుకు చేరింది? అన్న ప్రశ్నకు సమాధానాలు వెతుకుదాం. ఇంగ్లీషురాని పెయింటరెవరో అలా రాయడం వల్ల, దాన్ని ఇతరులు గుడ్డిగా అనుసరించడం వల్ల అది ఓ ప్రేజ్గా స్థిరపడిపోయిందనే వాళ్లు ఉన్నారు. ఈ వాదన వాస్తవానికి దగ్గరగా లేదు. ఓ దశలో టాటా కంపెనీ పెద్ద ఎత్తున ట్రక్కులను ఉత్పత్తి చేసిన విషయం తెల్సిందే. అప్పుడు ఎక్కడా చూసినా టాటా కంపెనీ ట్రక్కులే కనిపించేవి. అదే సమయంలో టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ 'ఓకే' బ్రాండ్ నేమ్‌తో వాషింగ్ సబ్బులను తయారుచేసింది. వాటి మార్కెట్ ప్రచారం కోసం తన కంపెనీయే తయారు చేసిన ట్రక్కులపై 'ఓకే' అని రాయించినట్టు వాదించేవారూ ఉన్నారు. కానీ 'ఓకే....టాటా...బై..బై'నే టాటా సబ్బు ప్రచార నినాదం ప్రజల్లో అప్పటికే ఎంతో చొచ్చుకుపోయింది. అలాంటి సమయంలో ఇలా అర్థంకాని రీతిలో సబ్బును టాటా కంపెనీ ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న ట్రక్కు డ్రైవర్ల కథనం ప్రకారం: 'హారన్ ప్లీజ్' అనే పదం విడివిడిగా ఉండి, మధ్యలో పెద్దాక్షరాల్లో 'ఓకే' అనే పదం ఉండేది. (ఇప్పటికీ చాలా ట్రక్కులపై అలాగే ఉంటుంది). ఆ పదం పైనా ఓ ఆకుపచ్చ లైటు ఉండేది. వెనక వచ్చే వాహనం ఓవర్ టేక్కు ప్రయత్నించినప్పుడు, ఆ వాహన డ్రైవరుకు అర్థమయ్యేలా ట్రక్కు డ్రైవర్ ఈ 'ఓకే' లైట్‌ను వెలిగించేవాడు. ఈ కథనం వాస్తవానికి దగ్గరగా ఉంది. 'హారన్ ప్లీజ్' పదంలో 'ఓకే' అనే పదం ఎందుకొచ్చిందో మనలాగా ఆలోచించని వారు చాలా మందే ఉంటారు. అందుకనే 2009 'హారన్ ఓకే ప్లీజ్' టైటిల్‌తో బాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. -
‘హారన్ ఓకే ప్లీజ్’ ఇక వద్దు
- లారీల వెనక ఇలాంటి సంకేతాలు రాయకూడదని రవాణా శాఖ ఆదేశం - ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ సాక్షి, ముంబై: రవాణా వాహనాల వెనుక ‘హారన్ ఓకే ప్లీజ్’ అన్న సంకేతాలను తొలగించాలని రాష్ర్ట రవాణా శాఖ ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా రాయడం వల్ల వెనక వస్తున్న వాహనదారులకు తప్పుడు సమాచారం వెళుతుందని పేర్కొంది. ట్రక్కు, టెంపో వంటి సరుకులు చేరవేసే భారీ వాహనాల వెనక భాగంలో హారన్ ఓకే ప్లీజ్ అని రాసి ఉండడం అందరికి తెలిసిందే. అయితే దాని వెనకు ఉన్న అసలు ఉద్దేశం.. రవాణా శాఖ నియమాల ప్రకారం ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే (ఓవర్టేక్) సమయంలో హరన్ కొట్టాలి. అయితే ఈ విషయం తెలియక అనవసర సమయాల్లో కూడా హారన్ కొట్టడంతో పక్క వాహన చోదకులు ఇబ్బందులు పడుతుంటారు. ముందు వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశముంది. లోడుతో వెళుతున్న భారీ వాహనాలకు వెనక వస్తున్న సరిగా కనబడదు. దీంతో ఓవర్ టేక్ సమయంలో ప్రమాదం జరిగే ఆస్కారముంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాహనాన్ని అధిగమించే సమయంలో హారన్ కొట్టాలని దాని సందేశం. మరో సందేశమేమిటంటే పదే పదే హారన్ కొట్టి విసిగించవద్దు, మీరు కొట్టిన హారన్ చాలు వీలు దొరకగానే ఓవర్ టేక్ చేసేందుకు అవకాశం ఇస్తామని దాని అర్థం. కాని అలా రాసిన సందేశంవల్ల హారన్ ఎక్కడైన కొట్టవచ్చని కొందరు భావిస్తున్నారు. ఆ సందేశాన్ని సరిగా అర్థం చేసుకోక అనేక మంది డ్రైవర్లు అనవసరంగా హారన్ కొడుతూ రోడ్డుపై వెళుతున్న వారిని, ముందు వెళుతున్న వాహన చోదకులను విసిగెత్తిస్తుంటారు. హారన్ ఓకే ప్లీజ్ అంటే ఇష్టమున్న చోట హార్న్ కొట్టవచ్చని కొందరు భావిస్తున్నారని రవాణ శాఖ అభిప్రాయపడింది. దీంతో ఆ సందేశాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. గత సంవత్సర కాలంలో రవాణ శాఖ పోలీసులు అనవసరంగా హారన్ కొట్టి ధ్వని కాలుష్యం చేస్తున్న 15,534 మంది డ్రైవర్లపై చర్యలు తీసుకున్నారు. వారి నుంచి రూ.13.25 లక్షలు జరిమానా వసూలు చేశారు.