HP Petrol Bunk
-
బస్సులకిక బయటి ఇంధనమే!
ఖమ్మం మయూరి సెంటర్: ఆర్టీసీకి ఆయిల్ కంపెనీల నుంచి డీజిల్ సరఫరా చేసే క్రమంలో ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతుండటంతో బయటి బంకుల్లోనే డీజిల్ పోయించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దీన్ని పేరు చెప్పడానికి అంగీకరించని ఓ ఆర్టీసీ అధికారి ధ్రువీకరించారు. ట్యాక్స్‌లు ఇతరత్రా తేడాలతో ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్ ధర లీటర్‌గా రూ.97గా ఉంటోంది. కానీ, బయటి బంకుల్లో రూ.94.71గా ఉండటం గమనార్హం. ఇందులో భాగంగా రాష్ట్ర రవాణామంత్రి పువ్వాడ అజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా కేంద్రంలోని బంక్‌ల యజమానుల నుంచి కొటేషన్లు స్వీకరించగా, శ్రీశ్రీ హెచ్‌పీ బంక్ యజమాన్యం లీటర్ డీజిల్‌ను రూ.94.53కు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు మంగళవారం నుంచి బస్సులన్నింటినీ బంక్‌కు పంపించగా రాత్రి 11 గంటల వరకు బారులు తీరి కనిపించాయి. కాగా, విధులు ముగించుకుని 9.30 గంటల తర్వాత వచ్చిన డ్రైవర్లు బస్సులతో బంక్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. మళ్లీ ఉదయమే డ్యూటీకి వెళ్లాల్సిన తమను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని డ్రైవర్లు వాపోయారు. ఖమ్మం రీజియన్‌లోని అన్ని డిపోల బస్సుల్లో బుధవారం నుంచి బయటి బంకుల్లో డీజిల్ పోయించనున్నట్లు తెలిసింది. -
పెట్రోల్ బంకు వద్ద కలకలం
పశ్చిమగోదావరి, కొవ్వూరు: పట్టణంలో ఈజీకే రోడ్డులోని హెచ్‌పీ పెట్రోలు బంక్ వద్ద పెట్రోల్ కొట్టిస్తున్న సమయంలో బైక్ నుంచి మంటలు వ్యాపించాయి. పెట్రోలు కొడుతున్న సమయంలో మోటారుసైకిల్ పెట్రోలు పైప్ లీకేజీ ప్రమాదానికి కారణంగా తెలిసింది. మండలంలో పశివేదల గ్రామానికి చెందిన మజ్జి దుర్గాప్రసాద్‌కు చెందిన మోటారుసైకిల్‌గా స్థానికులు చెబుతున్నారు. బైక్ నుంచి మంటలు రావడంతో బంకు సిబ్బంది, వాహనచోదకులు పరుగులు తీశారు. దుర్గాప్రసాద్ సైతం బంకుకు కొద్ది దూరంలో బైక్‌ను వదలి పరుగు తీశాడు. మంటలు చెలరేగిన వాహనాన్ని స్థానికులు, బంకు సిబ్బంది బంకు నుంచి బయటకు ఈడ్చుకురావడంతో పెనుప్రమాదం తప్పింది. మోటారుసైకిల్ పూర్తిగా కాలిపోయింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బంకు సిబ్బంది అగ్నిమాపక సిలెండర్‌తో మంటలను అదుపు చేశారు. -
వాటర్ కాదు పెట్రోలే..
