house places
-
‘ఇళ్లస్థలాల’ భూముల అభివృద్ధికి ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన భూముల్లో అన్ని మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. వచ్చే ఉగాది నాటికి దాదాపు 25 లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాల పంపిణీకి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా భూములు గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన భూముల్లో ముళ్ల పొదల తొలగింపు, భూమి చదును చేయడం, అంతర్గత రోడ్ల నిర్మాణం, లింకు రోడ్లు నిర్మాణాన్ని ఉపాధి హామీ పథకంలో చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇళ్ల స్థలాల కోసం కేటాయింపు చేసినట్లు నిర్ణయం తీసుకున్నాకే ఆయా స్థలాల్లో పనులు చేపట్టాలని పేర్కొన్నారు. 800 మీటర్ల అంతర్గత రోడ్లు ఇళ్ల స్థలాలకు కేటాయించిన స్థలంలో ‘ఉపాధి’ నిధులతో ఏయే పనులు చేపట్టవచ్చో స్పష్టంగా పేర్కొంటూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఉత్తర్వులిచ్చారు. ఎకరా విస్తీర్ణంలో గరిష్టంగా నాలుగు వేల క్యూబిక్ మీటర్ల పరిమాణం మేర భూమి చదునుకు అనుమతించారు. ఎకరా స్థలంలో గరిష్టంగా 800 మీటర్ల పొడవున అంతర్గత రోడ్ల నిర్మాణానికీ.. ఇళ్ల స్థలానికి కేటాయించిన స్థలం నుంచి దగ్గరగా ఉండే రోడ్డుకు కలుపుతూ గరిష్టంగా 5 కి.మీ పొడవున గ్రావెల్ రోడ్డు నిరి్మంచవచ్చని పేర్కొన్నారు. రూ. 5 లక్షల లోపు పనులకు పంచాయతీరాజ్ లేదా సాంఘిక సంక్షేమ శాఖ ఇంజనీరు విభాగాల్లో పనిచేసే డీఈఈ.. రూ. 40 లక్షల వరకు పనులను ఈఈలు.. రూ. 2 కోట్ల వరకు పనులను జిల్లా ఎస్ఈలు, అంతకు మించి విలువ చేసే పనులను ఈఎన్సీ కార్యాలయంలోని సీఈలకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. 12,291 ఎకరాల్లో పనులకు ప్రతిపాదనలు ఇళ్ల స్థలాల కోసం మొత్తం 12,291 ఎకరాల్లో రూ. 803 కోట్లతో నాలుగు రకాల అభివృద్ధి పనులకు ప్రతిపాదనల్ని జిల్లా అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందులో 2,702 ఎకరాల్లో పనులు చేపట్టేందుకు అనుమతుల జారీ చేసే ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన పనులకు సంబంధించి అనుమతుల జారీ ప్రక్రియ జిల్లాల్లో వేగంగా కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు. -
ఆ స్కాంలపై విచారణ జరుపుతాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. గ్రామాల్లో ఎంత భూమి ఉందో అంచనా వేసి.. దానిలో ప్రభుత్వ భూమిని గ్రామాల వారిగా లెక్కలు తీయండని సీఎం సూచించారు. ప్రభుత్వ భూమి లేని చోట ప్రైవేటు భూమి కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలన్నారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో కూడా భూమి కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. పేదలకు అపార్టుమెంట్లు రూపంలో ఇచ్చేటప్పుడు దానిపై వాళ్ళకు పూర్తి హక్కు కల్పించాలన్నారు. గతంలో అర్బన్ హౌసింగ్ నిర్మాణంలో మొత్తం దోపిడీ చేశారని, వెయ్యి రూపాయలు దాటని వ్యయాన్ని 2 వేలకు పైగా పెంచేసి అవినీతికి పాల్పడ్డారని సీఎం వివరించారు. గతంలో జరిగిన పట్టణ ఇళ్ల నిర్మాణాల స్కాంపై విచారణ జరుపుతామన్నారు. అవినీతిని నిర్మూలించి ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇళ్ళు కేటాయిస్తుందని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. కాగా పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉగాది నాడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామని సీఎం వైఎస్ జగన్ ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అర్హులందరికీ పెన్షన్లు... రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అనర్హులుంటే వారిని వెంటనే తొలగించాలని కలెక్టర్లతో సమావేశంలో వివరించారు. అభయ హస్తం పెన్షన్ వస్తోందని.. పెన్షన్ ఇవ్వకపోవడం సమంజసం కాదని అన్నారు. దీనిపై సరైన పరిష్కారం కనుగొనాలని కలెక్టర్లకు సూచించారు. ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ: సీఎం జగన్ -
ఏపీ ఎన్జీవో హోమ్‌లో ఘర్షణ
-
ఏపీ ఎన్జీవో హోమ్‌లో ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో హోమ్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఏపీ ఎన్జీవో హౌసింగ్ బోర్డు ఆదివారం సమావేశమైంది. ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై చర్చ జరిగింది. తెలంగాణ ఎన్జీవోలు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని, సమావేశాన్ని అడ్డుకున్నారు. అంతలోనే ఏమైందో సమావేశంలో ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డిపై కొంతమంది దాడికి దిగారు. విషయం తెలుసుకుని పోలీసులు రంగప్రవేశం చేశారు. అంతేకాక పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. -
అర్హులకు ఇవ్వరా?