సాక్షి, గండేపల్లి (తూర్పు గోదావరి): పెట్రోలు కోసం బంక్‌కు వెళ్లిన ఆ వాహనదారులు షాక్ తిన్నారు. పెట్రోల్‌కు బదులు నీళ్లు రావడంతో అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మల్లేపల్లి శివారున ఉన్న శ్రీధాత్రీ ఎంటర్ప్రైజెస్ (హెచ్‌పీ) పెట్రోల్ బంకులో తాళ్లూరుకు చెందిన ఆరుగొల్లు పండు, రైతులు, మల్లేపల్లి, ఇతర గ్రామాలకు చెందిన వాహనదారులు తమ ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ పోయించుకున్నారు. ఆస్పత్రి నిమిత్తం రాజానగరం వెళుతున్న పండు వాహనం బంక్‌కు కొంత సమీపంలో నిలిచిపోయింది. వాహనంలో ఉన్న పెట్రోల్‌ను సీసాలోకి నింపి బంకు వద్దకు చేరుకున్న వినియోగదారులు ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ సీఐ ఎన్ రమేష్, విజిలెన్స్ తహసీల్దార్ గోపాలరావు అక్కడికి చేరుకుని వినియోగదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్ తనిఖీకి సంబంధించిన వ్యక్తి అందుబాటులో లేనందున ప్రస్తుతానికి పెట్రోల్ వినియోగాన్ని నిలిపివేయించినట్టు తెలిపారు. జరిగిన విషయంపై వివరాలు నమోదు చేసుకున్నామని తదుపరి చర్యలు తనిఖీ అనంతరం ఉంటాయని రెవెన్యూ అధికారి జి.కృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్ వినియోగాన్ని నిలిపివేయించామని తనిఖీ నిర్వహించేంత వరకు ఒక వ్యక్తిని బంక్ వద్ద ఉంచనున్నట్టు వెల్లడించారు. ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను శాంతింపజేశారు. పెట్రోల్ ఉండే రసాయనపదార్థం వల్లే నీరులా తేలిందని బంక్ నిర్వాహకులు, అధికారులు చెబుతున్నారు. అనుమానం వచ్చిన వినియోగదారులు వాహనంలో పోయించిన పెట్రోల్‌ను సీసాల్లో మార్చడంతో సీసా అడుగు భాగంలో నీరు, పైభాగంలో పెట్రోల్ తేలడంతో అధికారులు, పెట్రోల్ కోసం వచ్చిన ఇతర వినియోగదారులు అవాక్కయ్యారు. ఇటువంటి సంఘటనలు గతంలోనూ జరిగాయని, అయినా బంక్ నిర్వహణలో మార్పు రావడం లేదని వినియోగదారులు బాహాటంగానే చెబుతున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. -
కట్టడి లేని కల్తీ దందా
సాక్షి,సిటీబ్యూరో: చైతన్యపురిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో ఇటీవల వాహనాల్లో పెట్రోల్ నింపుకుంటే సదరు వాహనాలు కొద్దిదూరం వెళ్లి ఆగిపోయాయి. ఏం జరిగిందో పరీక్షించగా పెట్రోల్‌లో నీళ్లు కలిసినట్టు గుర్తించారు. దాంతో కొందరు వాహనదారులు వెనుదిరిగి వచ్చి ఆ బంకులో పెట్రోల్‌ను సీసాల్లో నింపి పరిశీలించగా బాటిల్ అడుగున నీరు కనిపించడంతో కల్తీని నిర్ధారించుకున్నారు. అంతకు ముందు పెట్రోలు పోయించుకున్న వాహనాలకు సైతం అదే సమస్య తలెత్తడంతో వారూ బంక్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఇలాంటికల్తీ సంఘటనలు నగరంలో తరచూ బయటపడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపడం తప్ప.. కల్తీ జరిగిందా.. లేదా.. కల్తీ తేలితే ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల కల్తీ ఆయిల్ మాఫీయా మహానగరంలో పాగా వేస్తున్నట్టు వస్తున్న అనుమానాలకు ఈ ఇంధన కల్తీ బలం చేకూరుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు ఎగబాగుతుండటంతో గుట్టుచప్పుడు కాకుండా పెట్రోల్ బంకుల్లో కల్తీ జరిగిపోతోంది. అధికారికంగా అయిల్ కంపెనీల నుంచి పది శాతం ఇథనాల్‌తో కూడిన ఇంధనం సరఫరా అవుతుండగా.. మరోవైపు అక్రమంగా ట్యాంకర్ల కొద్దీ టిన్నర్, నాఫ్తా, కిరోసిన్ కూడా పెట్రోల్ బంకులకు దిగుమవుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో పెట్రోల్ బంక్‌ల్లో కల్తీ వ్యవహరానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పెట్రోల్ బంకుల్లో ఇంధనం నాణ్యతపై తనిఖీ చేయాల్సిన పౌరసరఫరా శాఖాధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరించడంతో కల్తీ వ్యవహారం బంకుల ఇష్టారాజ్యమైంది. నగరంలో యథేచ్చగా కల్తీ శివార్లోని బంకులు అధికంగా కల్తీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇందుకు పలు సంఘటనలు బలం చేకూర్చుతున్నాయి. నిత్యం నగరానికి పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలు సాగిస్తున్నందున ఇక్కడి పెట్రోల్ బంకులకు ఇంధన డిమాండ్ బాగానే ఉంటుంది. దీంతో వాటి యాజమాన్యాలు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కారుచౌకగా బయోడిజిల్, కిరోసిన్, నాఫ్తా ఆయిల్ తెప్పించి కల్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ట్యాంకర్లు సిటీకి దిగుమతి అవుతున్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్ పెట్రోల్ బంకులు æఆయిల్ కంపెనీల ప్రధాన యూనిట్లకు అనుసంధానమై ఉండడంతో ఇంధనంలో కల్తీ జరిగితే రీడింగ్, డెన్సిటీ ద్వారా బయటపడుతుంది. సాధారణంగా రోజుకు 25 వేల లీటర్ల పెట్రోల్, 40 వేల లీటర్ల డీజీల్ విక్రయించే బంకులు పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్‌గా మారాలి. అయితే నగరంలోని బంకుల్లో సేల్స్ ఉన్నా.. కొన్ని పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్ బంక్‌లుగా మారకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దెబ్బ తీస్తున్న ఇథనాల్ మిళితం ఆయిల్ కంపెనీల నుంచి ఇథనాల్ కలిసిన పెట్రోల్ సరఫరా కూడా నిల్వలను దెబ్బతీస్తోంది. ఇథనాల్ మిళితమైన పెట్రోల్ నిల్వల్లో నీరు కలిస్తే క్రమంగా పెట్రోల్ నీరుగా మారుతుంది. చమురు సంస్థలు అధికారికంగానే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం కింద పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను కలుపుతున్నట్లు కంపెనీలే చెబుతున్నాయి. ఇథనాల్‌ను ఇంధనంతో కలపడం వల్ల పెట్రోల్ ఆక్టేన్ సంఖ్య పెరుగుతుంది. ధర కూడా తగ్గించాల్సి ఉంటుంది. కానీ, చమురు సంస్థలు ఇవేమి పట్టించుకోకుండా పెట్రోల్‌లో సుమారు పదిశాతం ఇథనాల్ కలిపి సరఫరా చేయడం విస్మయానికి గురిచేస్తోంది. శాంపిల్స్ సేకరిస్తున్నారా..? పెట్రోల్ బంక్‌కు ట్యాంకర్ రాగానే ప్రత్యేకంగా శాంపిల్స్ తీసి ఇన్వాయిస్తో సహా భద్రపరచాలి. ఒకవేళ వినియోగదారుడు కల్తీ జరిగిందని అనుమానిస్తే బ్లాటింగ్ పేపర్, డెన్సిటీ పరీక్షలు చేయాలి. పరీక్షల్లో ఇన్వాయిస్ డెన్సిటీకి బంక్‌లోని పెట్రోల్ డెన్సిటీకి ఏమాత్రం వ్యత్యాసం వచ్చినా కల్తీ జరిగినట్టే. ఒకవేళ ట్యాంకర్ శాంపిల్స్ భద్రపర్చలేదంటే ఆ బంకుల్లో కల్తీ జరుగుతున్నట్లు అనుమానించవచ్చు. కంపెనీ ఆయిల్ సరఫరా చేసే సమయంలోనే పెట్రోల్, డీజిల్ సాంధ్రత ఎంతుండాలనేది ధృవీకరిస్తారు. ఇలా పెట్రోల్‌లో డెన్సిటీ నిర్థారించే హైడ్రోమీటర్లు థర్మామీటర్‌తో కూడిన కిట్లను బంక్ యజమానులు అందుబాటులో ఉంంచాలి. వాస్తవంగా పెట్రో, డీజిల్‌లో కల్తీ నిర్థారించే హైడ్రోమీటర్, థర్మామీటర్, జార్లతో కూడిన కిట్లు మెజార్టీ బంకుల్లో కనిపించవు. బంకుల్లో తనిఖీలు అంతంతే.. పెట్రోల్‌లో యథేచ్చగా కల్తీ జరుగుతోందని వినియోగదారులు గగ్గోలుపడుతున్నా పౌరసరఫరాల శాఖాధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలు, శాంపిల్స్ సేకరించి చేతులు దులుపుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖ ఎప్పటికప్పుడు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి. అధికారులు వద్ద కూడా పరీక్షలు నిర్వహించేందుకు పరికరాలు ఉండాలి. అయితే, గ్రేటర్లో అధికారుల వద్ద అలాంటి పరికరాలు ఉండవు. పౌరసరఫరాల శాఖ తనిఖీలు చేసి రెడ్‌హిల్స్‌లోని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ పరీక్షకు పంపించిన శాంపిల్స్ సంఖ్య వేళ్లపై లెక్కపెట్టొచ్చు. సదరు సంస్థ కూడా కల్తీ నిర్థారణ జరిగినట్లు నివేదికలు పంపించిన దఖాలాలు కూడా ఉండడం లేదు. కల్తీపై కఠిన చర్యలు పెట్రోల్, డీజిల్ కల్తీ చేస్తే బంకులపై చర్యలు తప్పవు. కొన్ని బంకుల్లో ఇథనాల్ కారణంగా పెట్రోల్ నీరుగా మారుతుందని డీలర్లు చెబుతున్నారు. శాంపిల్స్ సైతం సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నాం. కల్తీ బయటపడితే బంకులనే సీజ్ చేసి డీలర్లపై చర్యలు తీసుకుంటాం.– రాథోడ్, డీఎస్ఓ, రంగారెడ్డి జిల్లా -
పెట్రోల్‌లో నీళ్లు..