కొండపాక, న్యూస్‌లైన్: ఎన్నో ఏళ్లుగా ఇంటి స్థలాలిస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే పేద ప్రజలకు ఇవ్వకుండా అనర్హులకు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారికి ఇవ్వడంపై మండలంలోని కుకునూర్‌పల్లి మహిళలు, పేదలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని కుకునూర్‌పల్లిలో శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పా ల్గొనడానికి తహశీల్దార్ప్రమీల, మండల ఈఓఆర్డీ సుబ్రహ్మణ్యమూర్తి, ఏఓ భోగేశ్వర్ తదితర అధికారులు గ్రామానికి చేరుకున్నారు. కార్యాలయంలో అధికారులు గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహిస్తుండగా అక్కడికి చేరుకున్న మహిళలు, గ్రామస్థులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎక్కడో రాజస్తాన్ నుం డి ఏడాది కిందట వచ్చిన స్వీట్‌హోమ్ వ్యాపారికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఏ లెక్కన ఇచ్చారని నిలదీశారు. వరంగల్ జిల్లాకు చెందిన ఒక చిరువ్యాపారి ఆరు నెలల కిందట గ్రామానికి వలస రాగా అతనికి కూడా ప్లాటు ఏ ప్రాతిపదికన కేటాయించారని ప్రశ్నించారు. అర్హులైన పేద లు దశాబ్దానికి పైగా ఎదురు చూస్తుం డగా స్థానికేతరులకు ఇచ్చారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పంచిన పట్టా సర్టిఫికెట్లను అధికారులు వెంటనే వెనక్కి తీసుకొని అర్హులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్థుల ఆందోళనకు కొండపాక మాజీ జడ్పీటీసీ సభ్యుడు తూం అంజిరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతూ దశాబ్దం కింద పేదల ఇళ్లస్థలాల కోసం ప్రభుత్వం చాకలి నారాయణ అనే వ్యక్తి దగ్గర 662, 783 సర్వేనెంబర్లలోని ఒకటిన్నర ఎకరాల భూమి ని కొనుగోలు చేసిందన్నారు. పేదలు చాలా మంది ఇళ్లస్థలాల కోసం గతంలోనే అర్జీలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారన్నారు. కాగా ప్రభుత్వం సేకరించి న భూమిని గ్రామానికి చెందిన ఒకరిద్దరు కలిసి ఇష్టారీతిగా పంచిపెట్టారని ఆరోపించారు. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొ ని అర్హులకు న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. లేకుంటే అక్కడ జరిపే నిర్మాణాలను మహిళలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనికి తహశీల్దార్ ప్రమీల స్పందిస్తూ తాను క్తొతగా వచ్చాననీ, విషయాన్ని పూర్తిగా పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తానని తెలిపారు. -
డామిట్ కథ అడ్డం తిరిగింది..!
నంద్యాల, న్యూస్‌లైన్: తన అనుయాయులకు ఇళ్ల స్థలాలు కట్టబెట్టడం ద్వారా లబ్ధిపొందాలని ఆశించిన ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చింది. స్థానికులను కాదని ఇతర ప్రాంతాలవారికి ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారంటూ శుక్రవారం ఊడుమాల్పురం గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్థల పరిశీలనకు వచ్చిన లబ్ధిదారులను అడ్డుకున్నారు. నంద్యాల మండలం ఊడుమాల్పురం గ్రామ శివార్లలోని 530, 532 సర్వే నంబర్లలో ఆరున్నర ఎకరా స్థలాన్ని 250మందికి దశల వారీగా ఇళ్ల స్థలాలుగా ఇచ్చారు. చివరి దశలో భాగంగా ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి గురువారం తన నివాసంలో 150మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. వీరు కోవెలకుంట్ల, సంజామల ప్రాంతాలకు చెందిన వారు కావడంతో ఊడుమాల్పురం గ్రామస్తులు ఆగ్రహించారు. ఊడుమాల్పురం గ్రామ శివార్లలోని స్థలాలను పరిశీలించడానికి వచ్చిన లబ్ధిదారులు అడ్డగించి తమ గ్రామ స్థలంలోకి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే శిల్పామోహన్రెడ్డిసైతం ఇక్కడికి రానీయబోమన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎమ్మెల్యే అనుయాయులు ఖంగు తినాల్సి వచ్చింది. ఆశించింది ఒకటయితే.. మరొకటి జరగడంతో ఎమ్మెల్యే శిల్పాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ సందర్భంగా గ్రామస్తుడు పుల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రాణాలైనా అర్పిచైనా స్థలాన్ని కాపాడుకుంటామని చెప్పారు. ‘‘ ఎన్నికల కోసం ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి ఈ డ్రామా ఆడుతున్నారు. గ్రామంలో పేదలకు ఇచ్చిన తర్వాత మిగిలితే ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందు కోసం రాజకీయ నాయకులతో కలిసి పోరాటాన్ని నిర్వహిస్తాం.’’ అని మాజీ ఎంపీపీ తిరుమలేష్ తెలిపారు. గ్రామంలో పేదల కడుపు కొట్టి నంద్యాల పట్టణంలోని వారికి స్థలాలు ఇస్తే చూస్తూ ఊరుకోబోమని గ్రామానికి చెందిన రాజగోపాల్‌రెడ్డి, మణిమోహన్‌రెడ్డి హెచ్చరించారు.