చైతన్యపురి: చైతన్యపురిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో నీళ్లు కలిసిన పెట్రోలు వస్తుందని వాహనదారులు సోమవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. పెట్రోల్ పోయించుకోగానే స్టార్ట్ చేయటానికి ప్రయత్నించిన వాహనాలు మొరాయించడంతో అనుమానం వచ్చిన ద్విచక్రవాహన దారులు బాటిళ్లలో పెట్రోల్ పోయించుకున్నారు. బాటిల్ అడుగులో నీరు, పైన పెట్రోలు ఉండటాన్ని గుర్తించి ఆందోళనకు దిగారు. అంతకు ముందు పెట్రోలు పోయించుకున్న పలువరు వాహనాలు ఆగిపోవటంతో బంక్ వద్దకు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో వాహనదారులు బంక్ వద్ద బైటాయించి ఆందోళనకు దిగారు. గతంలోనూ ఇదే పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌లో నీళ్లు వచ్చాయని, కల్తీ చేస్తున్న బంక్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న చైతన్యపురి పోలీసులు ఆందోళన చేస్తున్నవారితో మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే సంబందిత అధికారులకు సమాచారం ఇచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐసాయి ప్రకాష్ తెలిపారు. -
పెట్రోల్ బంకులో పెట్రోలుతోపాటు నీరు
హైదరాబాద్ : చైతన్యపురిలోని హెచ్‌పీ పెట్రోల్ బంకులో శుక్రవారం పెట్రోలు కొట్టించుకున్న వాహనదారులకు పెట్రోలుతో పాటు నీరు కూడా వచ్చింది. ఓ వ్యక్తి బాటిల్లో పెట్రోల్ పోయించుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి పెట్రోల్ బంకు యజమాన్యాన్ని ఈ విషయం గురించి అడగటంతో.. వారు భూగర్భంలోని ట్యాంకర్‌ను పరిశీలించగా అందులో నీళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పెట్రోలు కొట్టించుకున్నవారికి తిరిగి డబ్బులు ఇచ్చేశారు. కాగా కొంతమంది వ్యక్తులు ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డబ్బు బాకీ పడ్డాడని.. చితక్కొట్టారు!
-
డబ్బులివ్వలేదని చిత్రహింసలు
హైదరాబాద్: మానవత్వం మంట గలిసింది. పైశాచికత్వం విరుచుకుపడింది. డబ్బు బాకీ పడ్డాడని జహీర్‌ఖాన్ అనే వ్యక్తిని హైదరాబాద్ కూకట్‌పల్లిలోని సుమిత్రానగర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సిబ్బంది చితకబాదారు. గుప్తనిధులు చూపిస్తానని బంక్ యజమానురాలి నుంచి జహీర్‌ఖాన్ దాదాపు 10 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. తన డబ్బు తిరిగి ఇవ్వాలని బంక్ యజమానురాలు జహీర్‌ఖాన్‌పై ఒత్తిడి తెచ్చారు. జహీర్‌ఖాన్ డబ్బు తిరిగివ్వకపోవడంతో యజమానురాలి ఆదేశంతో బంక్ సిబ్బంది జహీర్‌ఖాన్‌ను రెండు రోజులుగా బంధించి హింసించారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. యజమానురాలితో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.